మహిళలతో రాజ్యాలు కూలిపోయాయి.. అది మరోసారి నిరూపించాలి: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

by Aamani |
మహిళలతో రాజ్యాలు కూలిపోయాయి.. అది మరోసారి నిరూపించాలి: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, కామారెడ్డి: రాబోయే ఎన్నికల్లో బహుజన రాజ్యం రావాలని.. దానికోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం బిక్కనూర్ మండల కేంద్రంలోని ఎస్వీ గార్డెన్‌లో మహిళల ప్రభంజన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా ప్రవీణ్ సమక్షంలో అధిక సంఖ్యలో మహిళలు బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాలని పిలుపునిచ్చారు.

ఇన్నాళ్లు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు ఇచ్చిన అధికారం చాలన్నారు. ఈసారి బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. ఏనుగు గుర్తుకు ఓటేసి ప్రగతి భవన్‌కు పంపాల్సిన బాధ్యత కుటుంబంలోని ప్రతి మహిళపై ఉందన్నారు. మహిళలు తలుచుకుంటే ఎంతటి రాజ్యాలైన కూలిపోతాయని చరిత్ర చెబుతోందని, దానిని మరోసారి నిజం చేయాలన్నారు. బహుజనుల బతుకులు మారాలంటే, పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే రానున్న 2023 ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ దేవుళ్ల గంగాధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహతి రమేష్, జిల్లా ఇన్‌చార్జీలు గంగారం, సాయిలు, రాజేందర్, జిల్లా అధ్యక్షుడు బట్టెంకి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed