పేద ‘రాజు’లకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |
పేద ‘రాజు’లకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో క్షత్రియ భవన్‌కు అవసరమైన స్థలాన్ని ఇస్తామని, నిర్మాణానికి అవసరమైన అనుమతులు కూడా ఇస్తామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదే తీరుల ప్రభుత్వానికీ తగిన సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీగా ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నదని, అందులో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. క్షత్రియ సేవా సమితి నిర్వహించిన సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ ప్రసంగిస్తూ... హైదరాబాద్ సిటీ అభివృద్ధిలో వేర్వేరు రూపాల్లో ‘రాజు’ల కృషి, పట్టుదల, సహకారం ఉన్నదని, రానున్న ఫోర్త్ సిటీలో సైతం అదే కొనసాగాలని ఆకాంక్షించారు. క్షత్రియుల్లోనూ పేదలు ఉన్నారని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తామని, అర్హులైనవారి వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. నిబద్ధత, కష్టపడేతత్వం, పట్టుదల ఉండే క్షత్రియుల సహకారాన్ని ప్రభుత్వం కోరుతున్నదన్నారు.

చరిత్రలో క్షత్రియుల గొప్పదనానికి సంబంధించి అనేక ఉదాహరణలు ఉన్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో 1960వ దశకంలో వ్యవసాయంలో కొత్త వంగడాలను పరిచయం చేశారని, అప్పట్లో గ్రామంగా ఉన్న కొంపల్లి ఇప్పుడు నగరంగా వృద్ధి చెందిందని గుర్తుచేశారు. ఐటీ రంగంలో సత్యం రామలింగరాజు మొదలు మీడియాలో కూడా అనేక మంది క్షత్రియుల పాత్ర ఉన్నదని, ఇక ఫార్మా, మెడికల్, ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్.. ఇలా అన్నింటా వారి స్థానం కనిపిస్తుందన్నారు. ఆయా రంగాలు వృద్ధి చెందడానికి పెట్టుబడులొక్కటే కారణం కాదని, దాని వెనక కృషి, పట్టుదల, శ్రమ, కమిట్‌మెంట్, ట్రస్ట్, కష్టపడేతత్వం లాంటివి కూడా ఉన్నాయని, అందులో రాజులు ఏ రంగంలో ప్రవేశించినా తప్పకుండా రాణిస్తారనే గుర్తింపు లభించిందన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో సైతం తాను క్షత్రియుల నుంచి ఇదే కోరుకుంటున్నానని, వారు అన్ని విధాలా సహకరి,చాలని పిలుపునిచ్చారు.

హాలీవుడ్‌తో పోటీ పడగలిగిన బాహుబలి కూడా ఒక రాజేనని, తనకు మంచి మిత్రుడైన రాంగోపాల్ వర్మ కూడా బాలీవుడ్‌కు ఎదిగారని గుర్తుచేశారు. కృష్ణంరాజు గురించి మాట్లాడుకోకుండా సినీ రంగాన్ని చర్చించలేమని గుర్తుచేసిన సీఎం రేవంత్... సైద్ధాంతికంగా కొందరు రాజకీయ నాయకులతో విభేదాలున్నా వారు స్నేహితులేనని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించాలనుకుంటున్న నిజాం షుగర్ ప్యాక్టరీ ఇప్పుడు రాజుల చేతుల్లోనే ఉన్నదని, పన్నెండేళ్లుగా పరిష్కారం కానిది ఇప్పుడు కొలిక్కి వస్తున్నదని, వారి సహకారంతోనే తొందర్లో అది రీ-ఓపెన్ అవుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి కో-చైర్మన్‌గా శ్రీనివాసరాజునే నియమించామని గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీలో సైతం రాజులకు తగిన ప్రయారిటీ ఉన్నదని, అందువల్లనే టికెట్ రాకపోయినా కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తెచ్చిన బోసురాజు కృషిని గుర్తించి రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా ఆయనకు మంత్రి పదవి ఇప్పించారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. తెలంగాణలో పదేండ్ల పాటు పార్టీ కష్టకాలంలో ఉన్నా తన శక్తిని ధారపోసి ఇప్పుడు పవర్‌లోకి వచ్చేలా చేయడంలో బోసురాజు కృషి ఉన్నదన్నారు. రానున్న రోజుల్లో నాగరాజు లాంటి వ్యక్తికి కార్పొరేటర్ పదవి ఇచ్చి ఆ తర్వాతి దశలో ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు తాను చొరవ తీసుకుంటానని అన్నారు. ఇంకా ఎవరైనా రాజులకు రాజకీయాల్లో అవకాశాలు కావాలంటే తన దృష్టికి తేవచ్చన్నారు. ఇప్పుడు మన ముందు కేంద్ర మంత్రిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాసవర్మకు పార్టీలో లాయల్టీ ఉన్నదని, నిబద్ధత ఉన్నదని కానీ డబ్బులు మాత్రం లేవని, అయినా కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిందని, పార్టీ వేరైనా వెంటనే ఫోన్ చేసి అభినందించానని గుర్తుచేశారు.

రాజుల్లో పేదలు కూడా ఉన్నారని, వారి వివరాలను ప్రభుత్వానికి అందిస్తే సంక్షే పథకాలను వారికి కూడా వర్తింపజేసేలా తాను చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. నిర్మాణ రంగంలో రాజులకు ఉన్న అనుభవాన్ని రంగరించి క్షత్రియ భవన్‌ను అద్భుతమైన కట్టడంగా మల్చాలని, ఆ భవన్‌లోనే మరోసాని మనం కలుసుకుందామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed