బీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ.. నల్లగొండ ఎంపీ టికెట్ కోసం ముగ్గురు ప్రయత్నాలు?

by GSrikanth |
బీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ.. నల్లగొండ ఎంపీ టికెట్ కోసం ముగ్గురు ప్రయత్నాలు?
X

దిశ బ్యూరో, నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికలు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. నల్లగొండ ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ అధిష్టానానికి తమ మనసులో మాట కూడా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ కేటాయించడంతో ఎంపీ స్థానానికి అవకాశం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడు గుత్తా అమిత్ ను బరిలో దించే యోచనలో ఉన్నారు. కాగా, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి కూడా అసెంబ్లీ టికెట్ ఆశించినా రాకపోవడంతో ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, చిట్యాల పీఏసీఎస్ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ ముగ్గురిలో బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి ఎంపీ టికెట్ కేటాయిస్తుందో వేచి చూడాలి.


కొడుకు కోసం గుత్తా ప్రయత్నాలు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి నల్లగొండ మరొకటి భువనగిరి. ఈ రెండింటిలో ప్రస్తుతం నల్గొండ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తుంది. అధిష్టానానికి తమ మనసులో మాట కూడా చెప్పారని సమాచారం. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కూడా మునుగోడు లేదా నల్లగొండ నియోజక వర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తికరపరిచారు. అంతేకాకుండా ఎంపీ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని గతంలో ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. అయితే సిట్టింగ్ అభ్యర్థులకు సీటు కేటాయించడంతో ఆయనకు టికెట్ రాలేదు.

పార్టీ అధిష్టానం పార్లమెంటు ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎలాగైనా ఈసారి తన కుమారుడిని పోటీ చేయించి ప్రజా ప్రతినిధిగా చూడాలని సుఖేందర్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టులతో మాట్లాడుతూ తన మనసులో మాటను బయటపెట్టారు. పార్టీ అవకాశం ఇస్తే అమిత్ ను ఎంపీగా పోటీ చేయిస్తానని పేర్కొన్నారు. తనకు కూడా వయసు మీద పడుతుండడంతో అవకాశాలు ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ కావాలంటే ఆయన గురించి వేరే వాళ్ళు చెప్పాల్సిన పనిలేదు. గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకుగా అమిత్ అందరికీ సుపరిచితుడే. ఈ జిల్లాలో సీనియర్ నాయకుడిగా గుత్తా కు పేరుంది. స్వయంగా కేసీఆర్. కేటీఆర్ లతో అత్యంత చనువు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా సుమారు 30 ఏళ్లుగా కేసీఆర్ తో కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలో అమిత్ కు టికెట్ తెప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని సమాచారం.

పోటీలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి...

బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 2001 నుంచి పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల పనిచేస్తూ వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధిష్టానం తనకు ఏ పని అప్పగించినా తూచా తప్పకుండా పనిచేస్తూ అందరి మన్ననలు పొందిన నాయకుడు. 2014 నుంచి నల్లగొండ శాసనసభకు పోటీ చేయాలని పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నాడు. కానీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు. రెండు సార్లు ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి కట్టబెడతారని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరికి అది కూడా లేకుండా పోయింది. గత ఎన్నికల్లో నల్లగొండ శాసనసభకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించడంతో రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డితో సంప్రదింపులు జరిపి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి పార్టీ కోసం పనిచేసేలా చేశారు. పార్టీ ఇచ్చిన హామీ మేరకు తనకు ఎంపీ టికెట్ కావాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లాలో కూడా కిషన్ రెడ్డికి అందరితో మంచి సంబంధాలే ఉన్నాయి. అజాతశత్రువుగా పేరుంది. అంతేకాకుండా నేరుగా కేసీఆర్ , కేటీఆర్ వద్దకు వెళ్లి మాట్లాడే చనువు కూడా ఉంది. వారితో పాటు గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఎస్ నిరంజన్ రెడ్డి తో బంధుత్వం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే 23 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన చాడాకు ఇప్పటికైనా పార్టీ గుర్తిస్తుందా లేదా వేచి చూడాల్సిందే.

అవకాశం కల్పించాలంటున్న సుంకరి...

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్యాల పీఏసీఎస్ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, జిల్లా డీసీసీబీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆ పదవి కోసం పోటీపడ్డారు. కానీ పార్టీ అధిష్టానం అనేక కోణాల్లో ఆలోచించి మల్లేష్ గౌడ్ ను బుజ్జగించి వేరే వాళ్లకు ఆ పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత కార్పొరేషన్ పదవుల కోసం కూడా ప్రయత్నించినట్లు సమాచారం. అయినా అవి దక్కకపోయినా పార్టీకి నిబద్ధత గల కార్యకర్తగా గత ఎన్నికల సందర్భంగా, అంతకుముందు పార్టీ అప్పగించిన పనిని చిత్తశుద్ధితో చేసిన విషయం తెలిసిందే. అయితే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్ కు దరఖాస్తు పెట్టుకున్నట్లు సమాచారం. జిల్లాలో బలమైన సామాజిక వర్గం కలిగిన బీసీలకు ఈసారి ఎలాగైనా టికెట్ ఇచ్చి గుర్తించాలని ఆయన విన్నవిస్తున్నారు. మల్లేష్ గౌడ్ గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంలోనే నాటి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు, ఇప్పటి బీఆర్ఎస్ నేత కే.కేశవరావు తో సంబంధాలు ఉన్నాయి. వారితోపాటు పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు అందరితో కూడా చనువు ఉందని, వారి ద్వారా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ముగ్గురు నేతలు టికెట్ కోసం సీరియస్ గానే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ ఎవరిని గుర్తించి ఎవరి మెడలో దండ వేస్తుందో వేచి చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed