ఆ జట్లు స్లెడ్జింగ్‌కు భయపడవు

by Shyam |   ( Updated:2020-11-19 07:28:49.0  )
ఆ జట్లు స్లెడ్జింగ్‌కు భయపడవు
X

దిశ, స్పోర్ట్స్ : ఆటంటే ఆటలాగే ఆడాలి. గెలుపంటే గెలుపులాగే ఉండాలి. గెలవడానికి ఎన్ని ఎత్తులైనా వేయాలి ఎన్ని వ్యూహాలైనా రచించాలి. అవును ఆటను గెలవాలంటే ఏమైనా చేయాలి. ఇలా పుట్టుకొని వచ్చిందే స్లెడ్జింగ్. ఏదైనా క్రీడలో ఎదుటి క్రీడాకారుడి ఏకాగ్రతను భగం చేయడానికి మాట్లాడే మాటలనే స్లెడ్జింగ్ అంటారు. క్రికెట్‌లో కూడా స్లెడ్జింగ్ ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్నది.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌లో పేరు మోసారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో తమ ఆధిపత్యం తగ్గిపోతున్నదనే సమయంలో మాటలతో ఎదుటి జట్టును భయభ్రాంతులకు గురి చేస్తారు. టీమ్ ఇండియా గతంతో ఇలా స్లెడ్జింగ్ బారిన పడి వికెట్లు పారేసుకోవడం.. మ్యాచ్‌లు కోల్పోవడం జరిగింది. కానీ ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం బ్యాటుతోనే కాదు తన నోటితో కూడా ఎదుటి జట్టును భయపెడుతున్నాడు. గంగూలీ నుంచి కోహ్లీ వరకు ఆటలోనే కాదు స్లెడ్జింగ్‌లో కూడా మేమే ముందుంటాం అని చెబుతున్నారు.

ఇండియా – ఆసీస్ మధ్య జరిగిన స్లెడ్జింగ్ సంఘటనలు..

ఆస్ట్రేలియా జట్టులో బ్యాటుతోనే కాకుండా మాటలతో భయపెట్టే వ్యక్తి డేవిడ్ వార్నర్. ఐపీఎల్‌లో అతను అందరికీ ప్రియమైన బ్యాట్స్‌మాన్. కానీ ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్ మొదలైతే మాత్రం ఇతడే ప్రత్యర్థి. 2014లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన సమయంలో వరుణ్ ఆరోన్‌ను వార్నర్ స్లెడ్జ్ చేశాడు. అప్పటికి వరుణ్ టీమ్ ఇండియాలో కొత్తగా చేరిన సభ్యుడు.. దీంతో వార్నర్ అతడిని స్లెడ్జ్ చేయడం మొదలు పెట్టాడు. యువ క్రికెటర్‌ను వార్నర్ స్లెడ్జ్ చేస్తుండటంతో శిఖర్ ధావన్ వెళ్లి మధ్యలో కల్పించుకున్నాడు. వారిద్దరి మధ్య గొడవను ధావన్ విడదీశాడు. అయితే ఆ టెస్టులో వార్నర్ సెంచరీ కొట్టడం గమనార్హం.

2014లోనే అడిలైడ్ టెస్టులో వరుణ్ ఆరోన్ గొడవ తర్వాత.. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ సమయంలో రోహిత్ శర్మతో కోహ్లీ బౌలింగ్ వేయించాడు. అప్పుడు ఒక బంతికి ఎల్బీకి అప్పీల్ చేశారు. ఆ సమయంలో కావాలనే స్మిత్‌ను కోహ్లీ సేన భయభ్రాంతులకు గురి చేసింది. ఎందుకంటే అంతకు ముందు వరుణ్ ఆరోన్‌ని స్లెడ్జింగ్ చేసినందుకే ఇలా చేశామని ఆ తర్వాత కోహ్లీ చెప్పాడు.

ఢిల్లీలోకి ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన ఒక టెస్టులో గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా బ్రెట్‌లీ, షేన్ వాట్సన్ అతడిని పదే పదే స్లెడ్జింగ్ చేశారు. వాళ్లు వేసే బంతులను గంభీర్ డిఫెండ్ చేస్తుంటే.. ఆసీస్ జట్టు మాత్రం తిట్ల దండకం మొదలు పెట్టింది. అయితే వారికి గంభీర్ మాత్రం బ్యాటుతోనే బదులు చెప్పాడు. ఆ టెస్టులో గంభీర్ అర్దసెంచరీ బాదాడు. స్లెడ్జింగ్‌కి కూడా గంభీర్ భయపడకపోవడంతో అతను పరుగులు తీస్తుంటే పదేపదే అడ్డుతగిలారు.

2014లో అడిలైడ్ టెస్టులో వివాదాల తర్వాత ఎంసీజీలో బాక్సింగ్ డే టెస్టు ఆడారు. కోహ్లీ అప్పటికే రెండు సెంచరీలు బాది కంగారూలను కంగారు పెట్టాడు. దీంతో ఎంసీజీలో కోహ్లీ టార్గెట్‌గా చేసుకున్నారు. మిచెల్ జాన్సన్ బౌలింగ్‌లో కోహ్లీ ఒక బౌండరీ బాదగానే బౌలర్ కోపోద్రిక్తుడయ్యాడు. తర్వాత బంతి డిఫెన్స్ ఆడగానే కావాలనే జాన్సన్ బంతిని కోహ్లీ వైపు విసిరి కొట్టి తూలనాడాడు. దీనికి కోహ్లీ కూడా మాటలతో సమాధానం చెప్పాడు. అప్పటి వరకు ఇండియా ఆటగాళ్లంటే సైలెంట్ అనుకున్న ఆసీస్ జట్టుకు కోహ్లీ రివర్స్ స్లెడ్జింగ్‌తో దిమ్మతిరిగి పోయింది. మాటలతోనే కాకుండా కోహ్లీ ఆ రోజు బ్యాటుతో కూడా సమాధానం చెప్పాడు.

ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య జరిగిన మాటల యుద్దం ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. గత పర్యటనలో వీరిద్దరి మధ్య కొద్ది పాటి ఘర్షనే చోటు చేసుకుంది. టిమ్ పైన్.. కోహ్లీని ఉద్దేశించి మురళి విజయ్‌తో వ్యంగ్యబాణాలు విసిరాడు. అతడు మీ కెప్టెన్ అని తెలుసు కానీ.. నీకు అతనంటే ఇష్టం లేదు కదా అంటై టిమ్ పైన్ అన్నాడు. అంతేకాకుండా రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు దిగిన సమయంలో కూడా ధోని బదులు వచ్చావు కదా.. దాని బదులు మా ఇంట్లో పిల్లలను ఆడించరాదు.. అంటూ మాట్లాడాడు. అయితే దీన్ని పంత్ సీరియస్‌గా తీసుకోలేదు. అంతే కాకుండా సిరీస్ ముగిసిన తర్వాత పైన్ పిల్లలతో పంత్ ఫొటో దిగడం విశేషం.

Advertisement

Next Story