ఆస్ట్రేలియా వికెట్ కీపర్ వేడ్ సంచలన నిర్ణయం

by Harish |
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ వేడ్ సంచలన నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాటర్ మాథ్యూ వేడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికిన వేడ్.. కోచ్‌గా అవతరమెత్తనున్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

‘గత టీ20 వరల్డ్ కప్‌‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు ముగుస్తుందని నాకు తెలుసు. గత ఆరు నెలలుగా రిటైర్మెంట్, కోచింగ్ గురించి చర్చలు జరుపుతున్నా. ఇక, నా అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు.’ అని వేడ్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ దేశవాలీ, బిగ్‌బాష్ లీగ్, ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడటం కొనసాగిస్తానని చెప్పాడు.

2011లో అరంగేట్రం చేసిన వేడ్ 13 ఏళ్ల కెరీర్‌లో ఆసిస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా 2021 టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకంగా ఉన్నాడు. 36 టెస్టులు, 97 వన్డేలు, 92 టీ20లు ఆడిన అతను మూడు ఫార్మాట్లలో 4,682 పరుగులు చేశాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌పై వేడ్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. పాకిస్తాన్‌తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్‌తో వేడ్ కోచ్‌గా మారనున్నాడు.

Advertisement

Next Story