బ్రిజ్ భూషణ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి!

by Anjali |
బ్రిజ్ భూషణ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డీవైఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్ భట్టాచార్య డిమాండ్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రెజర్లపై ప్రభుత్వం, పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తూ దాడులు చేసి అరెస్టులు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లపై పోలిసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ రోజు(ఆదివారం) బ్లాక్ డే అని అన్నారు.

కాగా.. డీవైఎఫ్ఐ కేంద్ర కమిటి సమావేశాలు మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశాలకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండవరోజు మీడియాతో డీవైఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్ భట్టాచార్య మాట్లాడుతూ... మూఢత్వాన్ని పెంపొందించే విధంగా పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారని విమర్శించారు. నేడు దేశంలో 30 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అయితే ఆ పోస్టులను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి‌ అధికారంలోకి‌ వచ్చిన‌ బీజేపీ తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువతను మోసం చేసిందన్నారు‌.

కావున ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక యువజన వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరికి ఉపాధి కల్పించాలని, లౌకిక దేశంకై దేశవ్యాప్తంగా ఆగష్టులో జాతాలను చేపట్టి యువతను జాగృతం చేస్తామన్నారు. డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రహీం‌మ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలో‌ వచ్చిన తర్వాత యువతను పూర్తిగా విస్మరించిందన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువతని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు జెక్ థామస్, ఆనగంటి వెంకటేష్, సంజీవ్ కుమార్, కేంద్ర కమిటీ సభ్యులు ఇర్ఫాన్ గుల్, కోట రమేష్, అనిల్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావెద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story