- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఏఎస్ లాగే టీఏఎస్.. ఇందులో అందరికీ చాన్స్
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో పాలనా విధానంలో అనేక మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే పాలనను ప్రజల ముంగిటకు తీసుకురావాలన్న లక్ష్యంతో 33 జిల్లాలను ఆవిష్కరించారు. ప్రజలకు మేలైన, సత్వర చర్యలు అందించేందుకు దోహదపడుతోంది. కానీ ఎప్పటికీ అఖిల భారత సర్వీసు అధికారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. వారిలో చాలా మందికి ఈ ప్రాంత చరిత్ర, భౌగోళిక పరిస్థితులపై సరైన అవగాహన లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి అవసరమైన చర్యలను ముందుకు తీసుకెళ్లడం కష్టం. అందుకే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నాటి ప్రతిపాదనను మళ్లీ తెర మీదికి తీసుకొచ్చారు. కొందరేమో రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం లేకపోలేదంటున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో కసరత్తు ప్రారంభించినట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ దర్శనంతో పని చేస్తూ ముందుకు నడవాలంటే నిఖార్సైన, నిబద్ధులైన పాలనాధికారుల అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలన్నా, పాలకులు ఆశించిన రీతిలో ప్రజలకు ఫలాలను అందించాలన్నాత్యాగపూరితంగా పని చేసే ఉద్యోగులు అత్యవసరం. దీని కోసం ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన, ప్రేమానురాగాలు ఉన్న వ్యక్తులను పాలనాధికారులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఓ రిటైర్డ్ విజిలెన్స్ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంత భూమి పుత్రులైతేనే రాష్ట్ర పునర్నిర్మాణానికి వడివడిగా అడుగులు పడతాయి. అనేక సవాళ్లను, అవరోధాలను ఎదుర్కోవాలంటే వీరి అవసరం అనివార్యం. అందుకే ఈ ప్రాంత మానవ వనరులను తీర్చిదిద్దుకునేందుకు తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును రూపొందించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
అధ్యయనం పూర్తి
కొన్ని రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు ద్వారా నియామకాలు సాగుతున్నాయి. కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ మేరకు సర్వీసులు ఉన్నాయి. అక్కడి కమిషన్ల పనితీరుపై గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యయనం చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు టి.వివేక్ ‘దిశ’కు శనివారం వివరించారు. కమిషన్ పనితీరును అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు చెప్పారు. సమర్థవంతమైన పాలనను అందించాలంటే కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు ఎంతో అవసరం. అదే సమయంలో యువ అధికారుల కొరత కూడా ఉంది. అందుకే శక్తి సామర్థ్యాలతో పాటు తెలంగాణ ప్రాంతంపై ప్రేమానురాగాలు కలిగిన యువ అధికారుల నియామకంపై ‘టాస్’ ఉద్యోగులను టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టడం సముచితంగా ఉంటుంది. ఉద్యోగ నియామకం కోసం యూపీఎస్సీ చేసినట్లుగా తెలంగాణ భౌగోళిక, చారిత్రకాంశాలను పాఠ్యాంశాలుగా చేర్చి పరీక్షలు నిర్వహించాలి. దీని ద్వారా ఐఏఎస్‌లకు తోడుగా టాస్ ద్వారా నియామకమయ్యే ఉద్యోగులు ఎంతో సమర్ధవంతంగా పని చేస్తారు. వివిధ పాలనా విభాగాల్లో పని చేస్తోన్న వారికి తర్ఫీదుతో ఐఏఎస్ లుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్ సంస్థానం విలీనానికి ముందు తెలంగాణలో హైదరాబాద్ సివిల్ సర్వీసు ఉండేది. నిజాం కాలంలో ఏర్పాటైన సివిల్ సర్వీసు ఐఏఎస్‌కు దీటుగా ఉండేది. అందుకే విలీనం తర్వాత అప్పటి తెలంగాణ సివిల్ సర్వీసు అధికారులు రాష్ట్ర చీఫ్ సెక్రెటరీలుగా ఎదిగిన వారున్నారు.
అన్ని శాఖలకు అవకాశం
సివిల్ సర్వీసుల్లో 67 శాతం వరకు డైరెక్ట్‌గా రిక్రూట్ అవుతున్నారు. మిగిలిన 33 శాతం వివిధ శాఖల అధికారుల నుంచి పదోన్నతి పొందుతున్నారు. ఈ 33 శాతంతో 85 శాతం వరకు డిప్యూటీ కలెక్టర్లే కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారని వివేక్ తెలిపారు. మిగతా శాఖలకు చెందిన గ్రూపు-1 అధికారులకు కేవలం 15 శాతంతోనే సరిపెడుతున్నారు. వీరంతా గ్రూప్-1 అధికారులుగా పరీక్ష రాసి ఉద్యోగం పొందినప్పుడు అన్ని శాఖలు, అన్ని రకాల బాధ్యతలు నిర్వహించే ఐఏఎస్ పోస్టులకు కేవలం రెవెన్యూ శాఖకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం తగదు. దీని వల్ల మిగతా శాఖల్లో పని చేస్తోన్న గ్రూపు-1 అధికారుల నైపుణ్యాన్ని తొక్కి పడేస్తున్నట్లే అవుతుందన్నారు. గ్రూపు-1 పోస్టు కోసం రెవెన్యూ అధికారిగా ఉద్యోగం సంపాదించిన వ్యక్తితో సమానంగానే మిగతా వారూ చదివి ఉంటారు. అదే స్థాయిలో కష్టపడి ఉంటారు. ఈ క్రమంలో ఐఏఎస్ గా పదోన్నతి వరకు చేరుకోలేకపోతున్నామన్న ఆవేదన మిగిలే ఉంటుంది. అందుకే టాస్ లాంటి వ్యవస్థలు ఉంటే అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయంటున్నారు.
స్థానిక మానవ వనరులకు అవకాశం
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఏర్పాటు చేయాల్సిన అనివార్యత ఉంది. ఉద్యమ కాలం నాటి నుంచి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆయన కూడా ఆ లక్ష్యంతోనే ఉన్నారు. తాజాగా దీని ఏర్పాటుపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ పరిణామాల క్రమంలో త్వరలోనే టాస్ ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆవిష్కృతమైతే తెలంగాణ ప్రాంత యువ అధికారులకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక్కడి మానవ వనరులకు ప్రధాన పీట వేయొచ్చు. యూపీఎస్సీ మాదిరిగా ‘టాస్’ ద్వారా పాలనా సమర్థులను సిద్ధం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. కేవలం కేంద్ర సర్వీసుల మీదనే ఆధారపడడం ద్వారా కొరత తీవ్రంగా వేధిస్తోంది. పైగా ఇక్కడి విధానాలు, జీవితాలపై సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తులే ఐఏఎస్‌లుగా వచ్చే అవకాశం లభిస్తుంది. టాస్ ఏర్పాటును మొదటి నుంచి మేం స్వాగతిస్తున్నాం. – టి.వివేక్, మాజీ సభ్యుడు, తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్