దారుణం.. పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి..!

by Rajesh |
దారుణం.. పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు  మృతి..!
X

దిశ, తాండూరు : ఇంట్లో ఉన్న 5నెలల పసి బాలుడుని పెంపుడు కుక్క దాడి చేసి చంపిన ఘటన తాండూరులో కలకలం రేపింది. ఈ హృదయ విదారక ఘటన తాండూరు మండలం కరన్ కోట్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దత్తు, లావణ్య దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతి పరిధి బసవేశ్వర నగర్‌లో సంగెంకలాన్ గ్రామానికి చెందిన జి.నాగభూషణంకు చెందిన పాలిషింగ్‌ యూనిట్లో పనిచేస్తున్నారు. వీరికి పుట్టిన ఏకైక సంతానం సాయి(ఐదు నెలలు) ఉన్నాడు. రోజువారీగా దత్తు పాలిష్ యూనిట్లో నాపరాయి కట్ చేస్తుండగా దత్తుకు దాహం వేయడంతో భార్యకు నీళ్లు తీసుకు రమ్మని చెప్పాడు.

దీంతో లావణ్య పసికందును ఇంట్లో ఉంచి నీళ్లను తన భర్తకు అందించడానికి వెళ్ళింది. ఇంతలో అక్కడే ఉన్న పెంపుడు కుక్క ఇంట్లోకి చొరబడి ఐదు నెలల పసికందును అతి క్రూరత్వంగా కొరికి పీక్కు తిన్నది. దీంతో ఐదు నెలల సాయి మృతి చెందాడు. బాబు ఏడుస్తుండగా గమనించిన తల్లి లావణ్య హుటా హుటిన ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆసుపత్రికి హుటాహుటిన తరలించిన లాభం లేకుండా పోయింది. కోపోద్రికుడైన కుటుంబ సభ్యులు ఆ పెంపుడు కుక్కను కొట్టి చంపేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. అయితే పెంపుడు కుక్కలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. వీధి, పెంపుడు కుక్కలు చిన్నారులపై దాడి చేస్తున్నా ఏ మాత్రం పట్టనట్లే ఉన్నారని స్థానికులు ఆగ్రహం చేస్తున్నారు.

Advertisement

Next Story