తెలంగాణలో నిరుద్యోగులకు మళ్లీ నిరాశేనా..!

by Anukaran |   ( Updated:2021-03-25 11:56:15.0  )
తెలంగాణలో నిరుద్యోగులకు మళ్లీ నిరాశేనా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లు. రాష్ట్ర శాసనసభలో గురువారం ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఈ నెల నుంచే వర్తించనుంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కంటే ఇది అత్యధిక వయస్సే. కేంద్ర ఉద్యోగులకు సైతం 60 ఏండ్లకే రిటైర్మెంట్ ఉంది. పీఆర్సీ కమిటీ సైతం 60 ఏండ్లకే సిఫార్సు చేసింది. సీఎం కేసీఆర్ మాత్రం 61 ఏండ్లకు పెంచారు. దీంతో ఉద్యోగ వర్గాలు సంబురంలో ఉన్నా 8.65 లక్షల నిరుద్యోగుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. పీ అండ్ ​ఓ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27,480 మంది ఈ మూడేండ్ల వ్యవధిలో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, వారందరూ ఈ తీర్మనంతో ఆ ఉద్యోగాల్లోనే కొనసాగనున్నారు.

నిరుద్యోగుల సంగతేంది..?

తెలంగాణలో కొత్త ఉద్యోగాల మాటే మర్చిపోయి చాలా కాలమైంది. ఇప్పుడిప్పుడే 50 వేల పోస్టులను భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం తరుఫున చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ పీజీ పట్టాలు చేతిలో పట్టుకుని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఏళ్లుగా చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. మరోవైపు అవసరమైతే నిరుద్యోగ భ‌ృతి అయినా ఇస్తాం కానీ, కొత్త ఉద్యోగం అడగొద్దు అనేలా సర్కారు తీరు ఉంది. పీఆర్సీ పెంపుతో ఉద్యోగులు కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేస్తే, ఓయూ స్టూడెంట్స్ చెప్పులతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు పదవీ విరమణ వయసు పెంచడంపై నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు పాలనలో ఇప్పుడంతా సాంకేతికత కమ్మేసింది. అంతా కంప్యూటరైజ్డ్ వర్క్​గా మారింది.

పదవీ విరమణ వయసు దగ్గర పడిన సీనియర్ మోస్ట్ ఎంప్లాయిస్ ఈ కొత్త సాంకేతికతకు అంతగా అలవాటు పడటంలేదనేది ఆయా శాఖల వారీగా ఓ నివేదికను కూడా సమర్పించారు. కంప్యూటర్ స్కిల్స్‌లో నైపుణ్యం లేని సీనియర్ మోస్ట్ ఉద్యోగులు మరో మూడేళ్ల పాటు అదే సీటులో ఉంటే పని విధానం మరింత నెమ్మదిస్తుందనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అదేస్థానంలో కొత్త ఉద్యోగాలతో పట్టభద్రులను తీసుకుంటే టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు ఉత్సాహంతో మంచి ఫలితాలు వస్తాయని నిరుద్యోగులు అంటున్నారు. ఇప్పటికే సీనియర్లకు సుమారు లక్ష వరకూ వేతనాలున్నాయని, మరో మూడేళ్లు కొనసాగిస్తే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది సర్కారుకు పెను భారమేనని పలువురు హెచ్చరిస్తున్నారు.

త్వరలోనే 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: మంత్రి హరీశ్‌రావు

ఉద్యోగుల అనుభావాన్ని ఉప‌యోగించుకోవాల‌నే ఉద్దేశంతోనే ప్రభుత్వం పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంద‌ని, రిటైర్డ్ వ‌య‌సు పెంపుతో ఖాళీల భ‌ర్తీ విష‌యంలో ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఉద్యోగుల‌కు ప్రమోష‌న్లు ఇచ్చి ఖాళీల భ‌ర్తీని చేప‌డుతామ‌ని చెప్పారు. రాష్ర్టంలో 50 వేల పోస్టుల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే ఆదేశించారని త్వ‌ర‌లోనే ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వెలువడుతాయ‌ని ఆయన వివరించారు.

Advertisement

Next Story

Most Viewed