కెనడా ప్రభుత్వంలో ఖలిస్తానీ శక్తులు: భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ

by Mahesh Kanagandla |
కెనడా ప్రభుత్వంలో ఖలిస్తానీ శక్తులు: భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా లా అండ్ ఆర్డర్, డిఫెన్స్ ఫోర్స్‌లలో ఖలిస్తానీ శక్తులు ఉన్నాయని, కెనడా పార్లమెంటులోనూ ఖలిస్తానీకి అనుకూల వ్యాఖ్యలు చేసిన ఎంపీలు ఉన్నారని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలను భారత్ ఆ దేశానికి సమర్పించిందని వివరించారు. వారిపై యాక్షన్ తీసుకోవాలని, 26 మంది ర్యాడికల్స్, గ్యాంగ్‌స్టర్‌లను భారత్‌కు అప్పగించాలనీ భారత్ కోరిందని తెలిపారు. ఆధారాలు ఉన్నప్పటికీ కెనడా ప్రభుత్వం వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పారు. నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారిని, దౌత్య సిబ్బంది ప్రమేయాన్ని ఆరోపించిన కెనడా ప్రభుత్వం తమకు ఒక్క ఆధారాన్ని కూడా అందించలేదని సంజయ్ కుమార్ వర్మ వివరించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, దౌత్య సిబ్బంది హస్తం ఉన్నదని కెనడా అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత ఉభయ దేశాల మధ్య దౌత్య సంక్షోభం నెలకొంది. భారత దౌత్యసిబ్బందిని విచారించడానికి ఇమ్యూనిటీ తొలగించాలని కెనడా పేర్కొన్న తర్వాత భారత్ వెంటనే వారిని స్వదేశానికి రప్పించుకుంది. ఆ తర్వాత కూడా కెనడా భారత్‌పై ఆరోపణలు గుప్పించింది. భారత్‌కు వచ్చిన తర్వాత హైకమిషనర్ సంజయ్ కుమార్ తాజాగా సంచలన వివరాలు వెల్లడించారు.

ద్వంద్వ విధానాలు

హత్య కేసులో విచారణకు ఒక్క ఆధారం కూడా సమర్పించిన కెనడా ప్రభుత్వం.. అదే భారత్ ఆధారాలు సమర్పించినా ఉగ్ర గ్రూపులపై యాక్షన్ తీసుకోలేదని సంజయ్ కుమార్ వర్మ అన్నారు. ఆ గ్రూపులపై యాక్షన్ తీసుకోవాలని, 26 మంది గ్యాంగ్‌స్టర్, ర్యాడికల్ యూత్‌ను తమకు అప్పగించాలని దౌత్యమార్గంలో పలుమార్లు భారత్ విజ్ఞప్తి చేసినా కెనడా అందుకు అంగీకరించలేదని తెలిపారు. ఇది పూర్తిగా కెనడా అవలంభించే ద్వంద్వ విధానమని, తమకు ఒక రూల్, వేరే దేశాలకు మరో రూల్ అన్నట్టుగా ఆ దేశ వైఖరి ఉన్నదని మండిపడ్డారు. గతంలో అభివృద్ధి చెందిన దేశాల మాటలే వేదంగా గ్లోబల్ సౌత్ దేశాలు పాటించేవని, కానీ, ఆ రోజులు పోయాయని స్పష్టం చేశారు. కెనడా అధికారులు, ప్రతి మంత్రిత్వ శాఖతో తాను సుహృద్భావ సంబంధాలను నెరిపారని, కానీ, ఉన్నట్టుండి తనతోపాటు మరో ఐదుగురు భారత సిబ్బందిని దర్యాప్తు చేస్తామని చెప్పడంతో ఖంగుతిన్నట్టు వివరించారు. దర్యాప్తు చేయడానికి డిప్లమసీ ఇమ్యూనిటీని తొలగించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పడంతో తాము ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తెచ్చామని పేర్కొన్నారు. వెంటనే తమను స్వదేశానికి రప్పించుకుందని, కానీ, అంతలోనే కెనడా తనను పర్సనా నాన్ గ్రాటా(దౌత్యానికి అనర్హుడు లేదా ఆమోదయోగ్యుడు కాదు)గా ప్రకటించిందని గుర్తు చేశారు. దశాబ్దాల తరబడి ఘర్షణలున్న పాకిస్తాన్ కూడా ఇలా భారత దౌత్య సిబ్బందిని ప్రకటించలేదని వివరించారు. కెనడాలోని సిక్కు జనాభా, ప్రాబల్యం కారణంగా కెనడా ఫారీన్ పాలసీ ఇలా ఉన్నట్టు తన అభిప్రాయాన్ని తెలిపారు. కెనడాలో భారతీయులంతా తమ జీవితాలు, అభివృద్ధిపై దృష్టి పెడితే కొన్ని ఖలిస్తానీ శక్తులే అందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు గంభీరత ప్రదర్శిస్తాయని వివరించారు.

Advertisement

Next Story