సమస్యల నిలయం ధరణి పోర్టల్.. పరిష్కారం అసాధ్యం..!

by Shyam |   ( Updated:2021-03-15 09:49:05.0  )
సమస్యల నిలయం ధరణి పోర్టల్.. పరిష్కారం అసాధ్యం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం తెలంగాణలో రెండు రకాల భూ సమస్యలే వినిపిస్తున్నాయి. ఒకటి ధరణి పోర్టల్ లో తప్పులు, మరొకటి నిషేధిత జాబితాలో పొరపాట్లు. మొదటి సమస్యలో అనేక చిక్కులు. పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని ఆప్షన్లు ఇచ్చామంటూ సర్క్యులర్లు జారీ చేసినా టెక్నాలజీకి సంబంధం లేకుండాపోతోంది. దరఖాస్తు చేసుకునేందుకు సవాలక్ష సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిషేధిత భూముల జాబితాలో అన్యాయంగా పట్టా భూములను చేర్చారంటూ వేలాది మంది గగ్గోలు పెడుతున్నారు. వారం రోజుల్లోనే పరిష్కరించాల్సిన సమస్యకు నెలలు పడుతోంది. రికార్డుల ప్రకారమే చేస్తామంటూ కొందరు తహసీల్దార్లు, కలెక్టర్లు వాదిస్తున్నారు.

ఆ రికార్డులే తప్పు అని పెట్టుకున్న దరఖాస్తుకు, అదే రికార్డు ఆధారంగా పరిశీలిస్తామంటున్నారని రెవెన్యూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ ప్రొ.ఎం.సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 22ఏ జాబితా సవరణలోనూ పిటిషనర్, ఆయన తరఫున న్యాయవాదులు ఏం చెబుతారో వినాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కనీసం లిఖితపూర్వకంగా ఇచ్చే వాదనలను కూడా స్వీకరించేందుకు కొందరు అధికారులు ససేమిరా అంటున్నారన్నారు. టెక్నాలజీ ఆదేశాల మేరకు పరిష్కారం అసాధ్యం..? కంప్యూటర్లలో తప్పులు నమోదు చేసి అదే డేటా ఆధారంగా పరిష్కారంతో న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు.

తెగెదెట్లా..?

ఓ పేద రైతుకు రెండెకరాలు ఉంది. అమ్మడానికేమో ధరణి పోర్టల్ ఒప్పుకోవడం లేదు. ఎన్నో ఏండ్లుగా సాగు చేస్తోన్న భూమి తనది కాదంటూ నిషేధిత జాబితాలో పెట్టారు. తహసీల్దార్ దగ్గరికెళ్తే కోర్టుకు వెళ్లమనడంతో లాయర్ కు అన్ని విషయాలు చెప్పి కేసు వేయించారు. న్యాయం దొరికితే తప్ప బిడ్డ పెళ్లి చేయలేనంటూ సికింద్రాబాద్ లోని ఓ న్యాయవాది దగ్గర బోరుమన్నాడు. లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తే తహసీల్దార్ పీఓబీ కేసుల్లో స్వీకరించం, రికార్డుల ప్రకారమే చేస్తామంటున్నారు. కేసు తెగేదెన్నడు..?

మా పని ఎందుకు చేయడం లేదని న్యాయవాదికి ఫోన్ చేసి ఓ నాయకుడు సీరియస్ అయ్యాడు. ఫోన్ లో ఎందుకు? ఆఫీసుకు రండి అని సాదరంగా ఆహ్వానించారు. మీరు కొత్త ఆర్వోఆర్ బాగుందని ర్యాలీలు తీసి పాలాభిషేకాలు చేశారు. కానీ అదే చట్టం కింద మీ ఆర్వోఆర్ కేసు ఆలస్యమవుతోందని చెప్పడంతో సదరు లీడర్​ న్యాయవాదికి సారీ చెప్పి వెళ్లిపోయారు.

పరిష్కారంపై నిరాసక్తత..

ఏళ్లుగా నలుగుతున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పీఓబీ జాబితాలో పట్టా భూములు చేరాయని గుర్తించినా సవరించేందుకు ఆసక్తి లేదు. తన కంటే ముందు అధికారులు చేయలేదు, తాను చేసే క్రమంలో పొరపాట్లు జరిగితే క్రమశిక్షణా చర్యలకు బలి కావాల్సి వస్తోందన్న అభిప్రాయం ఐఏఎస్ అధికారుల్లో ఉందన్న చర్చ నడుస్తోంది. అందుకే ఏ పీఓబీ సమస్యకైనా సేత్వార్, ఖాస్రా పహాణీ ప్రకారం ప్రభుత్వ భూమి అని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. కానీ సేత్వార్ నుంచి నేచర్ ఆఫ్ ల్యాండ్ ఎలా మారిందో, దానికి సంబంధించిన సర్క్యులర్లు, కేటాయింపులు, ఎన్వోసీ పత్రాలను పరిశీలించడం లేదు. పీఓబీ సమస్యలను పరిష్కరించేందుకు వేలాది దరఖాస్తులు వచ్చాయి. వాటిని కలెక్టర్లు పరిశీలించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ లో ఆటో లాక్ వేసిన తర్వాత ఏ ఒక్క సర్వే నెంబరును జాబితా నుంచి తొలగించలేదని విశ్వసనీయంగా తెలిసింది.

తప్పులు సవరించకుండానే..

నిషేధిత జాబితా విషయంలో 2015 లో హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త జాబితా తయారు చేసి ధరణి పోర్టల్ లో చేర్చారా..? లేదా..? అన్న విషయంపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత లేదు. నిషేధిత భూముల జాబితాను తయారు చేసేటప్పుడు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నా చేయలేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో తప్పులు చోటు చేసుకున్నా పరిష్కరించలేదు. అన్నీ ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల దగ్గర పెండింగులోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక ట్రిబ్యునళ్ల దగ్గర ఉన్నాయి. వాటి సంగతి తేల్చలేదు. పీఓబీ జాబితా రూపకల్పనకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించకుండానే పట్టా భూములను ప్రభుత్వానివిగా లెక్క తేల్చారని ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ అన్నారు. అలాగే పాయిగా, జాగీర్, సంస్థాన్ వంటి భూములకు ఆర్వోఆర్ వర్తించదు. వాటిని ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. కొన్ని భూములను సెటిల్ చేశారు. ఆర్వోఆర్ 1971 చట్టంలో 2018 లో సెక్షన్ 12-ఎ సబ్ సెక్షన్ 3 ప్రకారం అంతకు ముందే సెటిల్ చేసిన పాయిగా, జాగీర్ భూములకు ఈ నియమం వర్తించదని సవరణ చేశారు. కానీ కొత్త ఆర్వోఆర్ చట్టంలో అలాంటి వెసులుబాటు కల్పించలేదు.

కోర్టు చుట్టూ తిరగాల్సిందే..

కంప్యూటర్ ద్వారా న్యాయం లభించకపోతే ఎవరైనా సరే కోర్టుకు వెళ్లాల్సిందేనని ధరణి పోర్టల్, తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020 స్పష్టం చేస్తోంది. అందుకే ఓ మంత్రితో సహా పలువురు ఐఏఎస్(రిటైర్డ్) అధికారులు కూడా పీఓబీ జాబితాపై కోర్టులను ఆశ్రయించినట్లు తెలిసింది. టెక్నాలజీ ఆధారంగానే పరిష్కారం అనడంతో అన్యాయం జరుగుతుందని భావించారు. కనీసం నేచర్ ఆఫ్ ల్యాండ్ ఎలా మారిందో అధికారులు పరిశీలించడానికి ఆసక్తి చూపడం లేదు. వారికి అలాంటి ఆప్షన్లు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.

ఎన్నెన్నో పీఓబీ లీలలు..

* నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని మర్రిగూడెం, బట్లపల్లి, వట్టిపల్లి, రాజాపేటతండ రెవెన్యూ గ్రామాలకు చెందిన ఎంతో మంది రైతులు మూడేండ్ల నుంచి తిరుగుతూనే ఉన్నారు. వారి భూముల నుంచే ఆర్అండ్ బీ రహదారి వేశారు. భూ సేకరణ చేశారు. అవార్డు పాస్ చేశారు. వారి దగ్గర తీసుకున్న భూమి కొంతయితే ఆ సర్వే నెంబర్లన్నీ తమవేనంటూ ప్రభుత్వం వాటిని నిషేధిత భూముల జాబితాలో పేర్కొంది. ఆర్ అండ్ బీ రహదార్ల కోసం సేకరించిన భూములపైనా రైతులకు తీవ్ర అన్యాయం చేశారు.

* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో సర్వే నెంబర్​ 65లో చాలా మంది పట్టాదారులున్నారు. వారి పట్టాదారు పుస్తకాల్లో మాత్రం పట్టా భూములుగానే ఉన్నది. ధరణి పోర్టల్ లో మాత్రం లావునీ భూములుగా పేర్కొనడంతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. గట్టుపల్లిలో సర్వే నెంబర్​ 65/1 లోని 35.28 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి అని, మిగతా సర్వే నెంబర్లు 65/2 నుంచి 65/15 వరకు పట్టా భూములని లేఖ నెంబరు బీ/1578/2016, తేదీ.6.6.2016 ద్వారా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కు మహేశ్వరం తహసీల్దార్ కు పంపారు. కానీ ధరణి పోర్టల్ లో మాత్రం చాలా నెంబర్లు ప్రభుత్వమని, లావునీ అని నమోదు చేశారు. వాటిని పీఓబీలో నమోదు చేశారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో సర్వే నెం.50 లో విస్తీర్ణం చాలా పెద్దది. 1000 ఎకరాలకు పైగా ఉంది. ఇందులో కొంత ప్రభుత్వ భూమి, మిగతా పట్టా భూమిగా రికార్డుల్లో నమోదైంది. ధరణి పోర్టల్ లో మాత్రం చాలా బై నెంబర్లను ప్రభుత్వానిదిగా, లావునీ భూములుగా నమోదు చేశారు. కొన్నింటిని మాత్రం పట్టా భూములుగా పేర్కొన్నారు.

Advertisement

Next Story