ఫామ్ హౌస్ లో పడుకోవడానికి రాలేదు: ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్

by Shyam |
ఫామ్ హౌస్ లో పడుకోవడానికి రాలేదు: ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్
X

దిశ,మహబూబాబాద్ టౌన్: పేదల సంక్షేమం పట్టించుకోని ఆధిపత్య పాలకులకు ఎందుకు ఓటేయ్యాలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ లో బుధవారం నిర్వహించిన బహుజన రాజ్యాధికార సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పేద ప్రజలకు అనేక కష్టాలున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో అబద్దపు హామీలుస్తూ ఓటర్లకు డబ్బులు, మద్యం పంచుతూ అధికారంలోకి వస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో మళ్ళీ ప్రజలు మోసపోయి ఆధిపత్య పార్టీలకు ఓట్లేయొద్దని కోరారు.

లక్షల మంది ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ళు కేటాయించకుండా కేవలం అధికారపార్టీ అనునాయులకు, అనర్హులకు మాత్రమే మంజూరు చేశారని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఫామ్ హౌస్ లో పడుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని అన్నారు.

దేశంలో బహుజన వర్గాల నుండి కొల్లగొట్టిన సంపదనను తిరిగి సాధించడానికే తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ శనిగరపు రాజు, జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్, జిల్లా అధ్యక్షులు ఎల్.విజయకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story