CM Omar Abdullahకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి!

by Mahesh Kanagandla |   ( Updated:2024-10-24 17:09:28.0  )
CM Omar Abdullahకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి!
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశమయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని తొలి కేబినెట్‌ మీటింగ్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ఆ తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. తాజాగా సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటనలోనూ జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడమే ప్రాధాన్యతగా ఉన్నది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఒమర్ అబ్దుల్లా సమావేశమై రాష్ట్ర హోదా గురించి మాట్లాడినట్టు తెలిసింది. ఇందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఆ తర్వాత కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీతో అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో అబ్దుల్లా భేటీ అయ్యారు. సాంప్రదాయ కశ్మీరీ శాలువాను ప్రధాని మోదీకి సమర్పించారు. 30 నిమిషాలపాటు సాగిన వీరి సమావేశంలో జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు, అభివృద్ధి పనుల గురించి చర్చ జరిగినట్టు అధికారులు వివరించారు. జమ్ము కశ్మీర్ దాని వాస్తవ రూపాన్ని సంతరించుకునేలా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జమ్ము కశ్మీర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు ఒమర్ అబ్దుల్లాతో సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story