Assembly: కేటీఆర్ సోదరి రూపంలో గత తెలంగాణ తల్లి.. మంత్రి సీతక్క హాట్ కామెంట్స్

by Ramesh Goud |
Assembly: కేటీఆర్ సోదరి రూపంలో గత తెలంగాణ తల్లి.. మంత్రి సీతక్క హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Meetings) కొనసాగుతున్నాయి. ఇందులో తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Thalli Statue) రూపంపై చర్చ జరుగుతోంది. దీనిపై మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై(Oppositions) ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ కార్యక్రమాన్ని ఆయా పార్టీలు వారి సొంత ఎజెండాను ముందు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ ప్రజల అస్థిత్వం, ఆత్మగౌరవం, పోరాటం, శ్రమైక జీవన రూపం, తల్లి ఆశీర్వచనం ఉన్నాయని తెలిపారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని మాట్లాడుతున్నారని, పదేళ్ల కాలంలో అధికారికంగా తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు గతంలో కేటీఆర్ సోదరికి(KTR Sistrt) దేవతా విగ్రహ రూపాన్ని ఇస్తే ఎలా ఉంటుందో ఆ రకమైన విగ్రహాలు వారు పెట్టుకొని, దానిని తెలంగాణ తల్లిగా ప్రజలపై రుద్దారని మండిపడ్డారు.

ఈ రోజు పెట్టుకునే విగ్రహం తెలంగాణ ఆడబిడ్డల అస్థిత్వం ఎలా ఉంటుందో ఆ రూపంలో ఏర్పాటు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. పదేళ్ల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలనే ఆలోచన.. జయజయహే తెలంగాణ పాటను రాష్ట్రీయ గీతంగా చేయాలని ఆలోచన కూడా రాలేదని, ఈ రోజు ఏర్పాటు చేసుకుంటుంటే అడ్డుకుంటున్నారని అన్నారు. ఉద్యమ సమయంలో టీజీ(TG)గా పిలుచుకున్న తెలంగాణను బీఆర్ఎస్ వాళ్లు టీఎస్(TS) గా మారుస్తున్నప్పుడు అడ్డుకోని బీజేపీ వాళ్లు ఈ రోజు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక తెలంగాణ మా ఊపిరి అని, తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను తీసేసి భారత రాష్ట్ర సమితి గా మార్చుకున్నదని, అంతేగాక జయజయహే తెలంగాణను వినడానికి కూడా ఇష్టపడలేదని విమర్శలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకుంటున్నట్లుగా ఉందన్నారు. తెలంగాణ బిడ్డలు అంటే మట్టి బిడ్డలు, ఎట్టి బిడ్డలు కాదని.. గట్టి బిడ్డలు అని చెబుతూ ఈ రోజు శ్రామిక రూపాన్ని తెలంగాణ తల్లిలో చూస్తున్నందుకు గర్వంగా ఉందని సీతక్క అన్నారు.

Advertisement

Next Story