రేవంత్.. నువ్వు కొడంగల్ కి మాత్రమే సీఎంవి కాదు: బీజేపీ ఎమ్మెల్యే హరీశ్

by Mahesh |
రేవంత్.. నువ్వు కొడంగల్ కి మాత్రమే సీఎంవి కాదు: బీజేపీ ఎమ్మెల్యే హరీశ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ కు మాత్రమే ముఖ్యమంత్రి కాదని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ఘాటు విమర్శలు చేశారు. సీఎం.. కొడంగల్, వికారాబాద్, నారాయణపేట్‌కు మాత్రమే పరిమితమయ్యారని చురకలంటించారు. విద్యావలంటీర్లను కొడంగల్ కు మాత్రమే పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఊరూరా నిర్వహించిందని, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఆదివాసీల గ్రామాలకు నేటికీ రహదారులు లేవని పాల్వాయి హరీశ్ తెలిపారు. కొమురం భీం జిల్లాలో గిరిజన మహిళ డెలివరీ కోసం, పురిటి నొప్పులతో రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.

వాగు దాటగానే దారి మధ్యలో డెలివరీ అయ్యి పుట్టిన బిడ్డ చనిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గిరిజన బతుకులు దయనీయమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. గిరిజన గ్రామాలకు రహదారులు లేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఆరోగ్య సమస్యలు వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని పేర్కొన్నారు. గిరిజనుల బతుకులు అలా ఉంటే మంత్రి సీతక్క మాత్రం గిరిజన గ్రామాలకు నాలుగేండ్లలో తారు రోడ్లు వేస్తామని చెప్పడంపై పాల్వాయి మండిపడ్డారు. పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని ఆయన ధ్వజమెత్తారు. పంచాయతీల్లో సర్పంచులు లేరని, పంచాయతీలకు గ్రామ కార్యదర్శులకు అప్పజెప్పారన్నారు.

9 నెలల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గ్రామాలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని విరుచుకుపడ్డారు. సీతక్క పై చాలా నమ్మకం ఉండేదని, కానీ గ్రామాల్లో పరిస్థితులు చూస్తుంటే సీతక్కపై ఆ నమ్మకం కోల్పోయేలా ఉందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ టూర్ కు వెళ్లాడా? లేక ఇంకేమైనా చక్కబెట్టడానికి వెళ్లాడా అనేది తెలియదని చురకలంటించారు. ప్రభుత్వం గ్రామ పరిపాలన గాలికొదిలేసి, ఆకాశంలో మేడలు కడుతోందని పాల్వాయి హరీశ్ ధ్వజమెత్తారు. మంత్రులందరూ సంపాదించుకునే పనిలో బిజీగా ఉన్నారని హరీశ్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story