- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Gaza: గాజాలో ఇజ్రాయెల్ బీభత్సం.. 85 మంది పాలస్తీనియన్లు మృతి

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో ఇజ్రాయెల్ (Israel) బీభత్సం సృష్టిస్తోంది. భారీ వైమాణిక దాడులతో విరుచుకుపడుతోంది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ (Khan Younis) , రఫా (Rafa) నగరాలు, ఉత్తర గాజాలోని బీట్ లాహియా (Beat lahiya) పట్టణంపై గురువారం దాడులు చేపట్టింది. ఈ ఘటనలో 85 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. దీంతో కాల్పుల విరమణ అనంతరం ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడుల కారణంగా మరణించిన వారి సంఖ్య 592కి చేరింది. అంతేగాక ఇజ్రాయెల్ దళాలు గాజాలోకి ప్రవేశించి, ఉత్తర, దక్షిణ గాజాలను విభజించే నెట్‌జారిమ్ కారిడార్‌లోని ఒక భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్ గా మార్చి భూదాడులు సైతం ప్రారంభించినట్టు తెలుస్తోంది.
హమాస్‌ను నాశనం చేస్తాం: కాట్జ్
గాజాపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పందించారు. తమ బందీలను వెంటనే విడుదల చేయకపోతే హమాస్‌ను పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు. హమాస్‌కు ఇదే చివరి వార్నింగ్ అని తేల్చిచెప్పారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహా తీసుకోండి. బందీలను తిరిగి పంపించండి. అప్పుడు మాత్రమే హమాస్‌కు ఇతర ఆప్షన్లు ఉంటాయి. ప్రపంచంలోని ఇతర ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారికి అక్కడ నుంచి బయలుదేరే అవకాశం కూడా ఉంది’ అని తెలిపారు. కాగా, మంగళవారం నుంచి ఇజ్రాయెల్ తిరిగి దాడులు ప్రారంభించిన తర్వాత మొత్తం 592 మంది మరణించారని అందులో 183 మంది పిల్లలు, 94 మంది మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 678 మంది గాయపడ్డారని వెల్లడించింది.