అనారోగ్యంతో బాలుడు మృతి.. RMP నిర్లక్ష్యమే కారణమా..?

by Rajesh |
అనారోగ్యంతో బాలుడు మృతి.. RMP నిర్లక్ష్యమే కారణమా..?
X

దిశ, నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని ముదిగొండ గ్రామంలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కావటి మణిదీప్(11) సోమవారం అనారోగ్యానికి గురయ్యాడు. మృతుడి తండ్రి కోటేశ్వర్ కథనం ప్రకారం మణిదీప్ హన్మకొండ మండలంలోని జ్యోతి బాఫూలే గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల బాలుడికి జ్వరం రావడంతో ఈ నెల 11న ఇంటికి తీసుకువచ్చారు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపి వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా ఇంజెక్షన్ వేశారు. సోమవారం రోజున మణిదీప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆర్ఎంపి వైద్యుడి వైద్యం వికటించడంతోనే బాలుడు మృతి చెందినట్లుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. ఘటనా స్థలానికి స్థానిక ఎస్సై మహేందర్, డిప్యూటీ తహశీల్దార్ రవి చేరుకుని బాలుడి తండ్రి కోటేశ్వర్ ను వివరణ కోరగా మూడు నెలల క్రితం బాలుడిని కుక్క కరవడంతో ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. బాలుడు అనారోగ్యంతో మృతిచెందాడని అధికారులకు తెలిపాడు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మహేందర్ తెలిపారు.

కేసును సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర వైద్యమండలి

మణిదీప్ మృతిపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను తెలంగాణ వైద్యమండలి సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్యమండలి చైర్మన్ డా.మహేష్ కుమార్, రిజిస్టార్ డా. లాలయ్య కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ టీజీఎంసీ సభ్యుల ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story