- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమిండియాలో రాహుల్ ద్రవిడ్ మార్క్.. యంగ్‌స్టర్స్‌కే ప్రియారిటీ!
దిశ, స్పోర్ట్స్: టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ తన వ్యూహాలను అమలు చేస్తున్నాడు. కేవలం రెండు మ్యాచ్‌లే అయినా అతడి పని తీరు ఎలా ఉండబోతున్నదో తెలిసిపోయింది. కేవలం ఒకటి రెండు సిరీస్‌లు టార్గెట్‌గా జట్టును సిద్ధం చేయడం కాకుండా.. దీర్ఘ కాలంలో జట్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నట్లుగానే కనిపిస్తున్నది. ఎంఎస్ ధోని రిటైర్ అయిన తర్వాత టీమ్ ఇండియాలో సరైన మ్యాచ్ ఫినిషర్ కనపడటం లేదు.
దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా వంటి బ్యాటర్లును కొన్ని మ్యాచ్‌ల పాటు పరిశీలించారు. హార్దిక్ పాండ్యా మంచి ఫినిషర్‌గా మారతాడని అందరూ భావించారు. కానీ వెన్నెముక శస్త్ర చికిత్స తర్వాత పాండ్యా ఆట తీరులో పూర్తి మార్పు కనిపించింది. నిలకడగా బ్యాటింగ్ చేయలేకపోవడంతో పాటు బౌలింగ్ కూడా చేయడం లేదు. రిషబ్ పంత్‌ను కూడా మ్యాచ్ ఫినిషర్ రోల్ కోసం రవిశాస్త్రి-కోహ్లీ ద్వయం పరిశీలించింది. అతడు ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడని అనిపించింది. అయితే మూడు ఫార్మాట్లలో తీరిక లేకుండా క్రికెట్ ఆడటంతో అతడిపై కూడా భారం పడుతున్నది. అందుకే ఈ సిరీస్‌లో ఒక మ్యాచ్ ఫినిషర్ కోసం ద్రవిడ్ ప్రయోగం చేశాడు.
హార్దిక్ బదులు వెంకటేశ్ అయ్యర్..
ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌లో వెంకటేశ్ అయ్యర్ చక్కగా రాణించాడు. ఓపెనర్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు నిలకడైన ప్రదర్శన చేయడమే కాకుండా.. బంతితో కూడా మెరిసాడు. ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా తన పాత్రకు సరైన న్యాయం చేయక పోవడంతో జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఇక అతడి స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌కు చోటు దక్కింది. రెండు మ్యాచ్‌ల్లోనూ అతడికి భారీ ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం రాలేదు. కానీ రాహుల్ ద్రవిడ్ అతడిని బ్యాటింగ్‌కు పంపిన సందర్భాన్ని చూస్తే మ్యాచ్ ఫినిషర్‌గా అయ్యర్‌ను చూడాలని అనుకున్నట్లు స్పష్టంగా తెలిసిపోయింది.
రెండో మ్యాచ్‌లో ఓపెనింగ్ జోడీ భారీ భాగస్వామ్యం అందించిన తర్వాత.. ఫస్ట్ డౌన్‌లో వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికి టీమ్ ఇండియా విజయానికి మరో 40+ పరుగుల దూరంలో ఉన్నది. అంటే మ్యాచ్‌ను ముగించేసి వచ్చెయ్యాలి అనేలా అయ్యర్‌కు ప్రమోషన్ ఇచ్చారు. అయ్యర్ కూడా చివరి వరకు క్రీజులోనే ఉన్నాడు. అయితే పెద్దగా ఆడే అవకాశం రాలేదు. గత రెండు మ్యాచ్‌లలో అతడికి బౌలింగ్ చేసే చాన్స్ రాలేదు. కానీ భవిష్యత్‌లో తప్పకుండా అతడి బౌలింగ్‌ను ద్రవిడ్ ఉపయోగించుకునే అవకాశం ఉన్నది.
బౌలింగ్ మార్పులు..
ఇక టీమ్ ఇండియా టెస్టు జట్టు బౌలింగ్ బాగానే ఉంటున్నా.. సీనియర్ బౌలర్లు అయిన షమీ, బుమ్రాలు లేని సమయంలో టీ20 బౌలింగ్‌లో లోపాలు కనిపిస్తున్నాయి. పవర్ ప్లే ముగిసిన తర్వాత మిడిల్ ఓవర్లలో వికెట్ల తీయగలిగే బౌలర్ కోసం గత కొన్నాళ్లుగా అన్వేషణ సాగింది. రెండో టీ20లో హర్షల్ పటేల్‌ను తీసుకోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేయగలిగారు. పటేల్ తన ఐపీఎల్ ఫామ్‌ను ఉపయోగించి ఈ మ్యాచ్‌లో కూడా వికెట్లు తీసుకున్నాడు. ఇక సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో కలసి బౌలింగ్ చేస్తే మరిన్ని వికెట్లు పడగొట్టడం ఖాయమే. ఇక బెంచ్ మీద అవేశ్ ఖాన్ కూడా ఉన్నాడు.
టీ20 ఫార్మాట్‌లో మెరుపులు మెరిపిస్తున్న యువకులను అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని జయించడంలో కూడా ద్రవిడ్ పాఠాలు నేర్పించాల్సి ఉంటుంది. అప్పుడు తప్పకుండా భారత జట్టు బౌలింగ్ విభాగం పటిష్టంగా మారుతుంది. ఇప్పటికే బౌలర్లపై తీవ్రమైన భారం పడుతుందని బీసీసీఐ భావిస్తున్నది. యువ బౌలర్లు కనుక రాణించడం మొదలు పెడితే సరైన జోడీలతో బౌలర్ల రొటేషన్ కూడా చేసే అవకాశం ఉన్నది. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో రొటేషన్ పద్ధతి మొదలు పెడితే ముందుగా బౌలర్లతోనే ప్రారంభించనున్నారు. ఇవన్నీ ద్రవిడ్ వ్యూహాల్లోని భాగమేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా కొత్తగా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ తొలి సిరీస్ నుంచే తన మార్కును ప్రదర్శిస్తున్నాడు.
- Tags
- cricket