2, 3 స్థానాల కోసం ఆ పార్టీల పోటీ : Kishan Reddy

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-09 16:46:57.0  )
Union Minister Kishan Reddy Asks CM KCR for Evidence Of Cloudburst
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ 2, 3 స్థానాల కోసం పోటీ పడుతున్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలుపు బీజేపీదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఢిల్లీ వసంత్ కుమార్, ఇల్లందుకు చెందిన లక్కినేని సురేందర్, తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల, కిషన్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలో చేర్చుకున్నారు. కాగా కిషన్ రెడ్డికి వసంత్ కుమార్ హనుమ ఫలాన్ని అందజేశారు.

అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో విజయానికి సూచికగా ఆ ఫలాన్ని విజయ ఫలంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎలక్షన్‌కు బీజేపీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న మార్పు, రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తేల్చి చెప్పారు. తెలంగాణలో నిశ్శబ్ధ విప్లవం రాబోతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలమంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు.

రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్లు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయని ఆరోపించారు. ప్రధాని నాయకత్వంపై ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయని, సీఎం కేసీఆర్ అవినీతి ప్రభుత్వం పోవాలని, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనను చూశారని, ఉద్యమకారుల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదని మండిపడ్డారు. 1200 మంది అమరుల ఆకాంక్షలను బీఆర్ఎస్ పార్టీ గౌరవించలేదని విమర్శించారు. ఉద్యమద్రోహులందరూ మంత్రిపదవుల్లో, ప్రగతి భవన్లో ఉన్నారని మండిపడ్డారు.

అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ పెరుగుతోందన్నారు. ఎన్నికలకు ఇక 50రోజులే మిగిలి ఉన్నందున... డబ్బు, మద్యం ప్రభావం లేకుండా, అధికార దుర్వినియోగం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రజల్లో బీజేపీపై విశ్వాసం ఉందన్నారు. అధికార బీఆర్ఎస్ డబ్బు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గెలవాలనుకుంటోందని మండిపడ్డారు. అవినీతి, కుటుంబ పాలన నుంచి.. ప్రజాపాలన, సకల జనుల తెలంగాణ రావాల్సిన అవసరం ఉందని, అది బీజేపీ ద్వారానే సాధ్యమని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు. అన్ని కమిటీలను ప్రకటించామని. సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానున్న వన దేవతలు సమ్మక్క సారలమ్మను ఈనెల 11వ తేదీన దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నట్లు, అలాగే మోడీకి ధన్యవాదాలు తెలపనున్నట్లు వెల్లడించారు.

పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక డబ్బు ఖర్చు చేసే సంస్కృతిని తెలంగాణకు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. వేల ఎకరాల భూమిని అక్రమంగా అమ్ముకుని ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలుద్దామని కేసీఆర్ నిర్ణయించుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే ప్రతీ నియోజకవర్గానికి రూ.15 కోట్లను చేర్చారని దుయ్యబట్టారు. ఇతర పార్టీల నాయకులను వెలగట్టి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇచ్చి కొంటున్న నేత కేసీఆర్ అని విమర్శించారు.

మద్యం తాగించే విషయంలో, డబ్బులు ఎరవేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని విమర్శించారు. నిక్కచ్చిగా పనిచేసే రాజకీయ కార్యకర్తలకు అవకాశం లేకుండా.. డబ్బులున్నోళ్లే గెలిచేలా కేసీఆర్ రాజకీయ వాతావరణాన్ని మార్చారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే పింఛను వస్తది, దళితబంధు, బీసీ బంధు వస్తదని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలమీద, ప్రజాస్వామ్యం మీద బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు నమ్మకం లేదని దుయ్యబట్టారు. బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లు వస్తదని, పింఛన్లు పోతయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ గెలిస్తేనే అన్నీ సమయానికి ప్రజల అకౌంట్లలోకి వస్తాయని, ఒకటో తేదీకే జీతాలు వస్తాయని స్పష్టం చేశారు. అమరవీరులు కలలుగన్న బంగారు తెలంగాణను సాధించుకోవాలంటే... బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ చిన్నమ్మ సుశ్మా స్వరాజ్ పార్లమెంటు వేదికగా తెలంగాణ యువతకు ధైర్యం చెప్పారని, రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణకు బీజేపీ మద్దతు ఉందన్న తర్వాతే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతమయిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీని నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ నేతల దొంగ మాటలు, బ్రోకర్ గాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed