నాలుగేండ్ల అక్రమాలకు చెక్.. ప్రతి ఆస్తికి భూదార్ నంబర్

by Sathputhe Rajesh |
నాలుగేండ్ల అక్రమాలకు చెక్.. ప్రతి ఆస్తికి భూదార్ నంబర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న ఆర్వోఆర్ 2024 చట్టం ద్వారా భూమి, ఆస్తి హక్కుదారులకు ఆర్ధిక తోడ్పాటుని అందించనున్నది. ఆస్తికి సరైన గుర్తింపును ఇచ్చే ప్రక్రియను చేపడతామని పేర్కొన్నది. దానికి తోడు అక్రమాలకు చెక్ పెట్టేందుకు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు వేర్వేరు రికార్డులను రూపొందించనుంది. రెండు రకాల ప్రాపర్టీకి సరైన గుర్తింపు నంబర్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తు ఇబ్బందులను నుంచి శాశ్వత విముక్తి కల్పిస్తారు. ఇప్పటి దాకా రైతుకు మాత్రమే ఉండే యూనిక్ నంబర్ ని ఇక ప్రతి ప్రాపర్టీకి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి మనిషి చిరునామా, గుర్తింపుని తెలిపే ఆధార్ మాదిరిగానే ప్రతి ఆస్తికి భూదార్ లేదా మరేఇతర ప్రాపర్టీ కార్డును జారీ చేయాలని నిశ్చయించింది.

ఇది కూడా ప్రతి ప్రాపర్టీ అడ్రెస్ ని చెప్తుంది. ముసాయిదా చట్టంలో పేర్కొన్న ఈ అంశం సరికొత్తది. ఆబాది, వ్యవసాయ భూములకు వేర్వేరు రికార్డులను తయారు చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భూ సంస్కరణల్లో భాగంగా ఇది కూడా ఉంటుంది. పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, సమగ్ర సర్వే వంటి కార్యక్రమాలకు నిధులు కూడా పొందే వెసులుబాటుకు చట్టంలో చోటు దక్కింది. ఏ భూ సంస్కరణలను తీసుకురావాలన్నా ఈజీగా అమలు చేసేందుకు వీలుగా ఈ యూనిక్ కోడ్ అంశం దోహదపడనున్నది. ఇప్పటి వరకు మాన్యువల్ రెపరెన్స్ ని క్రియేట్ చేశారు.

కొత్త చట్టం ద్వారా జియో ట్యాగ్స్ తో ప్రాపర్టీని గుర్తించే వీలవుతుంది. ఇప్పటి దాకా సర్వే నంబర్లు, సబ్ డివిజన్లతోనే కథ నడిచింది. ఉదాహరణకు సర్వే నంబర్ 10.. అనే వాళ్లం. ఐతే అది అన్ని గ్రామాల్లోనూ ఉంటుంది. జిల్లా, డివిజన్, మండలం, రెవెన్యూ గ్రామం, సర్వే నంబరు, సబ్ డివిజన్ .. ఇన్నింటిని టైప్ చేస్తే తప్ప ఆ ఆస్తి గురించి వివరాలు తెలియవు. ఇప్పుడా కష్టతరమైన సమస్యకు పరిష్కారమే యూనిక్ నంబర్. దాన్ని భూదార్, స్వమిత్వ, ప్రాపర్టీ కార్డ్ వంటి పేర్లతో ఏదో ఒక దాన్ని ఖరారు చేయనున్నారు.

క్లియర్‌గా ఉంటే భూదార్

తెలంగాణలో క్లియర్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నింటికీ టెంపరరీ భూదార్ ఇవ్వాలని ప్రతిపాదించారు. టెంపరరీ ఎందుకన్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి ఒక చోట, సర్వే నంబర్ మరో చోట ఉండే పరిస్థితులే అధికం. పైగా రికార్డుల్లో కంటే పాసు బుక్కుల్లో అధికంగా విస్తీర్ణం నమోదైంది. సమగ్ర భూ సర్వే చేపట్టిన తర్వాత పర్మినెంట్ భూదార్ నంబర్ ఇచ్చే వీలున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిటీ నంబర్ పొందేందుకు అవసరమైన ఒక ముందడుగు పడుతుంది. సర్వే చేసేందుకు కూడా ఈ తాత్కాలిక నంబర్లు ఉపయోగపడుతాయి.

పట్టాదారుడికి యూనిక్ నంబర్ ఇచ్చారు. ఇది వైఎస్ హయాంలో కోనేరు రంగారావు కమిటీ సిపారసుల్లో భాగంగా జరిగింది. ఇప్పుడదే భూములకు/ఆస్తులకు కూడా అప్లై చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు సమస్యలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడనున్నది. పైగా ల్యాండ్ రికార్డుల్లో స్పష్టత వస్తుంది. భూ సంబంధ సమాచారాన్ని క్రోఢీకరించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. తనఖా పెట్టిన ఆస్తులు, రైతుబంధు, పీఎం కిసాన్ యోజన పొందుతున్న ఆస్తుల లెక్క తెలుస్తుంది. ఇవన్నీ ఒక గ్రిడ్ లో పెట్టడం ద్వారా పక్కా లెక్కలు తెలుస్తాయి. కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల లక్ష్యంతో ప్రారంభించిన యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిటీ నంబర్(యూఎల్పీన్) పథకం అమలుకు ఉపయోగపడుతుంది.

భూదార్‌తో ప్రయోజనాలు

+ ప్రతి ఆస్తికి చిరునామా లభిస్తుంది.

+ ప్రతి ప్రాపర్టీకి ప్రత్యేక గుర్తింపు నంబర్ ఉంటుంది.

+ ఆ భూమికి సంబంధించిన అన్ని లావాదేవీలు ఒకే చోట లభిస్తాయి.

+ ఆ స్థలం చరిత్ర ఒక్క క్లిక్ తో స్పష్టంగా తెలుస్తుంది.

+ యూనిక్ నంబర్ లోనే సపోర్టింగ్ డ్యాక్యుమెంట్(లింక్ డాక్యుమెంట్లు) కూడా వచ్చే ఏర్పాటు. డిజిటల్ రూపంలో పూర్తి సమాచారం తెలుస్తుంది.

+ ఆధార్ తో ఎన్ని ప్రయోజనాలు పొందవచ్చునో.. భూమికి సంబంధించిన ప్రయోజనాలు ఈ యూనిక్ నంబర్ ద్వారానే అందుతాయి. బ్యాంకుల్లో దీని ద్వారానే రుణాలు తీసుకోవచ్చు. రుణం తీసుకుంటే ఆన్ లైన్ లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు భూమి పట్టాదారు పాసుపుస్తకాలను బ్యాంకుల్లో పెట్టాల్సిన అవసరం ఉండదు.

+ ఆస్తి విలువ పెరుగుతుంది. దాని ద్వారా భూయజమానికి రుణాలు పొందడం సులువవుతుంది. ల్యాండ్ హిస్టరీ ఈజీగా తెలుస్తుండడంతో రుణం కూడా అధికంగా వస్తుంది.

+ ప్రభుత్వానికి కూడా ఆస్తి పన్ను వసూలు ఈజీ అవుతుంది. అలాగే క్రయవిక్రయాల్లో స్టాంప్ డ్యూటీ రెవెన్యూ పెరుగుతుంది.

స్వమిత్వ పేరిట కేంద్రం

కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ, రాష్ట్ర పంచాయత్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో స్వమిత్వ(సర్వే ఆఫ్ విలేజెస్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) సర్వే చేపట్టింది. గ్రామీణంలో సమగ్ర ఆస్తుల విలువకు పరిష్కారం కల్పించడమే లక్ష్యం. ప్రతి ల్యాండ్ పార్శిల్ కు డ్రోన్ టెక్నాలజీ, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్(సీఓఆర్ఎస్) విధానాలతో మ్యాపింగ్ చేస్తారు. 2020 నుంచి దేశ వ్యాప్తంగా దశల వారీగా ఈ మ్యాపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. స్వమిత్వ వల్ల రెవెన్యూ కలెక్షన్ నూటికి నూరు పాళ్లు సమర్ధవంతంగా చేపట్టొచ్చు. హక్కుదారులకు హక్కులకు గ్యారంటీ దక్కుతుంది. మ్యాపులతో గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్(జీపీడీపీ) ను పక్కాగా అమలు చేయొచ్చు.

హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పథకాన్ని అమలు చేస్తున్నారు. దశల వారీగా మిగతా రాష్ట్రాల్లోనూ నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 7 లక్షల గ్రామాల్లో ఇప్పటి వరకు 74,900 రెవెన్యూ గ్రామాల్లో పూర్తయ్యింది. ఆస్తులను మ్యాపింగ్ చేసి ప్రత్యేక గుర్తింపు నంబర్ తో యజమానికి స్వమిత్వ కార్డులను అందిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఈ ఆబాది ఆస్తులకు స్వమిత్వ కార్డుల జారీలో ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తామంటే కేంద్రం నిధులను కూడా మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొదట్లో సరిగ్గా స్పందించలేదు. కానీ గతేడాది మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని రెండు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని తెలిసింది. కానీ పని మొదలుపెట్టలేదు.

అక్రమాలకు చెక్

– మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లో సర్వే నం.127లో చాలా భూములు 30 ఏండ్ల క్రితమే లేఅవుట్లు చేసి విక్రయించారు. వాటినే మళ్లీ సాగు భూములుగా విక్రయించినట్లు ఆధారాలు ఉన్నాయి. కొండాపూర్‌లో సర్వే నం.96, 97, 112, 113ల్లో 1990 కాలంలోనే వెంకటేశ్వరకాలనీ 1, 2, 3గా లేఅవుట్లు చేసి విక్రయించారు. పట్టాదారులు చనిపోయిన తర్వాత ఆయన వారసులు పాసు పుస్తకాలు సంపాదించి మరోసారి భూములను విక్రయించారు. దాంతో మళ్లీ లేఅవుట్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

– అంకుషాపూర్‌లో తొలుత ఓ లేఅవుట్‌ చేసి ప్లాట్లు అమ్మేశారు. మళ్లీ వ్యవసాయ భూమిగా పట్టాదారులు ఇతరులకు విక్రయించారు. ఇప్పుడు అదే భూమికి హెచ్‌ఎండీఏ అనుమతులు ఇవ్వడం గమనార్హం. సర్వే నం.194, 195 లో సాగుతోన్న దందా. తొలుత లేఅవుట్‌ యజమానులు మళ్లీ విక్రయించేందుకు రిజిస్ట్రేషన్‌ శాఖకు వెళ్తే మాత్రం సేల్‌డీడ్‌ చేయడం లేదు. మొదట ప్లాటుగా సేల్‌డీడ్‌ చేసిన అధికారులే తిరిగి రీ సేల్‌ చేసేందుకు అంగీకరించడం లేదు. కానీ వ్యవసాయ భూమిగా మాత్రం రిజిస్ట్రేషన్‌ చేశారు. కొనుగోలు చేసిన వ్యక్తులు హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకొని లేఅవుట్‌ చేశారు.

- రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో అనేక గ్రామాల్లో ఒక్కటే భూమిని రెండు, మూడేసి సార్లు లేఅవుట్ చేసి విక్రయించిన ఉదంతాలు ఉన్నాయి. నాలా కన్వర్షన్ చేయకపోయినా ఆ లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. దాంతో లక్షలాది సేల్ డీడ్లు హక్కుదార్ల దగ్గర ఉన్నాయి. 30, 40 ఏండ్ల క్రితం నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు చేసి అమ్మేసిన భూములకు భూ రికార్డుల ప్రక్షాళన పేరిట తిరిగి వ్యవసాయ భూములుగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు. అవే భూములను వ్యవసాయ భూములుగా ధరణి పోర్టల్ ని అడ్డం పెట్టుకొని పెద్దలు కొనుగోలు చేశారు.

ఇలా అక్రమంగా క్రయ విక్రయాలకు పాల్పడిన భూమి 6 లక్షల ఎకరాలకు పైగానే ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయం. వాస్తవానికి ఆ లెక్క పది లక్షల ఎకరాలు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ధరణి పోర్టల్ అద్భుతమంటున్న ఓ ఎమ్మెల్యే కుటుంబీకులు కూడా ప్లాట్ల భూమిని వ్యవసాయ భూమిగా కొనుగోలు చేశారు. ప్లాట్ల యజమానులను భయబ్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇలాంటి దోపిడీ కార్యక్రమం ధరణి పోర్టల్ అమలైన తర్వాతే లక్షల ఎకరాల్లో సాగింది. ఇప్పుడీ ఆబాదికి ప్రత్యేక ఆర్వోఆర్ రూపొందించడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టేందుకు వీలవుతుంది. రానున్న రోజుల్లో భూ రికార్డుల ప్రక్షాళనను శాస్త్రీయంగా చేసేందుకు భూదార్ నంబర్ ప్రక్రియ తోడ్పాటునందిస్తుంది.

Advertisement

Next Story