'నాకు న్యాయం చేయండి' రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కోడలు ప్రజ్ఞారెడ్డి సంచలన లేఖ

by Nagaya |   ( Updated:2022-12-26 14:01:42.0  )
నాకు న్యాయం చేయండి రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కోడలు ప్రజ్ఞారెడ్డి సంచలన లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : 'దయచేసి నాకు, నా కూతురికి న్యాయం చేయండి' అని కోరుతూ వీహెచ్‌పీ నేత పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి. రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ముర్ము ఈ నెల 29న మీరు నారాయణమ్మ కాలేజీని సందర్శించునున్నారు. ఈ నేపథ్యంలో ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతికి రాసిన లేఖ సంచలనంగా మారింది. నారాయణమ్మ కాలేజీని నిర్వహిస్తున్న జి. రాఘవరెడ్డి ఆయన భార్య భారతి రెడ్డి వారి కుమార్తె శ్రీవిద్య రెడ్డిలు గత రెండేళ్లుగా తనని, తన కూతురుని వేదిస్తున్నారని ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. తనను, తన కూతురిని చంపేందుకు ప్రయత్నించారని ప్రజ్ఞారెడ్డి లేఖలో పేర్కొన్నారు. వరకట్నం కోసం తనని హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన 8 ఏళ్ల కూతురుని ఇంటి నుంచి బయటకి రాకుండా రాత్రికి రాత్రే గదిబయట గోడ కట్టారని ఆరోపించారు. ఇవన్నీ నేను చేస్తున్న ఆరోపణలు కాదు, మీడియాలో అందరూ చూశారని పేర్కొన్నారు. కోర్ట్ కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిందని, గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించిందని గుర్తుచేశారు. దీంతో అధికారులు వచ్చి ఆ గోడ తొలగించారని లేఖలో పేర్కొన్నారు.

తనకు, కూతురికి ఉన్న న్యాయమైన హక్కులను కాలరాస్తూ నన్ను బెదిరిస్తున్నారని, అత్త భారతి రెడ్డిపై ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అనేక భూ కబ్జా కేసులు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. ఒక మహిళగా మీరు నా పరిస్థితిని అర్ధం చేసుకుని నాకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నానని లేఖలో ప్రజ్ఞారెడ్డి కోరారు. ఇప్పటికే తమ పలుకుబడి తో మమల్ని, దర్యాప్తు సంస్థలని బెదిరిస్తున్న రాఘవరెడ్డి, భారతి రెడ్డి, శ్రీ విద్య రెడ్డి, ఎకనాథ్ రెడ్డిలు.. నారాయణమ్మ కాలేజీ విజిట్ తర్వాత మరింతగా మమ్మల్ని హెరాస్ చేస్తారేమోనని, దర్యాప్తు సంస్థలను ఇన్ఫ్లూయెన్స్ చేస్తారని ఆందోళన చెందుతున్నానంటూ ప్రజ్ఞారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి తనకు, తన కూతురికి న్యాయం చేయాలని ప్రజ్ఞారెడ్డి లేఖలో కోరారు. మరి దీనిపై రాష్ట్రపతి ముర్ము స్పందించి ఆమెకు న్యాయం చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed