బీఆర్ఎస్ నేత‌ల‌కు చేదు అనుభ‌వం

by srinivas |   ( Updated:2023-12-19 04:24:03.0  )
బీఆర్ఎస్ నేత‌ల‌కు చేదు అనుభ‌వం
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: బీఆర్‎ఎస్ నేత‌ల‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఝ‌ల‌క్ ఇస్తున్నారు. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు వెళ్తున్న కొంత‌మంది ప్ర‌జాప్ర‌తినిధులు, నేత‌ల‌కు ముఖం మీదనే నో చెప్పేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలోకి ఆహ్వానించినా... రాయ‌బారాలు పంపినా ప‌ట్టించుకోని బీఆర్ఎస్ నేత‌ల‌పై క‌టువుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని 12 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులే ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అటు రాష్ట్రంలోనూ అధికార మార్పిడి జ‌ర‌గ‌డంతో వ్యాపార సంబంధాలు క‌లిగి ఉన్న‌, నామినేటెడ్ ప‌ద‌వులు ఆశిస్తున్న, భ‌విష్య‌త్‌ను ప‌క‌డ్బందీగా చేసుకునేందుకు, ఎలాంటి రాజ‌కీయ ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ముఖ్య‌నేత‌లు, క్షేత్ర‌స్థాయిలో ప‌లుకుబ‌డి ఉన్న నేత‌లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు స‌న్నిహితులైన వారిని బీఆర్ఎస్ నేత‌లు క‌లుస్తున్నారు.

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం కొండా సురేఖ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించ‌డం, మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం జ‌రిగిపోయాయి. సురేఖ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన ఐదు రోజుల త‌ర్వాత కొంత‌మంది కార్పొరేట‌ర్లు కొండా ముర‌ళీధ‌ర్‌రావుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డానికి వెళ్ల‌గా ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు స‌మాచారం. గ‌తంలో పార్టీలోకి రావాల‌ని కోరినా కార్పొరేట‌ర్లు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇప్పుడు వారు కాంగ్రెస్‌లోకి వ‌స్తామ‌ని స్వ‌యంగా వెల్ల‌డించారు. అయితే వారికి నో చెప్పారట. ఇప్పుడు తనతో పనిచేయ‌డానికి, తన కోసం ప‌ని చేయ‌డానికి చాలా మంది నేత‌లు సిద్ధంగా ఉన్నారన్నారట. అంతేకాకుండా ఇప్పుడు తమ కోసం ప‌ని చేయ‌లేనని చెప్పారట. ఏదైన ఉంటే త‌ర్వాత చుద్దామంటూ మాట దాట‌వేస్తున్నారంట‌.

ఇక న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన దొంతి మాధ‌వరెడ్డికి చేరిక‌ల‌పై రాయ‌భారం పంపుతున్న కౌన్సిల‌ర్లు, మండ‌ల స్థాయి బీఆర్ ఎస్ నేత‌లు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌కు రావొద్దని ఖ‌రాకండి స‌మాధాన‌మే అందుతున్న‌ట్లు నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుపై అత్యంత భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న 26 ఏళ్ల‌ య‌శ‌స్విని రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నిర్మాణం, అధికార వినియోగంలోనూ ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అందుకే బీఆర్‌ఎస్ నుంచి చేరేందుకు వ‌స్తున్న వారిపై ఆచితూచిగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

అటు వ‌ర్ధ‌న్న‌పేట‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, ప‌ర‌కాల‌, మ‌హ‌బూబాబాద్‌, డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, జ‌న‌గామ‌లో బీఆర్ఎస్ నేతలు క‌డియం శ్రీహ‌రి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో టీపీసీసీ నాయ‌కురాలు సింగ‌పురం ఇందిర‌, జ‌న‌గామ‌లో డీసీసీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్ర‌తాప్‌రెడ్డి ప‌ట్టు నిలుపుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అవ‌కాశాల కోసం ఇద్ద‌రు నేత‌లు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీగా అవ‌కాశం చిక్కితే నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్నారు. అయితే పార్టీలోకి వచ్చేందుకు ఆస‌క్తిగా ఉన్న బీఆర్‌ఎస్‌నేత‌ల‌కు కాస్త క‌టువుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమాధానం చెబుతున్నారట. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed