ఆన్‌లైన్‌లో ఆలయ సేవలు.. భక్తుల కోసం సరికొత్త యాప్ తెస్తున్న దేవదాయ శాఖ

by karthikeya |   ( Updated:2024-10-16 03:11:10.0  )
ఆన్‌లైన్‌లో ఆలయ సేవలు.. భక్తుల కోసం సరికొత్త యాప్ తెస్తున్న దేవదాయ శాఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో అన్ని రకాల సేవలను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించేందుకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం ‘టీ యాప్‌ ఫోలియో’ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా మీ సేవ కేంద్రాల ద్వారానూ ఈ అవకాశాన్ని కల్పించనుంది. ఇప్పటికే ఎనిమిది ఆలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందుబాటులో ఉంచగా.. మొత్తం 39 ప్రధాన ఆలయాలకు విస్తరించనుంది. అభిషేకం చేయాలనుకునేవారు యాప్ కు వెళ్లి దానికి అయ్యే రుసుమును చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాకుండా దర్శనం, సేవల టికెట్లు కూడా యాప్ లో అందుబాటులో ఉంచనున్నారు. దర్శనం కోసం ఆలయాల వద్ద కియోస్క్‌ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

మొత్తం 39 ఆలయాల్లో..

రాష్ట్రంలోని యాదాద్రి, బాసర, కొండగట్టు, గణేశ్ టెంపుల్ (హైదరాబాద్), భద్రాచలం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, ఉజ్జయిని మహాంకాళి (సికింద్రాబాద్), మల్లి కార్జున స్వామి (కొమరవెల్లి) ఆలయాల్లో ఆన్ సేవలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. బ్రేక్ దర్శనం, శీఘ్ర దర్శనం సహా అన్ని సేవలు సైతం అందుబాటులో ఉండటంతో భక్తుల సంఖ్య సైతం పెరిగినట్లు వెల్లడించారు. మిగిలిన ఆలయాల్లో కూడా త్వరిత గతిన ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అందుకు సంబంధించిన కసరత్తును చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

కీసరగుట్ట (శ్రీరామలింగేశ్వరస్వామి), నాచారం గుట్ట (శ్రీలక్ష్మి నరసింహ స్వామి టెంపుల్), చెరువు గట్టు (పార్వతి జడల రామలింగేశ్వర స్వామి), మన్యంకొండ (శ్రీలక్ష్మివేంకటేశ్వర స్వామి) సమ్మక్క- సారలమ్మ జాతర మేడారం, వీరభద్రస్వామి టెంపుల్ (కురవి), వెంకటేశ్వర స్వామి టెంపుల్ (జమలాపురం), శ్రీలక్ష్మి నరసింహ స్వామి (ధర్మపురి), భద్రకాళి (హన్మకొండ), గుడిమల్కాపుర్ (శ్రీ జమ్ సింగ్ బాలజీ వెంకటేశ్వరస్వామి) ఇలా పలు ఆలయాలను త్వరలోనే భక్తులకు ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు. జాతర, బోనాల సమయాల్లో మేడారం జాతర ప్రసాదం కూడా యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

23 రకాల ఆర్జిత సేవలు

సుప్రభాతం, అభిషేకం, అంతర్యాల అర్చన, సహస్త్రనామార్చన, నిత్యకల్యాణం, వెండి రథసేవ, ఆలయ చుట్టు సేవ, వాహనసేవ, పవళింపుసేవ, ఉపాలయాల్లో అర్చనలు, గోపూజ, స్పెషల్ దర్శనం, సంధ్యాహారతీ, సువర్ణ తులసీ అష్టోత్తర నామార్చన, సువర్ణ పుష్ప అష్టోత్తరనామార్చన, పట్టాభిషేకం, సుదర్శన హోం, లక్ష్య కుంకుమార్చన, వేద ఆశీర్వచనం, స్వామివారికి తులసీమాల అలంకరణ, నిత్యసర్వ కైంకర్యసేవ, నిత్యపూల అలంకరణ సేవ, తులాభరణం. వీటితో పాటు వారంవారం నిర్వహించే కార్యక్రమాలు ఇలా పలు సేవలను అందుబాటులో ఉంచనున్నారు. ఇవే కాకుండా 11 రకాల శాశ్వత పూజలు, శాశ్వత అన్నదానంలో మహారాజపోషకులు, రాజపోషకులు, పోషకులు ఇలా అన్ని సేవలను అన్ లైన్ లో పొందే అవకాశం కల్పిస్తున్నారు.

ఆలయ చరిత్ర సైతం..

టీ యాప్‌ ఫోలియో మొబైల్‌ యాప్‌ లో ఆలయ సేవలే కాకుండా ప్రతి ఆలయం చరిత్రను పొందుపర్చనున్నట్లు సమాచారం. ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారు? విస్తీర్ణం, వసతులు, సేవా, పూజా కార్యక్రమాలు తదితర అన్ని వివరాలను అప్ లోడ్ చేస్తున్నట్లు సమాచారం.

భక్తుల సౌలభ్యం కోసమే - కొండా సురేఖ, మంత్రి

భక్తుల సౌలభ్యం కోసం ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆలయంలో జరిగే ఆర్జిత పూజల దగ్గర నుంచి, దర్శనాలు, వసతులు ఇలా అన్ని సేవలను భక్తులు బుక్ చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆలయసేవలను భక్తుల ముంగిట ఉంచుతున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 8 ఆలయాల్లో ఆన్ సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మిగిలిన ఆలయాల్లోనూ ఆన్ లైన్ సేవలు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం.

Advertisement

Next Story

Most Viewed