Caste Census: నవంబర్ 6 నుంచి కులగణన సర్వే.. ఈ ప్రశ్నలకు సమాధానాలు రెడీ చేసుకోండి..

by Y.Nagarani |   ( Updated:2024-10-30 03:10:42.0  )
Caste Census: నవంబర్ 6 నుంచి కులగణన సర్వే.. ఈ ప్రశ్నలకు సమాధానాలు రెడీ చేసుకోండి..
X

దిశ, తెలంగాణ బ్యూరో: మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా?.. మీ వార్షిక ఆదాయం ఎంత ?.. అందులో స్థిరాస్తుల వివరాలేంటి?.. చరాస్తుల్లో ఉన్నవేంటి?.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా?.. వార్షిక టర్నోవర్ ఎంత?.. కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నట్లయితే ఆ భూమి విస్తీర్ణమెంత?.. రిజర్వేషన్‌తో విద్యాపరంగా, ఉద్యోగపరంగా లబ్ధి పొందారా?.. ఐదేండ్లలో ప్రభుత్వం నుంచి ఎన్ని రూపాల్లో లబ్ధి పొందారు?.. ఏవైనా నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగారా?... ప్రజాప్రతినిధిగా ఎన్ని టర్మ్‌లు పనిచేశారు?... బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారా?.. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కనిపించే ప్రశ్నలు. రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ సర్వేలో పాల్గొనే దాదాపు 90 వేల మంది ప్రభుత్వ సిబ్బంది ఇంటింటి సర్వే సందర్భంగా కుటుంబాలను ప్రశ్నించనున్నారు. అన్ని వివరాలతో ఈ సర్వే ప్రక్రియను వచ్చే నెల 30వ తేదీకల్లా పూర్తి చేసేలా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించడంతో తప్పుల్లేకుండా నమోదు చేసేందుకు సిబ్బందికి శిక్షణ సైతం పకడ్బందీగా అందించేలా ఏర్పాట్లు చేసింది.

వివరాలన్నీ సేకరణ

కులగణన కోసం చేస్తున్న సర్వేలో కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ వివరాలన్నింటినీ ప్రభుత్వం సేకరిస్తున్నది. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే ప్రభుత్వం ఆ వివరాలతో ఏం చేస్తున్నదనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్.. ఈ వివరాలన్నీ వెల్లడవుతుండడంతో సంక్షేమ పథకాలకు ఎలా వర్తింపజేస్తుందనే వాదనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల డేటా ప్రభుత్వం దగ్గర రెడీగా ఉండేందుకు ఈ సర్వే దోహదపడనున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఒకే రోజున సమగ్ర కుటుంబ సర్వే జరిగినా ఆ వివరాలేవీ ఇప్పటికీ బహిర్గతం కాలేదు. కానీ ఇప్పుడు కులగణన అవసరాల కోసం చేపడుతున్న సర్వేతో మొత్తం డేటా సేకరిస్తున్నందున భవిష్యత్తులో అవసరాలకు రెడీమెడ్ సమాచారంగా ప్రభుత్వానికి ఉపయోగపడనున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం, మధ్యలోనే ఆపివేయడం మొదలు ఇప్పటివరకూ సంక్షేమ పథకాల అమలు ద్వారా పొందుతున్న లబ్ది వరకు అనేక అంశాలు ఈ సర్వేలో ఉండనున్నాయి.

మరికొన్ని డిటెయిల్స్ సైతం

కుటుంబం నివాసం ఉంటున్న ఇల్లు సొంతదేనా?.. దాని స్వభావం (పూరిల్లు, పెంకుటిల్లు, రేకుల పైకప్పు, సిమెంట్ శ్లాబ్), విస్తీర్ణం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి కనెక్షన్, వంటగ్యాస్ వినియోగం, విద్యుత్ కనెక్షన్, బ్యాంకు నుంచి తీసుకున్న రుణం.. ఏ అవసరం కోసం తీసుకున్నారు... ఇలాంటి వివరాలు సైతం ఈ సర్వే ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్నది. వ్యవసాయం చేస్తున్న వారైతే సొంత భూమిలోనా?... కౌలుకు తీసుకుంటే దాని విస్తీర్ణమెంత?.. పాడి పశువులు ఉంటే వాటి సంఖ్య... ఉపాధి కోసం ఇతర దేశాలకు వలసెళ్తే ఆ వివరాలు.. ఇలాంటివన్నీ ఈ సర్వే ప్రశ్నావళిలోని ఉండనున్నాయి.

సూపర్ వైజర్ల నియామకం

ప్రతి గ్రామం, పట్టణం, వార్డు, డివిజన్‌లలో ఈ సర్వే నిర్వహిస్తున్నందున పకడ్బందీగా జరిగేందుకు సూపర్‌వైజర్లు నియమితులయ్యారు. జిల్లాల కలెక్టర్లు ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాలను సందర్శించడంతో పాటు సూపర్‌వైజర్లతో రివ్యూ చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ సర్వేలో మొత్తం 53 ప్రశ్నలను 56 కేటగిరీల్లో ప్లానింగ్ డిపార్ట్‌మెంటు రూపొందించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ఉద్దేశించి రాజకీయ వెనకబాటుతనాన్ని తెలుసుకోవాలన్నది ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉన్నా రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల మొదలు వివిధ రూపాల్లో ఆర్థిక సాయం, సబ్సిడీలు అందుకోడానికి ఉండే అర్హతలు సైతం ఈ గణాంకాల ద్వారా తేలనున్నది. కుటుంబ యజమానితో సహా సభ్యులందరి వ్యక్తిగత వివరాలు, ఆస్తులు తదితరాలు ఈ సర్వే ద్వారా తేలనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed