పరిపాలన మాతృభాషలో జరగాలి.. వాటిని మర్చిపోతే దేశానికి మంచిది కాదు

by Nagaya |   ( Updated:2023-01-22 13:03:12.0  )
పరిపాలన మాతృభాషలో జరగాలి.. వాటిని మర్చిపోతే దేశానికి మంచిది కాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : మన మాతృభాషని కాపాడుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మన భాషని మనం కాపాడుకోవాలని ఉద్యమించడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నార్సింగిలో ఆదివారం తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ దర్శకుడు రాఘవేందర్ రావు, ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇంగ్లిష్ వాళ్ళు వెళ్లిన వారి పద్ధతులు ,ఆలోచన విధానాలు కొనసాగించడం బాధాకరం అన్నారు. మాతృభాషలో మాట్లాడడం మనందరి ధర్మం. వాటిని మర్చిపోతే దేశానికి మంచిది కాదన్నారు. నలంద ,తక్షశిల ,విక్రమ్ పూరిలలో ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునేవారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ శక్తివంతమైన దేశంగా మారుతున్నాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం అన్ని భాషలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

స్టాఫ్ సెలక్షన్ కమిటీ పరీక్షలకు భారతీయ భాషల్లో రాయడానికి నిన్న కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. పరిపాలన మాతృ భాషలో జరగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులో రావాలని... శాసనసభ, పార్లమెంట్‌లో కూడా మాతృభాషలో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. తాను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మాతృభాషలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఇక నుంచి కోర్టులో కూడా మాతృభాషలో వాదనలు జరగాలని.. తీర్పులు కూడా మన భాషలోనే రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని మోడీ మాతృభాషలో చదువుకున్నారు.. ఆ స్థాయికి వెళ్లలేదా అని అన్నారు. మమ్మి డాడీ కాకుండా అమ్మ అని పిలిచేలా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని సూచించారు. నేను పదవి విరమణ చేసాను కానీ.. పెదవి విరమణ చేయలేదని వెంకయ్యనాయుడు అన్నారు. మరోవైపు, బీబీసీ వాళ్ళ డాక్యుమెంటరీ మన ప్రధాని అవమానించడం కాదు.. మన దేశాన్ని అవమానించడం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రపంచంలోనే మనది సెక్యూలర్ దేశమని.. అలాంటిది బీబీసీ డాక్యుమెంటరీ పేరుతో మనల్ని అవమానపరిచారని అన్నారు.

Advertisement

Next Story