ఇకపై నో పాలిటిక్స్.. కశ్మీర్ లీడర్ షా ఫైజల్

by Shamantha N |
ఇకపై నో పాలిటిక్స్.. కశ్మీర్ లీడర్ షా ఫైజల్
X

శ్రీనగర్: కశ్మీర్ యువనేత షా ఫైజల్ రాజకీయాల నుంచి వైదొలిగారు. ఐఏఎస్ ఉద్యోగాన్ని వదులుకుని స్థాపించిన జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్(జేకేపీఎం) రాజకీయ పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజకీయ కార్యకలాపాలను కొనసాగించాలనుకోవట్లేదని, సంస్థ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఫైజల్ తెలిపారని జేకేపీఎం ఓ ప్రకటనలో వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించే షా ఫైజల్‌ను గతేడాది 370 అధికారణం నిర్వీర్యం సమయంలో పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద నిర్బంధంలోకి తీసుకున్నారు. గత నెలలోనే ఫైజల్ విడుదలయ్యారు. ట్విట్టర్ టైమ్‌లైన్ డిలీట్ చేసి బయోనూ మార్చుకున్న ఫైజల్ మళ్లీ ఉద్యోగంలోకి చేరనున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఫైజల్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని తెలిసింది.

2018లో ఓ అత్యాచారంపై షా ఫైజల్ ట్వీట్లకుగాను అతనిపై క్రమశిక్షణ చర్యలు మొదలుపెట్టిన కారణంగా రాజీనామా ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయిందని సమాచారం. 2010లో సివిల్స్ టాపర్‌గా నిలిచిన షా ఫైజల్ ఎంతో మంది కశ్మీరీ యువకులకు ప్రేరణగా నిలిచారు. ఈ ఏడాది సివిల్స్ ఫలితాల్లో కశ్మీర్ నుంచి 16 మంది అభ్యర్థులు ఉత్తీర్ణలవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed