cannabis : కూలీలను తీసుకెళ్తున్న బొలెరో లో గంజాయి తరలింపు

by Kalyani |
cannabis : కూలీలను తీసుకెళ్తున్న బొలెరో లో గంజాయి తరలింపు
X

దిశ, కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: ఇతర ప్రాంతాలకు కూలీలను తీసుకెళ్తున్న ఓ బొలెరో వాహనంలో గుట్టుగా గంజాయిని రవాణా చేస్తు పోలీసులకు పట్టుబడిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. ఈ విషయాన్ని వెలుగులోకి రానీయకుండా గుట్టుగా ఉంచి గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుంది ? గంజాయి స్మగ్లింగ్ మూట సభ్యులు ఎవ్వరూ ? విక్రయ లావాదేవీలకు అడ్డా ఎక్కడ? ఈ స్మగ్లింగ్ కు ప్రధాన సూత్రధారులు ఎవ్వరన్న దాన్ని పై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామం నుంచి ఏపీ 22 టీఏ,5511నంబర్ గల మహేశ్వరీ ట్రావెల్స్ బులెరో వాహనంలో గత కొన్నాళ్లుగా జిల్లాలో తాడూర్,తెల్కపల్లి మండలాల్లోని గ్రామాల పంట పొలాల్లో పత్తి తీయడానికి కూలీలను తీసుకెళ్తున్నారు.

అయితే కూలీల మాటున గంజాయిని తరలిస్తే... పోలీసులూ పెద్దగా దృష్టిని కేంద్రీకరించరని భావించిన డ్రైవర్ కం ఓనర్ సతీష్ తన బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లుగా నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ కు అజ్ఞాత వ్యక్తుల ద్వారా ఈ నెల 28వ తేదీన ఉదయం సమాచారం అందినట్లుగా తెలిసింది. దీంతో తనకు అందిన సమాచారం మేరకు వెంటనే పెద్దకొత్తపల్లి ఎస్సై సతీష్ ను అప్రమత్తం చేయగా వెంటనే పోలీస్ సిబ్బందితో రంగంలోకి దిగారని తెలిసింది. ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు నాగర్ కర్నూల్ _కొల్లాపూర్ మధ్య జాతీయ రహదారి పై పెద్ద కొత్తపల్లి సమీపంలో పస్పుల బస్ స్టేజీ వద్ద బొలెరో వాహనం కోసం మాటు వేశారని,ఇంతలోనే సదరు బొలెరో వాహనం కూలీలతో రాగానే పట్టుకున్నారని తెలిసింది.కూలీలను వాహనంలో నుంచి కిందకు దించిన పోలీసులు అణువణువునా క్షుణంగా సోదాలు చేశారని, అయినా గంజాయి దొరకలేదని తెలిసింది.అయితే డ్రైవర్ సీటు అడుగు భాగాన పకడ్బందీగా ప్లాస్టిక్ కవర్లలో భద్రపరిచినట్లు గుర్తించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

అయితే ఎన్ని కిలోలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నది వివరాలు తెలియడం లేదు. అయితే పట్టుబడిన గంజాయి, డ్రైవర్ తో పాటు వాహనాన్ని పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారని సమాచారం. అయితే గంజాయి అంకిరావుపల్లి గ్రామానికి ఎవరూ సరఫరా చేస్తున్నారు? ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ గ్రామాలకు తరలిస్తున్నారు? దీన్ని వెనుకాల స్మగ్లింగ్ మూట ఎవరన్నా దాని పై పోలీసులు కూపీలాగుతున్నారని తెలిసింది. అయితే దర్యాప్తు భాగంగా అంకిరావుపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు గంజాయి స్మగ్లింగ్ తో సంబంధం ఉందని సమాచారం.అయితే అతనిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ చేస్తుండడంతో గంజాయి స్మగ్లింగ్ పై పోలీసులు డొంక కదిలిస్తున్నారని సమాచారం. ఇదిలావుండగా గంజాయి స్మగ్లింగ్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి అణచివేస్తున్న నేపథ్యంలో ఈ గంజాయి కేసును పెద్దకొత్తపల్లి పోలీసులు ప్రతిష్టాత్మంగా చేపట్టినట్లుగా తెలిసింది. అయితే ఈ కేసును పోలీసులు అధికారులు వెల్లడించ లేదు. ఏదైనప్పటికీ త్వరలోనే గంజాయి స్మగ్లింగ్ కేసును పోలీసులు ఛేదించనునట్లుగా సమాచారం.

Advertisement

Next Story