అధికారానికి కత్తెర.. అనుమతులకు బ్రేక్.. అక్రమాలకు చెక్

by Y.Nagarani |
అధికారానికి కత్తెర.. అనుమతులకు బ్రేక్.. అక్రమాలకు చెక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీఎంఅండ్‌హెచ్‌వో అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేయనున్నది. పెద్దాస్పత్రుల పర్మిషన్లన్నీ సర్కారే నేరుగా ఇవ్వాలని భావిస్తున్నది. కార్పొరేట్, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కొత్త రూల్స్ పాటించేలా ఆదేశాలు ఇవ్వనున్నది. బెడ్ల సంఖ్యను బట్టి ఈ ఫేజ్‌ను నిర్ణయించనున్నారు. ఈ అంశంపై వైద్యారోగ్యశాఖ సీరియస్‌గా కసరత్తు చేసి ప్రభుత్వానికి త్వరలో ఓ నివేదిక ఇవ్వనున్నది. ఆ తర్వాతే ఈ విధానం అధికారికంగా అమలు కానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా క్లినిక్‌లు, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్‌లు కలిపి 7,122 ఉన్నాయి. వీటిలో ఎక్స్‌క్లూజివ్‌గా 4,166 ఆస్పత్రుల్లో 1 నుంచి 20 పడకలు ఉండగా, 1,147 హాస్పిటల్స్‌లో 21 నుంచి 50 బెడ్స్ ఉన్నాయి. ఇక 51 నుంచి 100 లోపు ఉన్నవి 345 ఉండగా, 101 నుంచి 200 బెడ్లలోపు మరో 88, 200కు పైగా బెడ్స్ ఉన్నవి 70 హాస్పిటళ్లు ఉన్నాయి.

ఇష్టారీతిలో అనుమతులు

ప్రస్తుతం చిన్న స్థాయి క్లినిక్ నుంచి 1,000, అంత కంటే ఎక్కువ పడకలున్న ఆస్పత్రులకు జిల్లా వైద్యాధికారులే అనుమతులు ఇస్తున్నారు. కొన్ని సార్లు భద్రతా ప్రమాణాలు, ఇతర సౌకర్యాలు లేకున్నా ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయాలకు భారీ స్థాయిలో ముడుపులు అందుతున్నట్లు ప్రభుత్వానికి కంటిన్యూగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉన్నదని సెక్రెటేరియట్‌లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీకి బదులు, స్టేట్ రిజిస్ట్రేషన్ అథారిటీని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

కమిటీ ఉన్నా.. ఇష్టానుసారంగా

ఆస్పత్రుల మంజూరుకు జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ, జిల్లా కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌వోలతో కూడిన కమిటీ ఉంటుంది. పర్మిషన్లలో డీఎంఅండ్‌హెచ్‌వోలదే ప్రధాన పాత్ర ఉంటుంది. సీఈఏ రూల్స్ ప్రకారం అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఒక సారి పర్మిషన్ ఇస్తే ఐదేళ్ల తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బెడ్స్, హాస్పిటల్ ఎస్టాబ్లిష్​ ఏరియా, స్థానిక పరిస్థితులు వంటివన్నీ చెక్ చేసిన తర్వాతే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొందరు డీఎంఅండ్‌హెచ్‌వోలు లోపాయికారి ఒప్పందాలతో అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పర్మిషన్స్ తీసుకున్న హాస్పిటల్స్ పేషెంట్ల వివరాలు తప్పని సరిగా నమోదు చేయాలి. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా ఆస్పత్రులు రికార్డులు మెయింటెన్ చేయడంలో ఫెయిల్ అయ్యాయని స్వయంగా ఉన్నతాధికారులే ఆఫ్​ది రికార్డులో చెబుతున్నారు. అందుకే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టేట్ అథారిటీ తీసుకోవాలని భావిస్తున్నది. దీన్ని సెక్రెటరీ స్థాయి అధికారి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయనున్నారు.

13 జిల్లాలకు ఇన్‌చార్జిల నియామకం

13 కొత్త జిల్లాలకు ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌వోలను నియమిస్తూ హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా చొంగ్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ డీఎంఅండ్‌హెచ్‌వోగా నరేందర్, జనగామకు కే.మల్లికార్జునరావు, గద్వాలకు కే.సిద్దప్ప, ఖమ్మంకు బానోత్ కళావతి, కొమరం భీం ఆసీఫాబాద్‌కు సీతారాం, మహబూబాబాద్‌కు జీ.మురళీధర్, మహబూబ్‌నగర్‌కు కే.కృష్ణ, ములుగుకు గోపాల్‌రావు, పెద్దపల్లికి అన్న ప్రసన్న కుమారి, సిద్దిపేటకు బీ.పల్వన్ కుమార్, వికారాబాద్‌కు వై.వెంకట రవనా, వనపర్తికి శ్రీనివాసులు, యాద్రాద్రి భువనగిరికి మనోహర్‌లను నియమించారు.

Advertisement

Next Story

Most Viewed