- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమయం ఉంది మిత్రమా..!
దిశ, తెలంగాణ బ్యూరో : రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రభుత్వం వ్యూహాత్మక ప్రచారానికి దిగింది. హైదరాబాద్ చుట్టూ 338 కిలోమీటర్ల పరిధిలో నిర్మించే ట్రిపుల్ ఆర్‌ను మరోసారి గ్రోత్ కారిడార్‌గా చెప్పుతున్నారు. కానీ దీని చేరువలో ఫ్లాట్లు కొనాలని, దీంతో ఏదో ఆద్భుతం జరుగుతుందని, స్థలం కొనేందుకు ఇదే సరైన సమయమని చెప్పితే నమ్మవద్దంటూ రియల్ ఎస్టేట్‌లోని కొన్ని వర్గాలు సలహా ఇస్తున్నాయి. 15 ఏండ్ల కిందట మొదలైన ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ది చెందలేదని, పశ్చిమం తప్ప మిగిలినప్రాంతాలు వెలవెలబోతున్నాయని, ఓఆర్ఆర్కు ఇరువైపులా 316 కిలోమీటర్ల మేరకు కేటాయించిన గ్రోత్ కారిడార్… మరో 20 ఇంటర్ చేంజ్ జంక్షన్లు అభివృద్ధిలోకి వచ్చేందుకు ఇంకో 15 ఏండ్లు పడుతుందని, ఇప్పుడే ట్రిపుల్ ఆర్ చేరువలో ప్లాట్లకు ఎగబడాల్సిన అవసరం లేదంటూ కొన్ని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్పుతున్నాయి.
ప్రభుత్వం కావాలని చేస్తుందా..?
భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు రూ. 3 నుంచి రూ. 4 వేల వరకు ఉన్న ధరలు ఒక్కసారిగా రూ. 20 వేలకు చేరువయ్యాయి. దీంతో ట్రిపుల్ ఆర్ చుట్టూ భూములను కొనుగోలు చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మేందుకు సిద్ధమవుతున్న సర్కారు… ధరల పెంపులో ప్లాన్ ప్రకారం వెళ్తుందనే చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇటీవల పటాన్చెరు సమీపంలోని సుల్తాన్పూర్ శివారులో ప్లాస్టిక్ పరిశ్రమలు వస్తాయని మంత్రి కేటీఆర్ ప్రకటించిన వెంటనే ధరలు పదింతలు పెరిగాయి. కానీ అక్కడ పరిస్థితులు మారలేదు. రంగారెడ్డి జిల్లా బాటసింగారం దగ్గర లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటుతో భూముల ధరలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అభివృద్ధి కనిపించడం లేదు. బుద్వేల్ ఐటీ పార్కు కథ అయితే మరీ ఘోరం. అప్పటివరకూ అక్కడి డెవలపర్లు గజానికి రూ. వేలు ఉండగా… మంత్రి కేటీఆర్ ఐటీ పార్కును ఆరంభించగానే ఒక్కసారిగా రూ. 15 వేల వరకు పెంచారు. దీంతో రియల్ సంస్థలను బతికించడానికే ప్రభుత్వం ఆయా ప్రకటనలు చేసిందా అనే సందేహాలున్నాయి.
ఓఆర్ఆర్ చూస్తున్నాం కదా..?
ఔటర్ రింగ్ రోడ్డు 2005 నుంచి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే గచ్చిబౌలి నుంచి నార్సింగి దాకా సర్వీసు రోడ్డుకు వైపులా కొన్ని హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొల్లూరు దాకా కొత్త కట్టడాలు మొదలయ్యాయి. కొల్లూరులో సర్వీస్ రోడ్డు లేనే లేదు. అక్కడ ఓఆర్ఆర్ నుంచి సర్వీస్ రోడ్డుకు వెళ్లాలంటే, మట్టి రోడ్డు మీద ప్రయాణించాల్సిందే. మొత్తం 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్‌కి అటుఇటుగా కిలోమీటర్ చొప్పున గ్రోత్ కారిడార్ అని ప్రభుత్వం ఆనాడే ప్రకటించింది. ఈ లెక్క ప్రకారం 316 కిలోమీటర్లలో ప్రాజెక్టులు రావాలంటే మరో పదిహేనేళ్లయినా పడుతుందని అధికారులే ఒకదశలో చెప్పారు. ఒక్క పశ్చిమ హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతాలూ అంత ఆశాజనంగా కనిపించడం లేదనేది నిజం. ఆదిభట్ల వద్ద టీసీఎస్, కాగ్నిజెంట్ వల్ల కొంత కదలికలు వచ్చినప్పటికీ, మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొన్నది. హైదరాబాద్ నుంచి సదాశివపేట్ వరకు 75 కిలోమీటర్ల దూరంలో రియల్టర్లు వెంచర్లు చేసి అక్కడేదో అద్భుతం జరుగుతుందన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రియల్టర్లు చెప్పినట్లుగా ప్లాట్ కొంటే ఇప్పుడు అంతంత దూరం వెళ్లి నివాసం ఉండలేరని, ఆ ప్రాంతంలో ఇప్పుడు కొనుగోలు చేస్తే వచ్చే ఐదేండ్లలో రెండింతలు అవుతుందని అంతేకానీ ఊహించినంత మేరకు పెరిగే ఛాన్స్ లేదంటున్నారు.
తొందరపడి కొనాల్సిందేమీ లేదు : కొయ్యడ కింగ్ జాన్సన్, రియల్ ఏస్టేట్ నిపుణుడు
రీజనల్ రింగ్ రోడ్‌తో ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పుతున్నారని, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల మోసపూరిత మాటలకు పడిపోయి.. అంతంత దూరం వెళ్లేసి ఇప్పుడు పెంచిన ధరలకు కొనుగోలు చేస్తే కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా అవుతుంది. ఇబ్బడిముబ్బడిగా డబ్బులుండీ ఒకట్రెండు ప్లాట్లు కొనుగోలు చేయాలనుకుంటే చేసుకోవాలని, పెట్టుబడి కోణంలో మాత్రం ఆలోచించి అక్కడ ఏమాత్రం ప్లాటు కొనకపోవడమే మంచిది. ఉదాహరణగా 2008లో మహేశ్వరం వంటి ప్రాంతంలో గజం ధర రూ.10 వేల వరకూ వెళ్లింది. అలాంటి, మళ్లీ పదేళ్ల దాకా అటువైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. మధ్యలో గజం నాలుగైదు వేలకు అమ్ముదామంటే కొనే నాధుడే లేడు. శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న మన్‌సాన్‌పల్లిలో ఇలాంటి పరిస్థితి ఉంటే, సదాశివపేట్‌లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆర్ఆర్ఆర్ వల్ల ఇప్పుడిప్పుడే ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదనే విషయాన్ని గుర్తించాకే పెట్టుబడి విషయంపై నిర్ణయం తీసుకోవాలి.