హెచ్‌సీఏకు బిగ్ షాక్....

by Shiva |   ( Updated:2023-02-15 06:17:06.0  )
హెచ్‌సీఏకు బిగ్ షాక్....
X

ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీ నియామకం

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేస్తుూ భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రస్తుతం హెచ్‌సీఏలో ఉన్న కమిటీని రద్దు చేసి, ఏక సభ్య కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నూతన కమిటీ జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో పని చేయనుంది. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలన్నీ అదే కమిటీనే చూసుకోనున్నట్లు స్పష్టం చేసంది. ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలోనే హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే కోరారు.

గతంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షణలోనే ఇండియన్ ఒలింపిక్ సంఘం ఎలక్టోరల్ కాలేజీ ఖరారైందని ఆయన సుప్రీంకోర్టుకు వివరించారు. ఇప్పటికే ఐఓఏ ముసాయిదా రాజ్యాంగాన్ని పర్యవేక్షిస్తున్నారని కూడా తెలిపారు. ఆయన వాదనలు విన్న సుప్రీంకోర్టు వీటిపై సానుకూలంగా స్పందించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఇచ్చే నివేదికను బట్టి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.

హెచ్‌సీఏలో చాలా అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నేతృత్వంలో ఉన్న హెచ్‌సీఏపై ఇదే కమిటీలోని మరికొందరు విమర్శల వర్షం కురిపించారు. అలాగే గతేడాది టీ20 మ్యాచ్ సమయంలో టికెట్ల అమ్మకాల విషయంలో పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అన్ని టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మాలని డిమాండ్లు వచ్చాయి. అయితే వీటిని అజారుద్దీన్ కార్యవర్గం ఏమాత్రం పట్టించుకోలేదు.

దీనిపై తెలంగాణ సర్కార్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. టికెట్ల అమ్మకాల విషయంలో అవకతవకలు, అక్రమాలు జరిగితే ఊరుకునేది లేదన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు ఉంటాయి. వీటి టికెట్లను ఎలా అమ్ముతారో అని ఇప్పటికే కొందరు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వర్గపోరుతో హెచ్‌సీఏలో కుమ్ములాటలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త కమిటీ పరిస్థితిని చక్కదిద్దుతుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : RCB మహిళా క్రికెట్ జట్టు మెంటార్‌గా సానియా మీర్జా..

Advertisement

Next Story

Most Viewed