చివరికి.. రుణాలెవరికి?

by Shyam |
చివరికి.. రుణాలెవరికి?
X

దిశ, మహబూబ్‌నగర్: పాత లెక్కలే ఇంకా పూర్తి కాలేదు.. ఇప్పుడు ఉన్నదాంట్లో కొత్త లొల్లి ప్రారంభమైంది. దీంతో అక్కడ నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇగ అది చివరికి ఎవరికి దక్కుతుందో అర్థమవడంలేదు. అదేంటోనన్నది ఇప్పుడు చూద్దాం…

బలహీనవర్గాల(ఎస్సీలు) బలోపేతానికి చేస్తున్న ప్రయత్నాల్లో చిత్తశుద్ధి లోపిస్తున్నదని చెప్పడంలో ఏ మాత్రం సందేహంలేదు. ప్రభుత్వం విధిస్తున్న కొత్త కొత్త ఆంక్షలు, అధికారుల అలసత్వం, బ్యాంకర్ల కొర్రీలు, సమన్వయలోపం, పురోగతి‌పై సమీక్షలు లేకపోవడం వెరసి బలహీనవర్గాలకు శాపంగా మారిందని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బలహీనవర్గాలకు ప్రభుత్వం ఈ ఏడాది కేటాయించిన లక్ష్యం పక్కకు పెడితే గతేడాది కేటాయించిన టార్గెట్ కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన నూతన విధానాలు మరింత శాపంగా మారడంతోపాటు అధికారుల చేతుల్ని కట్టిపడేశాయి. ముఖ్యంగా బ్యాంకర్లకు రుణాల మంజూరులో అధికారాలు కట్టబెట్టడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంతవరకు ఆశించిన ఫలితాలు దక్కకపోగా ఉన్న 17 మండలాల్లో 14 మండలాల నుంచి ప్రతిపాదనలు రాకపోవడం గమనార్హం.

నిధుల కేటాయింపు ఇలా…

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మొత్తం 443.33 లక్షల నిధులను ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లాలోని 17 మండలాలకు కేటాయించింది. ప్రస్తుత జిల్లాలో 1,25,730 మంది ఎస్సీలు ఉన్నట్టు ప్రభుత్వ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీని ప్రకారం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ.221.67 లక్షలను స్కిల్డ్ కేటగిరీ, రూ.221.67లక్షలను అన్‌స్కిల్డ్ కేటగిరీ కింద ప్రభుత్వం విభజించింది. గతంలో మాదిరిగా యూనిట్లవారీగా కాకుండా ప్రతి మండలానికీ విడివిడిగా నిధులను విభజించారు. దీంతో అన్ని మండలాలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావించింది. కానీ, అలా జరగలేదు.

ఎంపిక విధానం ఇలా..

అన్‌స్కిల్డ్ కేటగిరీకి చెందిన పూర్తి మొత్తానికిగాను లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం అక్కడి అధికారులకే అప్పగించింది. అందువల్ల ఆయా మండలాలకు కేటాయించిన నిధుల్లో అక్కడి మండల పరిషత్ అధికారి లేదా మున్సిపల్ కమిషనర్లు ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఆ తర్వాత బ్యాంకర్లకు, అక్కడి నుంచి ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపాలి. వాటిని అధికారులు ధృవీకరించి సబ్సిడీ ఇస్తారు. అన్‌స్కిల్డ్ కేటగిరీ కింద ఎంపిక చేసే లబ్ధిదారులకు ఎలాంటి అనుభవం, విద్యాభ్యాస ధృవీకరణ పత్రాలు అవసరం లేదు. స్కిల్డ్ కేటగిరి కింద మాత్రం మండలస్థాయి అధికారులు ప్రతిపాదనలు పంపితే వాటిని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ఇంటర్వ్యూలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. స్కిల్డ్ కేటగిరీ కింద ఎంపిక చేసే లబ్ధిదారులకు మాత్రం ఖచ్చితంగా అనుభవం, విధ్యాభ్యాసం ఉండేవిధంగా నిబంధనలు ప్రభుత్వం విధించింది.

అన్‌స్కిల్డ్‌లో అసలేం జరుగుతుందంటే..

‘తానొకటి తలిస్తే.. దైవమొకటి తలిచిన’ చందంగా ఉంది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించి మండల స్థాయి అధికారులకు బాధ్యతలను అప్పగించడంతో కార్పొరేషన్‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. అన్‌స్కిల్డ్ కింద మొత్తం 17 మండలాల నుంచి 2,327 మంది రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా జడ్చర్ల నుంచి 303 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ అర్బన్ ప్రాంతం నుంచి 264 మంది, అత్యల్పంగా బాదేపల్లి అర్బన్ నుంచి 21 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంతవరకు కేవలం 14 మంది లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం. వీటికి సంబంధించి మొత్తం రూ.18.27 లక్షల అంచనాలు కాగా అందులో కార్పొరేషన్ సబ్సిడీ రూ.13.69 లక్షలుగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలు మాత్రమే జిల్లా కార్పొరేషన్ కార్యాలయానికి రాగా వాటిని ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే మంజూరు చేశారు. ప్రభుత్వం ఆయా మండలాలకు కేటాయించిన నిధులను పరిశీలీస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం నిర్దేశించిన రూ.221.67 లక్షలకు మండల అధికారులు పూర్తి చేసింది కేవలం రూ.13.69 లక్షలు కావడం గమనార్హం. పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 17 మండలాల్లో ఇంకా 14 మండలాల నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాకపోవడం కూడా గమనార్హమే.

స్కిల్డ్ పరిస్థితి ఏంటీ?

అన్‌స్కిల్డ్ పరిస్థితి అలా ఉంటే స్కిల్డ్ పరిస్థితి మరోలా ఉంది. స్కిల్డ్ లబ్ధిదారుల ఎంపిక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ చేస్తుంది. 17 మండలాలకు 1592 దరఖాస్తులు రాగా ఇందులో 563 మందికి అధికారులు ఇంటర్వ్యూలు పూర్తి చేసి 117 యూనిట్లను జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు. అనుకున్న సమయానికి వారికి కేటాయించిన రూ.221.67 లక్షలకుగాను రూ.274.10 లక్షల అంచనాలతో రూ.178.28 లక్షల కార్పొరేషన్ సబ్సిడీతో అంచనాలను తయారు చేసి రాష్ర్ట ఉన్నతాధికారులకు నిధుల విడుదల కోసం ప్రతిపాదనలు పంపారు. 390 మంది డెయిరీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొందరికి రుణాలు మంజూరయ్యాయి. అధికారులు ఇంకొందరికి రుణాలు మంజూరు చేసేందుకు పరిశీలనకురాగా వారికి గేదెలు ఎక్కడా కనబడకపోవడంతో రుణాలు నిలిపేశారు.

ఆ బిజినెస్ గందరగోళం..

కొత్తగా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం ఉన్న పథకంతో పాటుగా ‘పెట్టీ బిజినెస్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు వందశాతం సబ్సిడీ కింద రూ.50 వేల వరకు రుణాలను కార్పొరేషన్ అందిస్తుంది. ఈ పథకం కింద మహబూబ్ నగర్ కొత్త జిల్లాకు 349 లబ్ధిదారులను టార్గెట్‌గా నిర్దేశించి దాని కోసం రూ.174.50 లక్షలను కేటాయించారు. ఈ పథకానికి జిల్లాలోని 17 మండలాల నుంచి 105 మంది లబ్ధిదారులు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 60 దరఖాస్తులను కార్పొరేషన్‌కు పంపగా 49 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.24.50 లక్షలను మంజూరు చేశారు. మిగతా రూ.150 లక్షల పరిస్థితిపై గందరగోళం నెలకొంది. స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఈ రెండు కేటగిరీల్లోనూ మహిళా సాధికారతకు 33.33 శాతం, అంగవైకల్యం ఉన్న వారికి 5 శాతం కేటాయింపులు ఉన్నాయి. దీనిపై చాలామందికి అవగాహన లేదు. అవగాహన కల్పించేందుకు అధికారులు చొరవ చూపలేదు. దీంతో దరఖాస్తులు రాలేదన్న ఆరోపణలున్నాయి.

గ్రౌండింగ్.. పెండింగ్..

గడిచిన 2017 – 18 ఆర్థిక సంవత్సరం పరిస్థితి గమనిస్తే జిల్లాకు మొత్తం 638 యూనిట్లను కేటాయించగా ఇందుకుగాను 1566.95 లక్షల అంచనాలు వచ్చాయి. వాటికి కార్పొరేషన్ సబ్సిడీ కింద రూ.1006.91 అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మిగతా రూ.560.04 బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. దీనికిగాను 603 యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేసిన జిల్లా అధికారులతోపాటు, హైదరాబాద్ నుంచి నేరుగా 8 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దానికి రూ.1433.65 లక్షల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించి, రూ.926.65 అంచనాలు కార్పొరేషన్ నుంచి, మరో రూ.506.00 బ్యాంకు రుణాలు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. కానీ, గ్రౌండింగ్ మాత్రం అంచనాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. మొత్తం 611 యూనిట్లకు ఇప్పటివరకు కేవలం 285 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ అవ్వగా.. దానికిగాను రూ.451.99 లక్షలను మంజూరు చేశారు. ఇంకా 317 యూనిట్లను అధికారులు గ్రౌండింగ్ చేయకపోవడం గమనార్హం. రెండు ఆర్థిక సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకూ నిధుల కేటాయింపు లేకపోవడంతో ఈ యూనిట్ల అమలు‌పై నీలినీడలు కమ్ముకున్నాయని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల అలసత్వం!

సాధారణంగా ఈ రుణాల కోసం లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్న తర్వాత మండల అధికారి ఎంపీడీవో, ఈవోఆర్డీలు కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. తర్వాత వాటిని ఈవోఆర్డీ బ్యాంకర్లకు పంపి వారిని సంప్రదించి వాటిని కార్పొరేషన్ కార్యాలయానికి పంపాలి. అయితే, మండల అధికారులు బ్యాంకర్ల మధ్య సమన్వయలోపం ఉంటోందనీ, అది రుణాల మంజూరు కాకుండా చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. మండలస్థాయి అధికారులు లబ్ధిదారుల ఎంపిక పట్ల చేస్తున్న నిర్లక్ష్యాన్ని జిల్లా కార్పొరేషన్ ఈడీ స్వయంగా జిల్లా పరిషత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు. చివరకు మండలస్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే ఈ విషయంలో చర్చించేందుకు వీలుంటుందని ఈడీ జిల్లా పరిషత్ సీఈవోకు లేఖ రాశారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ విషయమై మండలస్థాయి అధికారులను సంప్రదిస్తే తమకు ఈ పనులు చేసేందుకు సమయం లేదని, ఒకదాని వెనుక మరో ఎన్నికలు రావడంతోపాటు ప్రభుత్వం పల్లె ప్రగతితోపాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ పనులకు సమయం కేటాయించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నట్టు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్, మండల అధికారుల మధ్య కూడా సమన్వయ లోపం ఉందని తెలుస్తోంది.

పంటరుణాల పేరుతో బ్యాంకర్ల కొర్రీ..

కొంతమంది లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట రుణాలు కార్పొరేషన్ రుణాలకు అడ్డంకిగా మారాయి. వ్యవసాయ నిమిత్తం తీసుకున్న పంట రుణాలు సమయానికి చెల్లించకపోవడం, పైగా పంట రుణమాఫీ కూడా కాకపోవడంతో బ్యాంకర్లు ఈ రుణాలిచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు.

కొత్త విధానంతో పక్కదారి..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎంపిక విధానం వల్ల రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకుల జోక్యం కూడా పెరిగిపోయిందని అధికారులు అంటున్నారు. గతంలో యూనిట్ల వారీగా ఉండటం వల్ల ఎమ్మెల్యేలు, మండల ప్రజాప్రతినిధులు తాము ప్రతిపాదించిన వారికి కొన్ని యూనిట్లు కేటాయించాలని సూచించేవారు. దీనివల్ల కొన్ని యూనిట్లు పోయిన మిగతావి సామాన్యులకు దక్కేవి. కానీ, ప్రస్తుతం విధానంలో యూనిట్లవారీగా కాకుండా నిధులవారీగా కేటాయింపులుంటాయి. దీంతో పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక మండలానికి రూ.10 లక్షల నిధులను కేటాయిస్తే ఒకే యూనిట్ రూ.10 లక్షల విలువ చేసే విధంగా లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి రాజకీయ జోక్యం తోడైతే మొత్తం నిధులు ఒకే యూనిట్ కింద మంజూరై పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జిల్లా కేంద్రం పరిస్థితి మరీ దారుణం..

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భాగమైన మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిత్యం జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉండే ఈ ప్రాంతంలో లబ్ధిదారుల ఎంపికకు ఇంతవరకూ మున్సిపల్ కమిషనర్ ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 45 యూనిట్లను ప్రభుత్వం టార్గెట్ ఇవ్వగా అందుకోసం 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఇంతవరకు ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. మొత్తం మీద అధికారుల అలసత్వం, క్ష్రేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల మధ్య సమన్వయలోపం, బ్యాంకర్ల మొండివైఖరి, లబ్ధిదారుల అవగాహనా రాహిత్యం ఇలా కారణాలు ఏవైనా ప్రభుత్వ లక్ష్యం నీరుగారడంతో పాటు లబ్ధిదారులకు శాపంగా మారింది వ్యవస్థ తీరు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇంకా మిగిలిన 20 రోజుల్లో అధికారులు ఎంత ఆగమేఘాల మీద పనులు చేసినా కూడా లబ్ధిదారుల ఎంపిక కష్టసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్పొరేషన్ నిధులు మురిగి పోవాల్సిందేనా? ఏమో వేచిచూడాలి.

Tags: sc corporation, funds, mahababoobnagar dist

Advertisement

Next Story