నర్స్ ట్రైనింగ్ చేశారా? మీకోసం హై సాలరీ జాబ్స్!

by sudharani |   ( Updated:2020-06-26 07:26:11.0  )
నర్స్ ట్రైనింగ్ చేశారా? మీకోసం హై సాలరీ జాబ్స్!
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో నర్సులకు మళ్ళీ తీవ్ర కొరత ఏర్పడింది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కొరత ఏర్పడగా, తాజాగా ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ సమస్య ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళయినా కేవలం ఆరు నర్సు పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. నర్సింగ్ కళాశాలలకు కొత్తగా అనుమతులు రాలేదు. కరోనా పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. అటు ప్రభుత్వాసుపత్రుల్లో ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లో అవసరానికి తగినంత సంఖ్యలో నర్సులు లేరు. దీంతో ఒక్కో నర్సుకు రెండు లక్షల రూపాయల అడ్వాన్సు ఇచ్చి మరీ నెలకు రూ. 45 వేల జీతానికి నలుగురిని చేర్చుకుంది ఓ ప్రైవేటు ఆసుపత్రి.

వందల సంఖ్యలో నర్సులు వచ్చినా తీసుకోడానికి పదుల సంఖ్యలో ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. కానీ కరోనా ఇన్‌ఫెక్షన్ భయానికి డ్యూటీలో చేరడానికి వెనుకంజ వేస్తున్నారు. ఉపాధికి భారీ స్థాయిలో డిమాండ్ ఉన్నా, వేతనాలు రెండు మూడు రెట్లు పెరిగినా చేరడానికి నర్సులు ఆసక్తి చూపడంలేదు. కారణం కరోనా బారిన పడితే ఆదుకుంటామంటూ ఆసుపత్రుల యాజమాన్యాలు వారికి ఎలాంటి భరోసా కల్పించకపోవడమే. దీనికి తోడు కరోనా పరిస్థితి సద్దుమణిగిన తర్వాత ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని గందరగోళం. ఒకవేళ కరోనా బారిన పడితే ఐసొలేషన్‌లోకి వెళ్ళినా, ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులుగా క్వారంటైన్‌లోకి వెళ్ళినా జీతానికి కోత పెట్టబోమని హామీ లభించకపోవడం కూడా మరో కారణం.

నగరంలోని నాలుగైదు ప్రముఖ కార్పొరేటు ఆసుపత్రులు ఒక్కో స్టాఫ్ నర్సుకు గరిష్టంగా యాభై వేల రూపాయలు జీతం ఇచ్చి మరీ చేర్చుకోడానికి సిద్ధమవుతున్నాయి. కరోనా పాజిటివ్ పేషెంట్లతో ఆ వార్డుల్లో బెడ్‌లన్నీ నిండిపోతున్నాయి. మామూలు వార్డుల్లోని నర్సులను కరోనా వార్డులకు షిప్టు చేస్తున్నారు. అయినా సరిపోవడంలేదు. గతంలో ఇరవై వేలు కూడా జీతం ఇవ్వడానికి సిద్ధపడిన ఆసుపత్రులు ఇప్పుడు రెండు రెట్లకంటే ఎక్కువ ఇవ్వడానికి ఆఫర్లు ఇస్తున్నాయి. కానీ ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న చాలా మంది నర్సులు కరోనా వైరస్ తదనంతర పరిస్థితుల్లో సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. కళ్ళ ముందే తోటి నర్సులు కరోనా బారిన పడిన తర్వాత అనుభవించిన బాధలు వారి కళ్ళ ముందు కదలాడుతున్నాయి.

వైరస్‌కు భయపడకపోయినా యాజమాన్యం నుంచి ఎలాంటి భరోసా లభించకపోవడం వారిని కృంగదీసింది. వైరస్ వచ్చిన కొత్తలో ప్రాణాలకు రిస్కు ఉందని తెలిసినా తక్కువ జీతానికి కూడా పనిచేయడానికి నర్సులు సిద్ధపడ్డారు. కానీ ఆ తర్వాత యాజమాన్యం పట్టించుకోవడంలేదని స్వీయానుభవంతో తెలుసుకుని ‘బతికుంటే బలుసాకు’ తరహాలో కూలీ పని చేయడానికైనా వెనకాడకుండా సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. ఫలితంగా నర్సులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇప్పుడు భారీ డిమాండ్ వచ్చింది.

స్వంతంగా నర్సింగ్ స్కూళ్ళను నడుపుతున్న కార్పొరేట్ ఆసుపత్రులకు కూడా బాధలు తప్పలేదు. ఒక ప్రముఖ ఆసుపత్రి దుబాయ్‌లోని బ్రాంచ్‌కు వంద మందికిపైగా నర్సుల్ని నెలకు ఒకటిన్నర లక్ష రూపాయల జీతంతో పంపింది. ఇంకో వంద మందిని కూడా ఒమన్‌కు పంపడానికి సిద్ధమవుతోంది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో తగినంత సంఖ్యలో క్వాలిఫైడ్ నర్సులు దొరకక ఇంకా ప్రయత్నాలు చేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సకు అనుమతి ఇవ్వడంతో వందలాది మంది కరోనా బాధితులు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. కానీ ఆ స్థాయిలో నర్సులు లేకపోవడంతో కొరత ఏర్పడింది. దుబాయ్ నుంచి తిరిగి తెప్పించుకోలేక ఇక్కడ కొరతను భర్తీ చేసుకోలేక ఇబ్బంది పడుతోంది.

నగరంలోని సుమారు పది కార్పొరేట్ ఆసుపత్రులు ‘ఇమ్మీడియెట్ డిపర్చర్’, ‘అర్జెంట్ రిక్వైర్‌మెంట్’, ‘అర్జెంట్ రిక్వైర్డ్’, ‘ఇమ్మీడియెట్ ప్లేస్‌మెంట్’, ‘లుకింగ్ ఫర్ స్టాఫ్ నర్సెస్’, ‘ఆఫరింగ్ ఓపెనింగ్స్’, ‘నీడ్ స్టాఫ్ నర్సెస్’.. ఇలా ఐసీయూ, ఏఐసీయూ, ఎంఐసీయూ, పీఐసీయూ, ఎన్ఐసీయూ లాంటి అవసరాలకు నర్సులు కావాలంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. అయినా ఆశించిన స్పందన రావడంలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 లక్షల బీమా కేవలం ప్రభుత్వ నర్సులకు మాత్రమే పరిమితం కావడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరడానికి వెనకడుగు వేస్తున్నారు. ఒక ఆసుపత్రిలో ఏకంగా ముప్పై మంది నర్సులకు కరోనా పాజిటివ్ రావడం, ఆ తర్వాత వారికి యాజమాన్యం నుంచి పెద్దగా సపోర్టు లభించకపోవడం ఇతర ఆసుపత్రులపై కూడా ప్రభావం చూపింది.

ప్రభుత్వ ఆసుపత్రులు సైతం నర్సుల్ని చేర్చుకోడానికి నోటిఫికేషన్లు జారీ చేశాయిగానీ స్పందన పెద్దగా లేదు. కారణం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేస్తుండడమే. పైగా ఆ తర్వాత రెగ్యులర్ అవుతుందన్న నమ్మకం లేదు. ఇప్పటికే 3,177 పోస్టులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినా కాంట్రాక్టు నర్సులకు వెయిటేజీ ఇవ్వడఃతో రెగ్యులర్ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు కోర్టుకు వెళ్ళి అది పెండింగ్‌లో పడిపోయింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితి వస్తుందని కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో చేరడానికి ఆసక్తి చూపడంలేదు.

Advertisement

Next Story

Most Viewed