ఏపీ కరోనా కిట్స్ కొనుగోళ్లలో భారీ స్కాం..

by srinivas |   ( Updated:2020-04-19 08:24:18.0  )
ఏపీ కరోనా కిట్స్ కొనుగోళ్లలో భారీ స్కాం..
X

దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) లక్షణాలు లేనివారికి ప్రాథమికంగా చేసే పరీక్ష ఒక్కటే. ‘రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్’ (యాంటీ బాడీ) అనే టెస్ట్. ఈ విధానానికి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి) ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్రాలే ఈ కిట్లను స్వంతంగా
సమకూర్చుకుంటున్నాయి. టెస్టింగ్ కిట్ ఒకటే అయినా ధరలు మాత్రం వేర్వేరు. కంపెనీలు కూడా వేర్వేరు. ఏది తక్కువకు దొరికితే దాన్ని కొందామనుకునే రాష్ట్రాలు కొన్నయితే, ఏది ఎక్కువ ధర ఉంటే దానివైపు మొగ్గచూపేవి కొన్ని. ఈ రెండో కోవలోకి వచ్చేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రస్తుత
మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో టెండర్లకు బదులుగా నామినేషన్ పద్ధతిలో కంపెనీలకు ఆర్డర్లను కట్టబెట్టేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటుందా? అందుకే ధర ఎక్కువైనా ఫర్వాలేదనుకుందేమో కాని నచ్చిన కంపెనీకి ఆర్డర్ ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్షిణ కొరియా
నుంచి సండూర్ మెడిక్ ఎయిడ్స్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా రాపిడ్ టెస్ట్ కిట్లు చేరాయి.

2 లక్షల కిట్లు ఆర్డర్ చేసిన ఏపీ..

చత్తీస్‌గఢ్ ప్రభుత్వం దక్షిణ కొరియా దేశానికి చెందిన కంపెనీ నుంచి ఒక్కో రాపిడ్ టెస్టింగ్ కిట్‌ను రూ.337కు కొంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ. 730 ధరకు రెండు లక్షల కిట్లను సప్లయ్ చేయాల్సిందిగా ఆర్డర్ (పర్చేజ్ ఆర్డర్ నెం. 15/435) ఈ నెల 7వ తేదీన ఇచ్చింది. అయితే, ఆ కిట్లు వయా సండూర్ మెడిక్ ఎయిడ్స్ అనే సంస్థ ద్వారా సమకూరనున్నాయి. తయారుచేసేది దక్షిణ కొరియా కంపెనీయే అయినా వస్తోంది సండూర్ కంపెనీ ద్వారా కాబట్టి రేటు రూ. 730కు చేరుకుంది. చత్తీస్‌గఢ్ కంపెనీ ఎలాగూ రూ.337కు కొంటోంది కాబట్టి అదే ధరకు సండూర్ కంపెనీకి కూడా అందుతుంది.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని సండూర్ సమర్థవంతంగా వినియోగించుకుంది. ఒక్కో కిట్‌కు రూ. 730 ధరను కోట్ చేసింది. ఏపీఎంఐడీసీ సైతం ఓకే చెప్పేసింది. ఇంకేముంది? ఒక్కో కిట్‌పై రూ. 393 చొప్పున రెండు లక్షల కిట్లకు
దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల లాభం నొక్కేసింది సండూర్.

ఎవరిదీ సండూర్ కంపెనీ?

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ఈ కంపెనీ హెడ్ క్వార్టర్ ఒక మార్కెటింగ్ సంస్థ మాత్రమే. ఈ కిట్లను తయారుచేసే యూనిట్ లేదు. కేవలం మరో ఉత్పత్తి సంస్థ నుంచి కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. ఈ కిట్‌లు మాత్రమే కాక వైద్య అవసరాలకు వినియోగించే అనేక ఉపకరణాలను కూడా సప్లయ్ చేస్తుంది. ఈ అడ్రస్ నుంచి ఇదొక్క కంపెనీయే కాదు… దాదాపు పది కంపెనీలు పనిచేస్తున్నాయి. రాజీవ్ సింధి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఈ కంపెనీలో కసిరాళ్ల వెంకట మురళీధర్ రెడ్డి, సివివిఎస్ ఆంజనేయ డైరెక్టర్లుగా ఉన్నారు. చత్తీస్‌‌గఢ్ ప్రభుత్వం ఇదే కిట్లను రూ. 337కు కొంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ధరకు ఎందుకు కొనిందని అనేక విమర్శలు వచ్చాయి. నిజంగా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం తక్కువ ధరకు కొన్నట్లయితే తాము కూడా అదే ధరకు కొంటామని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ, అది అక్కడితోనే ఆగిపోయింది.

తొలుత పరీక్ష చేయించుకున్న సీఎం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు లక్షల కిట్లకు ఆర్డర్ ఇవ్వడం, ప్రత్యేక విమానంలో అవి ఢిల్లీ మీదుగా అమరావతి చేరుకోవడం జరిగిపోయింది. ఆ కిట్ ద్వారా తొలుత సీఎం జగన్ పరీక్ష కూడా చేయించుకున్నారు. ఆయన నివాసానికి సమీపంలో ఉన్న కాలనీలో ఒక వ్యక్తికి కరోనా(కొవిడ్ 19) పాజిటివ్
వచ్చినందున జగన్ కూడా పరీక్ష చేయించుకున్నారనీ, అయితే అందులో నెగెటివ్ వచ్చిందని పరీక్ష నిర్వహించిన డాక్టర్ రాంబాబు వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియా కంపెనీ నుంచి సమకూరిన ఈ కిట్లు ‘స్టాబ్‌డర్డ్ క్యూ’ బ్రాండ్‌తో దిగుమతి అయ్యాయి.

ఒక్క ఆర్డర్‌పై ఎనిమిది కోట్ల ప్రజాధనం వృథా..

చత్తీస్‌గఢ్ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి 75 వేల కిట్లను రూ. 337 చొప్పున కొనుగోలు చేస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం రూ. 730 చొప్పున రెండు లక్షల కిట్లను కొనుగోలు చేసింది. ఆ రకంగా సుమారు ఎనిమిది కోట్ల రూపాయల మేర ప్రజాధనం వృథా అయింది. నిజానికి ఈ టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్ష చేసినా
పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లయితే మళ్లీ ఇప్పుడు వైరాలజీ ల్యాబ్‌లు చేస్తున్నట్లుగా ఆర్‌టిపీసీఆర్ విధానంలో మళ్లీ పరీక్ష చేయాల్సిందే. అసలే లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయిన పరిస్థితుల్లో ఆచితూచి ఆలోచించి ఖర్చు పెట్టాల్సిన ఏపీ ప్రభుత్వం అత్యవసరం పేరుతో ఎక్కువ ధరకు
కొనుగోలు చేసింది. ఇది దీనికి మాత్రమే పరిమితమా లేక పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, ఇతర అవసరాలకు ఏ స్థాయిలో ప్రజాధనం దుర్వినియోగమైంది, ఎంత ఎక్కువ ధరకు కోనుగోలుచేసిందన్న వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

50 వేల కిట్లు సమకూర్చుకున్న తమిళనాడు..

పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం చైనాకు చెందిన ‘వండ్‌ఫు’ కంపెనీ నుంచి ఒక్కో యూనిట్‌కు రూ. 600 చొప్పున మొత్తం 50 వేల కిట్లను
సమకూర్చుకుంది. అన్ని రాష్ట్రాలకు ఆయా కంపెనీలు సమకూర్చిన ధరలకు జీఎస్టీ ద్వారా వసూలుచేసే పన్ను అదనం. ఇక తెలంగాణ ప్రభుత్వం
ఇప్పటిదాకా రాపిడ్ టెస్ట్‌ల అవసరం లేదనే వైఖరితోనే ఉంది. ఆ అవసరం వచ్చినప్పుడు ఆలోచిస్తాం అని ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల
రాజేందర్ తెలిపారు. ఒకవేళ అవసరమని భావించినట్లయితే తెలంగాణ ఏ ధరకు కొంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags: Tamil Nadu, Andhra Pradesh, Rapid Test, South Korea, Chhattisgarh, Sandor Medicaids

Advertisement

Next Story

Most Viewed