బీజేపీలో చీకోటి ప్రవీణ్ చేరికకు గ్రీన్ సిగ్నల్.. ఎట్టకేలకు ఫలించిన చర్చలు

by Javid Pasha |   ( Updated:2023-10-07 07:34:37.0  )
బీజేపీలో చీకోటి ప్రవీణ్ చేరికకు గ్రీన్ సిగ్నల్.. ఎట్టకేలకు ఫలించిన చర్చలు
X

దిశ, వెబ్‌డెస్క్: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. గతంలో ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అవ్వగా.. చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల చేరిక ఆగిపోయింది. పార్టీలోని కొంతమంది నేతలు అడ్డుపడటంతోనే చీకోటి ప్రవీణ్ చేరిక ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. కావాలనే పార్టీలోని కొంతమంది తనపై కుట్ర చేస్తున్నారంటూ, వాళ్లు తననేమీ చేయలేరంటూ చీకోటి సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశాడు.

పరిణామాలు చక్కబడటంతో చీకోటి ప్రవీణ్ కాషాయ గూటికి చేరేందుకు లైన్ క్లియర్ అయింది. అతడిని పార్టీలో చేర్చుకోవాల్సిందిగా బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో శనివారం మధ్యాహ్నం అతడు బర్కత్‌పూర బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీలో చేరనునున్నాడు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కండువా కప్పి చీకోటిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

గతంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కమలం గూటికి చేరేందుకు చీకోటి ప్రవీణ్ సిద్దమయ్యారు. ఈ మేరకు తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా కార్యాలయానికి చేరుకున్నారు. కానీ చివరి నిమిషంలో పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో చేరిక ఆగిపోయింది. చీకోటి వచ్చేసరికి కిషన్ రెడ్డి కార్యాలయం నుంచి వెళ్లిపోవడంతో కండువా కప్పుకోడానికి ఎవరూ లేకుండా పోయారు. దీంతో చీకోటి ప్రవీణ్ నిరాశతో వెనుదిరిగాడు. అనంతరం మళ్లీ బీజేపీ నేతలతో చర్చలు జరపగా.. పార్టీలో చేర్చుకునేందుకు అనమతి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దిగాలని చీకోటి భావిస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed