టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్?.. పాండ్యాను పక్కనపెట్టబోతున్నారా?

by Harish |
టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్?.. పాండ్యాను పక్కనపెట్టబోతున్నారా?
X

దిశ, స్పోర్ట్స్ : భారత టీ20 కొత్త కెప్టెన్ ఎవరు? అన్న దానిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ పేరు తెరపైకి వచ్చింది. పాండ్యాను కాదని సూర్యకు టీ20 బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బోర్డు సూర్య వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నెల చివర్లో టీమ్ ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కు జట్ల ఎంపికపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చర్చలు జరుపుతున్నారు. నేడో, రేపో జట్లను ప్రకటించనున్నారు. అప్పుడే కొత్త కెప్టెన్ ఎవరో? కూడా రివీల్ కానుంది.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు గుడ్ బై చెప్పాడు. పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. వన్డే, టెస్టు జట్లకు సారథిగా కొనసాగనున్నాడు. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రోహితే కెప్టెన్‌గా ఉంటాడని బీసీసీఐ సెక్రెటరీ జై షా స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో వన్డే, టెస్టులకు ఇప్పట్లో కొత్త కెప్టెన్ రాడన్నది స్పష్టమైంది. మరోవైపు, టీ20 జట్టు కొత్త కెప్టెన్‌ కోసం బీసీసీఐ కసరత్తు చేస్తున్నది.

అయితే, కెప్టెన్ రేసులో హార్దిక్ పాండ్యా ముందున్నాడు. టీ20 వరల్డ్ కప్-2022 తర్వాత రోహిత్ చాలా కాలంపాటు టీ20లకు దూరంగా ఉన్నాడు. అప్పుడు పొట్టి సిరీస్‌ల్లో భారత్‌ను పాండ్యానే నడిపించాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో అతనే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీంతో పాండ్యానే తదుపరి కెప్టెన్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే, హెడ్ కోచ్‌ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తదుపరి కెప్టెన్‌ను నియమించాలని అనుకుంటున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాండ్యాను ఎప్పటి నుంచో గాయాలు వెంటాడుతున్నాయి. గాయాల కారణంగా అతను జట్టులోకి వస్తూ పోతున్నాడు. ఈ కారణం అతన్ని కెప్టెన్‌గా నియమించడానికి అడ్డుగా ఉంది. 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్‌‌ను దృష్టి పెట్టుకుని సారథి ఎంపిక ఉండనుంది.

సూర్య వైపు మొగ్గు

హెడ్ కోచ్‌ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సూర్య వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. టీ20ల్లో సూర్య కూడా భారత జట్టును నడిపించిన అనుభవం ఉంది. గతేడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌కు తొలిసారిగా నాయకత్వం వహించాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా టూరులోనూ జట్టును నడిపించారు. రెండు సందర్భాల్లోనూ జట్టుకు సిరీస్ విజయాలు అందించాడు. అతని నాయకత్వంలో భారత్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట నెగ్గింది. ఒకటి ఓడిపోగా.. మరో మ్యాచ్‌ రద్దైంది. ఆ మ్యాచ్‌ల్లో సారథిగానే కాకుండా ప్లేయర్‌గానూ సూర్య సత్తాచాటిన 300 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతోపాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ రికార్డు కూడా గంభీర్, అజిత్ అగార్కర్‌‌లను ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed