పవన్ కల్యాణ్ డిమాండ్‌కు టీడీపీ మద్దతు

by srinivas |
పవన్ కల్యాణ్ డిమాండ్‌కు టీడీపీ మద్దతు
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ డిమాండ్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మద్దతు పలికారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లాలన్న పవన్ కల్యాణ్ డిమాండ్‌‌ను తాను స్వాగతిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లమని ముందు నుంచి టీడీపీ డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. ఉద్యమం ఆరంభంలోనే దీక్షా శిబిరాన్ని చంద్రబాబు సందర్శించారని గుర్తు చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానంపై తమకు నమ్మకం లేదని, ఢిల్లీకి పంపించి ఉంటే సమాధానం రావాలి కదా అని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ చెప్పినట్టు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు లోక్‌సభలో బల్ల గుద్ది మాట్లాడారని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వచ్చి అక్కడ ఒక మాట ఇక్కడ ఒకమాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వారం రోజుల్లో అఖిలపక్షం వేయాలన్న పవన్ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరిస్తే చాలా సంతోషమని…తాము ఏమి అడిగినా రివర్స్‌లో చేయడం ప్రభుత్వానికి అలవాటని విరుచుకుపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన అంతా సీక్రెట్‌గా ఉంటుందని, ఇది సరికాదన్నారు.

ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసిన తర్వాత బైటకు వచ్చి వివరాలు మీడియాకు వెల్లడిస్తారని, కానీ సీఎం జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని ముందు నుంచి టీడీపీ ఆరోపిస్తుందని, ఇప్పటికైనా గవర్నర్‌లో చలనం వచ్చినందుకు సంతోషం అన్నారు. పవన్ ఇచ్చిన వారం రోజుల డెడ్‌లైన్‌కు వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దామని అచ్చెన్నాయుడు ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed