నత్తనడకన బీజేపీ సభ్యత్వ నమోదు

by M.Rajitha |
నత్తనడకన బీజేపీ సభ్యత్వ నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెంబర్‌షిప్ డ్రైవ్ నత్తనడకన సాగుతోంది. దీనిపై హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన సందర్భంగా సైతం టార్గెట్ పూర్తిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులు డెడ్‌లైన్ పెట్టారు. త్వరగా పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు. అయితే తక్కువ టైంలో అంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా అనే డైలమాలో పార్టీ పడింది. టార్గెట్‌ను రీచ్ అవ్వడంపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. బస్తీలు, గూడేలను కూడా వదలకుండా సభ్యత్వాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందకు అన్ని మోర్చాలు తీవ్రంగా శ్రమించాల్సి ఉందని శ్రేణులకు స్పష్టం చేసినట్టు తెలస్తోంది.

బిగ్ టాస్క్‌గా మెంబర్‌షిప్ డ్రైవ్

తెలంగాణలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి మొదలైంది. వాస్తవానికి సెప్టెంబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలవ్వాల్సి ఉన్నా భారీ వర్షాల కారణంగా ఆలస్యమైంది. ఆ తర్వాత గణేశ్ నవరాత్రి ఉత్సవాల వల్ల సైతం మెంబర్‌షిప్ డ్రైవ్‌కు బ్రేక్ పడినట్లయింది. దీంతో గత నెల 28న నడ్డా పర్యటన నాటికి దాదాపు 10 లక్షల సభ్యత్వాలను మాత్రమే చేపట్టినట్టు పార్టీ పేర్కొంది. ఈ నేపథ్యంలో లీడర్లు గడువు పొడిగించాలని కోరగా నడ్డా 15 రోజులు పొడిగిస్తూ డెడ్‌లైన్ విధించారు. కానీ అంత తక్కువ సమయంలో తెలంగాణకు ఇచ్చిన 50 లక్షల సభ్యత్వాలను పూర్తిచేయడం శ్రేణులకు సవాలుగా మారింది. 50 లక్షల్లో 10 లక్షలు పూర్తవ్వగా మరో 40 లక్షల సభ్యత్వాలు పార్టీ చేపట్టాల్సి ఉంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ బీజేపీ నేతలకు పెట్టిన డెడ్‌లైన్‌లో ఇప్పటికే 5 రోజులు పూర్తవ్వగా, మరో 10 రోజులు మాత్రమే మిగిలుంది. దీంతో నేతలు టెన్షన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతల కారణంగా స్టేట్ ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డి బాధితులను పరామర్శిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు జరుగుతుండగా సభ్యత్వాలు ఎలా చేపట్టేదంటూ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. 15 రోజులు డెడ్‌లైన్ పెట్టిన నడ్డా.. ఈ గడువు అనంతరం మరోసారి రివ్యూ చేస్తానని నేతలకు చెప్పి వెళ్లారు. ఆ సమీక్షలో ఆయనకేం సమాధానం చెప్పాలో తెలియక రాష్ట్ర నాయకత్వం సతమతమవుతోంది. అందుకే రాష్ట్ర నాయకత్వం మరింత గడువు ఇవ్వాలని హైకమాండ్‌కు రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.

ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణలోని అన్ని తండాలు, బస్తీల్లో సభ్యత్వ నమోదు క్యాంపులు ఏర్పాటుచేయాలని గిరిజన మోర్చా నేతలు నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ఆఫీసులో వారు బుధవారం సమావేశమై మెంబర్‌షిప్ డ్రైవ్‌ను సక్సెస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తండాలు, గూడేలు, బస్తీలు, గిరిజన ప్రాంతాల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కనీసం 500 మెంబర్‌షిప్ డ్రైవ్ క్యాంపులు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేపట్టాలనే డెసిషన్‌కు వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed