ఆదర్శ రైతుల నియామకంపై నివేదిక ఇవ్వాలి.. అడిషనల్ డైరెక్టర్లకు మంత్ర తుమ్మల ఆదేశాలు

by Shiva |
ఆదర్శ రైతుల నియామకంపై నివేదిక ఇవ్వాలి.. అడిషనల్ డైరెక్టర్లకు మంత్ర తుమ్మల ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆత్మ (అగ్రి టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ) కమిటీల నియమకాన్ని చేపట్టనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. త్వరలోనే ఆ కమిటీతో విస్తరణ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ రంగానికి నూతనోత్తేజం కల్పించే దిశలో ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. కమిటీల ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు మార్గ నిర్దేశ్యం చేయాలని వ్యవసాయ కమిషన్ సభ్యులను కోరారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిటీ సభ్యులు సచివాలయంలో గురువారం మంత్రిని కలిశారు. ఆదర్శ రైతుల నియామకం, వ్యవసాయ పనులకు ఉపాధిహామీ పథకం అనుసంధానం, వ్యవసాయ యంత్రాల పనిముట్లపై జీఎస్టీ ఎత్తివేత, విత్తన చట్టంలో మార్పులు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను శక్తివంతం చేసే దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆదర్శ రైతుల నియామకంపై కమిషన్ సభ్యుల సూచనలను అన్నింటిని క్రోడికరించి ఒక నివేదిక సమర్పించాలని వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్‌ను ఆదేశించారు.ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని కమిషన్ సభ్యులకు హామీ ఇచ్చారు. కమిషన్ చర్చించిన మిగతా అంశాలన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అని, విత్తనచట్టంలో మార్పులు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్రానికి ఇదివరకే విజ్ఞప్తి చేశామని అన్నారు. వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఐనప్పటికీ ఈ అంశంపై వివిధ మార్గాలలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed