ఏడాది తర్వాత టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన నాదల్‌కు బిగ్ షాక్

by Harish |
ఏడాది తర్వాత టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన నాదల్‌కు బిగ్ షాక్
X

బ్రిస్బేన్ : గాయం కారణంగా ఆటకు దూరమైన స్పెయిన్ స్టార్, దిగ్గజ ప్లేయర్ రఫెల్ నాదల్ దాదాపు ఏడాది తర్వాత టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో బరిలోకి దిగాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత తొలి మ్యాచ్‌ ఆడిన అతనికి బిగ్ షాక్ తగిలింది. పురుషుల డబుల్స్‌లో నాదల్-మార్క్ లోపెజ్(స్పెయిన్) జోడీ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ జోడీని 4-6, 4-6 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన జోర్డాన్ థాంప్సన్-మాక్స్ పర్సెల్ ద్వయం చిత్తు చేసింది. గంటా 13 నిమిషాలపాటు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్ జోడీ వరుసగా రెండు సెట్లను కోల్పోయి ఓటమిని అంగీకరించింది. ఆసిస్ జోడీ 12 ఏస్‌లు బాదగా.. నాదల్ జంట ఒక్క ఏస్ కూడా సంధించలేదు. అలాగే, నాదల్ జంట రెండు సార్లు సర్వీస్‌లను కోల్పోవడం కూడా మ్యాచ్ చేజారడానికి కారణమైంది. కీలక సమయాల్లో తప్పిదాలు చేసి మ్యాచ్‌ను చేజార్చుకున్న నాదల్ జోడీ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. డబుల్స్‌లో ఓడిపోయినప్పటికీ నాదల్ సింగిల్స్‌ బరిలో ఉన్నాడు. మంగళవారం జరిగే సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ డొమినిక్ థీమ్‌తో తలపడనున్నాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్-2024కు ముందు జరుగుతున్న ఈ టోర్నీ నాదల్ తిరిగి పుంజుకునేందుకు కీలకం కానుంది. కాగా, ఈ ఏడాది ఆరంభంలో నాదల్ తుంటి గాయంతో బాధపడ్డాడు. గాయం కారణంగా ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయిన అతను రెండో రౌండ్‌లోనే పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత గాయానికి శస్త్రచికిత్స చేసుకున్న అతను ఇటీవల కోలుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌తో ఆటకు దూరమైన అతను.. ఏడాది తర్వాత తిరిగి అదే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ నాటికి అందుబాటులోకి వచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed