బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. MP ఎన్నికల వేళ ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెబుతోన్న కీలక నేతలు..!

by Satheesh |   ( Updated:2024-03-11 03:22:27.0  )
బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. MP ఎన్నికల వేళ ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెబుతోన్న కీలక నేతలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో/నల్లగొండ బ్యూరో: రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని భావిస్తున్న గులాబీ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇందుకు ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని ఎంచుకుంటున్నారు. కేసీఆర్ పట్టించుకోవడం లేదని, కేటీఆర్ తీరు మారలేదని, కుటుంబ పాలిటిక్స్ అని, జిల్లాల్లో సీనియర్ల పోరు పడలేకపోతున్నామని, తమను పట్టించుకోవడం లేదని చెబుతూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఆదివారం కేటీఆర్ సమక్షంలోనే కామారెడ్డి కార్యకర్తల మీటింగులో కొమ్ముల తిర్మల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు చెందిన కార్యకర్తలు గొడవకు దిగారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ జరుగుతున్నా అధిష్టానం వాటికి పరిష్కారం చూపడంలేదని కారు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

గులాబీలో భవిష్యత్ లేదని..

పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కొందరు నేతలకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. మరికొందరికి ఆశ కల్పించి హ్యాండిచ్చారు. టికెట్ వచ్చి ఓటమి పాలైన వారు అధినేత వద్ద తమ గోడును వెల్లబోసుకుందామంటే ఆయన స్పందించడం లేదు. దీంతో పార్టీలో కొనసాగితే తమకు గుర్తింపు ఉండదని, ప్రస్తుతం పార్టీకి భవిష్యత్ లేదని భావించి ఇంకొందరు పార్టీని వీడుతున్నట్లు టాక్ వస్తోంది.

ఒక్కరోజే ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నలుగురు ఆదివారం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ లిస్టులో ఇద్దరు మాజీ ఎంపీలు సీతారాంనాయక్, నగేశ్, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావులు ఉన్నారు. వీరంతా ఆదివారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, పెద్దపల్లి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత గోమాస శ్రీనివాస్‌ కూడా బీజేపీలో చేరారు. కమలం పార్టీలో చేరిన నలుగురు నేతలకు ఎంపీ టికెట్ కన్ఫామ్ అని తెలుస్తోంది.

నగేశ్‌కు ఆదిలాబాద్, సీతారాంనాయక్‌కు మహబూబాబాద్, హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి నల్లగొండ, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు ఖమ్మం ఎంపీ స్థానాల టికెట్లు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లోనూ ఈ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో వీరికి టికెట్లు కన్ఫామ్ అని టాక్ ఉంది. ఈ నలుగురితో పాటే ఇదివరకు సిట్టింగ్ ఎంపీలు బీబీపాటిల్, పి. రాములు బీజేపీలో చేరగా, పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, పలువురు కార్పొరేటర్లు కూడా హస్తంగూటికి చేరారు. మరికొందరు త్వరలోనే పార్టీ మారుతాయని ప్రచారం జరుగుతోంది.

గ్రూపులలొల్లి..

కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగులో కేటీఆర్ ఎదురుగానే గులాబీనేతలు ఆదివారం బాహాబాహీకి దిగారు. కొమ్ముల తిర్మల్ రెడ్డి ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ పేరు ప్రస్తావించలేదని ఆయన అనుచరులు వేదికపైకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ల వలన పలువురు నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిష్టానం స్పందించకపోవడంతో వారంతా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు వినికిడి.

కోమటిరెడ్డితో గుత్తా భేటీ..

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు గుత్తా అమిత్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమిత్.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారని టాక్. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో అమిత్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు గుత్తాసుఖేందర్ రెడ్డి ప్రయత్నంచగా మాజీమంత్రి జగదీశ్ రెడ్డి చక్రం తిప్పి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇప్పించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నల్లగొండ, మునుగోడు టికెట్లను గుత్తా ఆశించగా.. కేసీఆర్ సిట్టింగ్ అభ్యర్థులకే ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అమిత్ రెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ కోరినా జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. ఇక భువనగిరి టికెట్ అడిగితే కేసీఆర్ స్పందించకపోవడంతో తన కొడుకును పక్క పార్టీలోకి పంపడానికి గుత్తా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story