పిల్లల వ్యాక్సిన్ కు సర్కార్ సర్వం సిద్ధం.. మార్గదర్శకాలు వచ్చేదెప్పుడు?

by Shyam |   ( Updated:2021-12-26 10:59:55.0  )
పిల్లల వ్యాక్సిన్ కు సర్కార్ సర్వం సిద్ధం.. మార్గదర్శకాలు వచ్చేదెప్పుడు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయస్కులకు టీకాలు ఇచ్చేందుకు సర్కార్​ సర్వం సిద్ధం చేసింది. ఒమిక్రాన్​వ్యాప్తి పెరుగుతున్నందున జనవరి 3 నుంచి ఈ ఏజ్​గ్రూప్​కూ టీకాలు పంపిణీ చేస్తామని రెండ్రోజుల క్రితం పీఎం మోడీ చెప్పినా, స్పష్టమైన గైడ్​లైన్స్ ​రాలేదని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు ఎప్పుడొచ్చినా పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. డోసుల నిల్వ, సెంటర్లు , స్టాఫ్​ను ప్రిపేర్​ చేశామన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు 22,78,683 మందిని గుర్తించారు. వీరికి టీకాలు వేసేందుకు 33,98,840 డోసులను సిద్ధంగా ఉంచారు. వీటిలో ఇప్పటికే 14,62,030 డోసులను జిల్లా వ్యాక్సిన్​ కోల్డ్​ చైన్​ పాయింట్లకు పంపగా, స్టేట్​ సెంట్రల్​ కోల్డ్​ స్టోరేజ్​ సెంటర్​లో 19,36,810 డోసులు ఉన్నట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు.

వ్యాక్సిన్​ వేసుకోబోయే 15 నుంచి 18 ఏళ్ల లోపు వారి ఆరోగ్య పరిస్థితులపై కూడా నివేదిక తయారు చేస్తున్నారు. గతంలో సాధారణ టీకాలు తీసుకున్న సమయంలో రీయాక్షన్లు వచ్చాయా? హెల్త్​ సమస్యలు తేలాయా? అనే అంశాలనూ పేరెంట్ల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే 15 నుంచి 18 లోపు వాళ్లలో మెజార్టీగా కాలేజీలు, స్కూళ్లు, ఇతర సంస్థలకు వెళ్లే వారే కావున ఎక్కడికక్కడ టీకాలు ఇవ్వాలని ఫ్లాన్​ చేస్తున్నారు. ప్రత్యేక క్యాంపుల ద్వారా పంపిణీ చేసేందుకు ఆరోగ్యశాఖ కసరత్తులు చేస్తున్నది.

‘2’ టీకాలకు అనుమతి

చిన్నారుల కొరకు మార్కెట్లో కొవాగ్జిన్, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్లు తయారయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో డీసీజీఐ(డ్రగ్​ కంట్రోల్​ జనరల్​ ఆఫ్​ ఇండియా) అత్యవసర పంపిణీ కొరకు జైడస్​ క్యాడిలాకు అనుమతులు ఇవ్వగా, భారత్​ బయోటెక్​కు చెందిన కొవాగ్జిన్​కు డీసీజీఐ శనివారం పర్మిషన్లు ఇవ్వడం గమనార్హం. ఈ రెండు టీకాలను అత్యవసర వినియోగం కొరకు 12 నుంచి 18 ఏళ్ల మధ్యలోపు వయస్కులు వేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అయితే కొవాగ్జిన్​ను మొదటి డోసు వేసిన 28 రోజుల తర్వాత సెకండ్​ డోసు ఇవ్వాలని ఉత్పత్తి సంస్థల నిబంధన ఉండగా, జైడస్​ను మాత్రం 30 రోజుల కాల వ్యవధి చొప్పున మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుందని ప్రోడక్షన్​ మేకింగ్​ షీట్​లో పొందుపరిచారు. అయితే మన రాష్ట్రంలో ఏ టీకా ఇస్తారనేది అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఐసీఎంఆర్​ ఆదేశాలకు అనుగుణంగా టీకాలు పంపిణీ చేయాల్సి ఉంటుందని వాళ్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీరికి టీకాలు ఇవ్వడం వలన బయట వ్యాప్తిని కొంత వరకు అడ్డుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 15 నుంచి 18 పై బడిన వారు బయట ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతుంటారు. దీంతో వీరి నుంచి ఇళ్లల్లో ఉండే పెద్దలకు, హైరిస్క్​గ్రూప్​ వారికి వైరస్​ వ్యాప్తి చెందుతున్నది. ఈక్రమంలో ఈ కేటగిరీలకు టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

బూస్టర్​ డోసుకూ ఓకే…

జనవరి 10 నుంచి బూస్టర్​ డోసు ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి డోసులు పంపిణీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తేల్చిచెప్పింది. హెల్త్​కేర్​వారియర్స్​, 60 ఏళ్ల దాటిన వాళ్లు, దీర్ఘకాలిక రోగులు బూస్టర్​కు అర్హులని ఓ అధికారి తెలిపారు. వీళ్లందరికీ రెండు డోసులు పూర్తయి దాదాపు 8 నెలలు దాటిందని, దీంతో ముందస్తుగా రక్షణ డోసు వేసుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న రీసెర్చ్​ల ప్రకారం వ్యాక్సిన్​ ద్వారా వచ్చే యాంటీబాడీలు గరిష్ఠంగా 6 నెలలు మాత్రమే ఉంటున్నాయని ఆయన తేల్చేశారు. దీంతో రెండో డోసు పూర్తయి ఆరు నెలలు దాటిన వాళ్లంతా బూస్టర్​ డోసు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు మాత్రం బూస్టర్​కు డాక్టర్​ అభిప్రాయం తప్పనిసరి చేసింది. దీని వలన రీయాక్షన్లు ప్రబలకుండా వీలుంటుందని కేంద్రం పేర్కొన్నది.

వివరాలు ఇలా…
వయస్సు సంఖ్య
15–18లోపు 22,78,683
60+ 41,60,000
హెల్త్​+ప్రంట్ లైన్​వర్కర్లు 6,34,150
బీపీ, షుగర్​ పేషెంట్లు 30 లక్షలు(సుమారు)
ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 11,48,184

Advertisement

Next Story