Harish Rao : కాంగ్రెస్ వచ్చింది.. సంక్షేమ పథకాలు మాయం చేసిన మార్పు తెచ్చింది : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-22 11:59:48.0  )
Harish Rao : కాంగ్రెస్ వచ్చింది.. సంక్షేమ పథకాలు మాయం చేసిన మార్పు తెచ్చింది : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : మార్పు తెస్తామని ప్రజలను నమ్మించిన కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను మాయం చేసిన మార్పు తెచ్చిందని మాజీ మంత్రి టీ.హరీష్ రావు(Harish Rao)ఎద్దేవా చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు కాంగ్రెస్ వారి పాలనలో ఏం కోల్పోయారని అడుగుతున్నాడని, కాంగ్రెస్ వచ్చాక రైతుబంధు పోయిందని, బతుకమ్మ చీరలు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషియన్ కిట్, బీసీ, దళిత, మైనార్టీ బంధు ఆగిపోయాయన్నారు. ఇదే కాంగ్రెస్ వచ్చాక వచ్చిన మార్పు అని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల హమీలు మహాలక్ష్మి రూ.2,500, తులం బంగారం, ఆరుగ్యారెంటీ పథకాల హామీలు అమలు కాలేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి బాండు పేపర్ రాసిచ్చి ఖమ్మం వాసులను మోసం చేశాడన్నారు. మహాలక్ష్మి పథకం రూ.2500పథకం కింద 11నెలలుగా 27,500 రూపాయలను కాంగ్రెస ప్రభుత్వం ఒక్కో మహిళకు బకాయి పడిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఈ 11 నెలల్లో 6 లక్షల పెళ్లిళ్లు జరిగాయని, అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 6 లక్షల తులాల బంగారం తెలంగాణ ఆడబిడ్డలకు బాకీ పడిందని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు ఏడాదిలోపునే అనుకుంటున్నారని, మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ ఉచిత బస్సు తప్ప అంతా తుస్సు అన్నారు. ఉచిత బస్సు పెట్టి బస్సుల ట్రిప్పులను తగ్గించి మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అందరి దేవుళ్లపై ఒట్టు పెట్టి పంద్రాగస్టు కల్లా 2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి దేవుళ్లను, రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడని విమర్శించారు. సీఎం రేవంత్ తీరు అయితే ఒట్లు, లేకపోతే తిట్లు పనిచేసేది తక్కువ, మాటలెక్కువని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏమో అదానీని అరెస్టు చేయలంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదానీ వద్ద 100కోట్లు తెచ్చుకున్నాడని, లోపలికెళ్ళి వేరే..బయటకెళ్లి వేరే విరాళాలు ఇచ్చాడని దీనిపై విచారణ చేసి సీఎంను అరెస్టు చేయాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేదించి అక్రమ కేసులు పెడితే మేం అధికారంలోకి వచ్చాక మూల్యం చెల్లించక తప్పదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు చేసేదాక బీఆర్ఎస్ వదిలిపెట్టబోదన్నారు.

Advertisement

Next Story

Most Viewed