వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. అందులో 30 మంది ప్రయాణికులు

by Aamani |
వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. అందులో 30 మంది ప్రయాణికులు
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు నిండిపోయాయి. వాగులు పొంగిపొర్లుతుండటంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొందరు వాగు ప్రవహల్లో చిక్కుకుని ఇబ్బందులకు గురయ్యారు. కామారెడ్డి మండలం లింగాయిపల్లి మొండివాగు వద్ద బైకుపై వస్తున్న తండ్రీకొడుకులు వాగు దాటుతుండగా వాగులో బైకు కొట్టుకుపోయింది. పక్కనే ఉన్న చెట్టును పట్టుకుని ఆగిపోయిన తండ్రి కొడుకులను స్థానికులు తాడు సహాయంతో కాపాడారు. రాజంపేట మండలం అన్నారం తండా వాగులో ఓ బైకు కొట్టుకుపోతుండగా తాడుతో బైకును ఒడ్డుకు చేర్చారు. అదే మండలంలోని కొండాపూర్ శివారులోని సంగమేశ్వర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో కామారెడ్డి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుపోయింది. అందులో 30 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు వాగు వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సహాయంతో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Next Story