రేవంత్, బండి సంజయ్‌ వ్యాఖ్యలపై అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్

by GSrikanth |
రేవంత్, బండి సంజయ్‌ వ్యాఖ్యలపై అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త సచివాలయం డోమ్ లను కూల్చివేస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ప్రగతి భవన్ పై రేవంత్ రెడ్డి, కొత్త సచివాలయంపై బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నిన్న ఒకాయన ప్రగతి భవన్ కూలుస్తానంటే, ఇవాళ మరొకాయన సచివాలయాన్ని కూలగొతానని అంటున్నాడు. మేము నిర్మాణాల కోసం పునాదులు తవ్వుదామంటే వీళ్లేమో సమాధులు తవ్వుదాం, బంబులు పెట్టి లేపేద్దాం అని అంటున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి అరాచక శక్తుల చేతుల్లో రాష్ట్రం పడితే ఏమవుతుందో అలోచించాలని అన్నారు. పచ్చని మాగాణిగా మారిన తెలంగాణ పిచ్చోళ్ల చేతిలో పెట్టవద్దని తెలంగాణ ప్రజలను కోరుతున్నాన్నారు. అరాచక శక్తులు, అరాచకమైన వ్యాఖ్యలు చేస్తున్న పార్టీలను తిరస్కరించాలని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొల్పిన పరిశ్రమల ప్రగతిని గూగుల్ మ్యాప్ ఫోటోల సాయంతో కేటీఆర్ వివరించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ఈటలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సింగరేణిని అమ్మేసే ఉద్దేశం కేంద్రానికి లేదని ఈటల చేసిన ప్రకటనకు కేటీఆర్ రియాక్ట్ అవుతూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ముడి ఇనుము ఇవ్వకుండా ఎలా నష్టం చేశారో ఇప్పుడు సింగరేణికి బొగ్గుగనులు ఇవ్వకుండా చేసి ఆ తర్వాత అమ్మేసే ప్రయత్నం చేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్తులను ఇద్దరు అమ్ముతుంటే మరో ఇద్దరు కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ సంస్థల అమ్మకంతో బీసీ, ఎస్సీ, ఎస్టీల ఉద్యోగాలు పోతున్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed