కేసీఆర్ తొత్తులకే ‘TSPSC’లో పదవులు..

by Shyam |
Congress leader Dasoju Shravan
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్‌కు తొత్తులుగా పనిచేసే వారికే టీఎస్పీఎస్సీ‌లో పదవులొచ్చాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్స్, చైర్మన్‌ను నియమించడం సంతోషకరమేనని, కానీ.. వారం రోజుల్లో 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు.

బీహార్‌లో తేజస్వి యాదవ్ తన ఇంటిని ఐసోలేట్ సెంటర్‌గా మార్చారని.. ఆ సోయి మనోళ్లకు లేదని ఎద్దేవా చేశారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేరుస్తామన్న సీఎం.. రాత్రికి రాత్రే.. ఆయుష్మాన్ భారత్‌లో చేర్చడానికి కారణాలేంటని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల మంది లబ్దిపొందుతారని, అదే ఆరోగ్య శ్రీ అయితే.. 77 లక్షల మంది లబ్దిపొందే అవకాశం ఉందని వారే చెప్పారు.. మరి ఇప్పుడు మిగతా 51 లక్షల మందికి, హెల్త్ కార్డులు ఉన్న వారికీ ఎలా న్యాయం చెస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తమిళనాడులో స్టాలిన్ ప్రతిపక్షాలతో టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారని, తెలంగాణలో మాత్రం మంత్రి కేటీఆర్‌కు అప్పగించడంలో మర్మమేంటో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పార్టీలోని కొందరికే రెమిడిసివర్ ఇంజక్షన్ అందుబాటులో ఉంటుందని ఇతర పార్టీ నాయకులకు ఎందుకు దొరకడం లేదని, కోవిడ్ డ్రగ్స్ పక్కదారి పట్టిస్తే, బ్లాక్ చేస్తే అది నేరమని తెలీదా..? అని ప్రశ్నించారు. డీజీపీ.. 31 కోట్ల రూపాయలు మాస్కులు పెట్టుకోకుంటే.. ఫైన్‌లు వేసినట్లు చెప్పారని.. ఇదీ మరీ దారుణం అన్నారు. సర్కార్ ఉచితంగా పంపిణీ చేయాల్సింది పోయి జరిమానాలు వేయడం ఏంటని అన్నారు. అడ్డగోలుగా దండుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలను ఆదుకోవాలని, సినిమా థియేటర్లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల డ్యూటీలో పాల్గొని కరోనాతో చనిపోయిన అధికారుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా వెంటనే రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed