ఉనికి కోసం బీఆర్ఎస్ ఆరాటం.. కేటీఆర్‌కి అగ్నిపరీక్ష

by karthikeya |   ( Updated:2024-10-17 02:23:37.0  )
ఉనికి కోసం బీఆర్ఎస్ ఆరాటం.. కేటీఆర్‌కి అగ్నిపరీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయమున్నా బీఆర్ఎస్ మాత్రం ముందుగానే మేల్కొంటున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక పరువు పోగొట్టుకున్న గులాబీ పార్టీ కనీసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. గ్రేటర్ పరిధిలో మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినందున జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ వారికి బాధ్యతలు అప్పజెప్పేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలనూ ఇందుకు సన్నద్ధం చేస్తున్నది. ఇందుకోసం హైడ్రా కూల్చివేతలు, మూసీ నిర్వాసితుల అంశాన్ని విస్తృతంగా వాడుకోవాలనుకుంటున్నది. ఇటీవలే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మూసీ, హైడ్రా అంశాలను విస్తృతంగా వాడుకోవాలని దిశానిర్దేశం చేశారు. గ్రేటర్‌ పరిధిలో పార్టీ గెలుపు బాధ్యతలను స్వయంగా కేటీఆర్ చూసుకోనున్నందున జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆయన ఇమేజ్‌కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి.

ప్రజా సమస్యలే కేంద్రంగా ఆందోళనలకు పార్టీ ప్లాన్

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును గత ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ చేపట్టినా ఇప్పుడు దాన్ని మూసీ సుందరీకరణ పనులకు మాత్రమే పరిమితం చేసేలా విమర్శలు చేస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ అంటూ ఇటీవల సెటైర్ వేశారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా రివర్ బెడ్, బఫర్ జోన్‌లలోని నివాసాలను ఖాళీ చేయడం అనివార్యం కావడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ఆందోళనను గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయంగా బీఆర్ఎస్‌కు ఉపయోగపడేలా వినియోగించుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిర్వాసితులను, వారిలోని మానసిక సంఘర్షణను, వారి ఆవేదనను బలమైన అస్త్రంగా వాడుకోవాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలోనూ పర్యటించి వారిని అటువైపు డ్రైవ్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ప్రజల సమస్యలే కేంద్రంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టి వారికి దగ్గర కావాలనుకుంటున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.

బల్దియా ఎలక్షన్స్‌లో కొన్ని డివిజన్లలోనైనా గెలుపునకు ఫోకస్

నిర్వాసితులకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ‘డబుల్’ ఇండ్లను కేటాయిస్తున్నది. కుటుంబంలో ఉపాధి అవకాశాలూ కల్పించాలని భావిస్తున్నది. తక్షణ సాయంగా రూ.25 వేల చొప్పున అందించాలనుకుంటున్నది. అవసరమైతే అంబర్‌పేట్‌లోని పోలీసు అకాడమీ స్థలాన్ని, మలక్‌పేట్‌లోని రేస్ కోర్సు స్థలాన్ని కూడా తీసుకుని నిర్వాసితులకు ప్రత్యేకంగా కాలనీలను కట్టిస్తామని స్వయంగా సీఎం ఇటీవల ప్రకటించారు. కానీ పేదల ఇండ్లను కూలుస్తున్న ప్రభుత్వం పెద్దల జోలికి వెళ్లడం లేదని, మూసీ సుందరీకరణ కోసం పేదల బతుకులను రోడ్లమీద పడేయడం అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నది. మానసిక ఆందోళనలో ఉన్న పేదల పక్షం వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నది. ప్రభుత్వ వ్యతిరేక యాక్టివిటీస్‌కు మూసీ, హైడ్రా అంశాలను బలంగా వినియోగించుకుని పేదలను అందులో సమీకరించాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. ఇప్పటికే ప్రజల్లో పార్టీకి ఆదరణ తగ్గుతున్నదని గ్రహించిన బీఆర్ఎస్.. కనీసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా గౌరవప్రదంగా కొన్ని డివిజన్లలో గెలవాలని భావిస్తున్నది.

చాలెంజ్‌గా కాంగ్రెస్, బీజేపీతో పోరు

ఈ ఎన్నికల్లో ఓడితే వ్యక్తిగతంగా కేటీఆర్ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుందనేదే ఇందుకు కారణం. ఈ ఉద్దేశంతోనే ఏడాది ముందు నుంచే కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నది. గతంలో గెలిచిన డివిజన్లను నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. గ్రేటర్ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లడం, లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో బీజేపీ సైతం గతం కంటే ఎక్కువ సీట్లను గెలిచేలా ప్రయత్నాలు చేసే అవకాశాలున్న నేపథ్యంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఏకకాలంలో కాంగ్రెస్, బీజేపీలతో రాజకీయంగా కొట్లాడటం కేటీఆర్‌కు చాలెంజ్‌గా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయకారీ ఒప్పందం ఉన్నదనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తాయన్నది ఆసక్తికరం. మజ్లిస్ పార్టీతో గతంలో ఉన్న సంబంధాలు లేకపోవడంతో ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్‌కు ఈసారి ఊహించిన చిక్కులు తెచ్చే అవకాశం ఉన్నది. అది కాంగ్రెస్‌కు కలిసొస్తుందనే గుబులు మొదలైంది.

కేటీఆర్ పలుకుబడికి గీటురాయిగా బల్దియా ఎన్నికలు

గతంలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గ్రేటర్ పరిధిలో ప్రచార బాధ్యతలను ఆయనే చూసుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో పార్టీ గెలుపు క్రెడిట్ మొత్తం కేటీఆర్‌కు దక్కినందున ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆయన ఇమేజ్‌కు కీలకంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు కాంగ్రెస్‌కు చేరువైనందున మారిన పొలిటికల్ ఈక్వేషన్స్‌లో భాగంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఏ మేరకు సహకారం అందుతుందనేది చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్లో హిట్ అయినా, ఫట్ అయినా అది కేటీఆర్ సామర్థ్యానికి, పలుకుబడికి గీటురాయిగా నిలవనున్నది. మూసీ, హైడ్రా అంశాలను విస్తృతంగా వాడుకుని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి పంపింగ్ చేయాలని భావిస్తున్నా కాంగ్రెస్ వ్యూహాన్ని ఢీకొట్టడం, గత ప్రభుత్వంలోని వివరాలను బట్టబయలు చేయడంతో ఆత్మరక్షణలో పడ్డారు. దీంతో మూసీ నిర్వాసితుల బాధలు, హైడ్రా కూల్చివేతలతో ఇప్పటివరకూ తెలంగాణ భవన్‌కు వచ్చి మొరపెట్టుకున్న పరిస్థితులు ఎన్నికల నాటికి ఆయనకు ఏ మేరకు పనికొస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed