ధోనీ జెర్సీ నం.7 ధరించడం వెనుక చాలా లెక్కలు.. రివీల్ చేసిన మహేంద్రుడు

by Harish |
ధోనీ జెర్సీ నం.7 ధరించడం వెనుక చాలా లెక్కలు.. రివీల్ చేసిన మహేంద్రుడు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఏ ఇంట్రెస్టింగ్ టాపిక్‌ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా అతను గురించి ఓ విషయం ట్రెండింగ్‌లో ఉంది. నం.7 జెర్సీతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. భారత్ తరపున ఆడినప్పుడు నం.7 జెర్సీని ధరించిన అతను ఐపీఎల్‌లోనూ అదే జెర్సీతో ఆడుతున్నాడు. అయితే, ధోనీ నం.7 జెర్సీని ధరించడం వెనుక చాలా లెక్కలు ఉన్నాయట.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ నం.7 జెర్సీ తనకెందుకు ప్రత్యేకమో వివరించాడు. ‘7వ తేదీన మా తల్లిదండ్రులు నాకు జన్మనివ్వాలనుకున్నారు. నేను 1981లో జూలై 7న జన్మించాను. జూలై అంటే ఏడో నెల. ఆ ఏడాది 81వ సంవత్సరం కాబట్టి.. 8లో నుంచి ఒకటి తీసేస్తే ఏడు వస్తుంది. అందుకే, నీకు జెర్సీ నంబర్ కావాలని నన్ను అడిగినప్పుడు నం.7ను ఎంచుకోవడం నాకు తేలికైంది.’ అని ధోనీ వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నం.7 జెర్సీ వెనకాల ఇంత స్టోరీ ఉందా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు, మోకాలి గాయం బారిన పడిన ధోనీ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. అయితే, ఐపీఎల్-2024లో అన్ని మ్యాచ్‌లు ఆడతాడా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, అతనికి ఇదే చివరి సీజన్ కావొచ్చనే చర్చ జరుగుతుంది. గత సీజన్‌లో ధోనీ నాయకత్వంలో చెన్నయ్ సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సారి డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టబోతున్నది. ఐపీఎల్‌కు ముందు సీఎస్కే ప్రీ ఐపీఎల్ క్యాంప్ నిర్వహించాలనుకుంటున్నది. ఈ విషయాన్ని ఆ జట్టు పేసర్ దీపక్ చాహర్ వెల్లడించాడు. మార్చి 1 నుంచి ప్రీ ఐపీఎల్ క్యాంప్ జరగనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed