CM KCR , YS Jagan Mohan Reddy సెంటిమెంట్ వ్యూహం.. పేలిన మాటల తూటాలు

by Nagaya |   ( Updated:2022-12-09 02:51:02.0  )
CM KCR , YS Jagan Mohan Reddy  సెంటిమెంట్ వ్యూహం.. పేలిన మాటల తూటాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల మధ్య విభజన మంటలు మండుతున్నాయి. రెండు రాష్ట్రాలూ వచ్చే ఎన్నికల కోసం అదును చూస్తున్నాయి. ఇదే సందర్భంలో ఒకేసారి అటూ.. ఇటూ కలిసి వచ్చే నినాదాన్ని మళ్లీ ఎత్తుకుంటున్నారు. సమైక్య రాష్ట్రం అనే హీట్​ పెంచుతున్నారు. దీంతో ఆంధ్రోళ్లు మళ్లీ వస్తారంటా అని కేసీఆర్​.. తెలంగాణతోనే సమస్య వచ్చిదంటూ ఏపీ ఒకేసారి రాజకీయ విభేదాలను తెరపైకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఏపీ నుంచి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఆజ్యం పోయగా.. దానికి మంత్రి బొత్స సత్యనారాయణ వంత పాడారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ రియాక్షన్​ మొదలైంది. గులాబీ దళం నుంచి విమర్శలను మొదలుపెట్టారు. సజ్జల విషపు వ్యాఖ్యలంటూ ఎమ్మెల్సీ పల్లా నుంచి వార్ స్టార్ట్​చేశారు. దీనిలో కాంగ్రెస్ కూడా భాగస్వామ్యమవుతోంది. సెంటిమెంట్‌ను రగిలించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారంటూ సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​వంటి నేతలు సైతం విమర్శలకు దిగారు. దీంతో విభజన మంటలు రెండు రాష్ట్రాల్లోనూ అంటుకుంటున్నాయి.

అప్పుడు చంద్రబాబు, జల జగడం ఆయుధం

గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్‌కు చంద్రబాబు రూపంలో ఓ ఆస్త్రం, జల జగడాలతో మరో ఆయుధం చేతికి వచ్చింది. నీటి వివాదాలు రెండు రాష్ట్రాల్లో ఇప్పుడున్న అధికార పార్టీలకూ కలిసి వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్​ఇదే స్ట్రాటజీని అమలు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకున్నారంటూ చంద్రబాబు టార్గెట్‌గానే ప్రచారం చేశారు. అదే సమయంలో మహా కూటమి రూపంలో చంద్రబాబు రాష్ట్రానికి రావడం కేసీఆర్​భారీగా కలిసి వచ్చింది. రెండు కండ్ల సిద్ధాంతమంటూ తెలంగాణను అడ్డుకుని, వేల మంది ఆత్మబలిదానాలకు కారణమైన చంద్రబాబును భుజాలపై వేసుకుని.. మోసుకుని వస్తున్నారంటూ కేసీఆర్​నినాదాన్ని ఎంచుకున్నారు. తెలంగాణవాదులు కూడా తెలంగాణకు మళ్లీ చంద్రబాబు రావడాన్ని అంగీకరించలేకపోయారు. దీనికితోడుగా కృష్ణా జలాల తరలింపు కూడా అదనపు బలమైంది. దీంతో సంక్షేమం, మేనిఫెస్టో అనే అంశాలు పక్కకు పోయాయి. చంద్రబాబు, కృష్ణా జలాల రూపంలో సెంటిమెంట్​ కలిసి వచ్చింది రూఢీ అయింది.

మళ్లీ కలువాలి

తాజాగా తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య స్నేహపూర్వక వాతావరణం అంటూ చెప్పుకుంటూనే.. అవసరమైన సమయంలో ఇరుపక్షాలు వివాదాలుకు కాలు దువ్వుతున్నారు. ఏపీ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానమంటూ ఏపీ నేతలు ఒక్కసారిగా హీట్​ పెంచే వ్యాఖ్యలు చేశారు. ఏ అవకాశం దొరికిగా మళ్లీ కలిసేందుకే పార్టీ ఓటు వస్తుందని, టీడీపీ, కాంగ్రెస్​, బీజేపీ మూడు పార్టీలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని, విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేసింది మాత్రం వైసీపీ అని, సుప్రీం కోర్టు కలిసి ఉండాలని ఆదేశిస్తే ఇంకేం కావాలంటూ ఏపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. దీనికి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం వంత పాడారు. ఈ రెండు రాష్ట్రాలు కలిస్తే తప్పేంటంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ నుంచి రియాక్షన్​

విభజన సమస్యలు, రెండు రాష్ట్రాలను కలుపాలంటూ ఏపీ నుంచి వచ్చిన స్టేట్​మెంట్స్​ కు తెలంగాణ నుంచి వెంటనే రియాక్షన్​ కూడా మొదలైంది. ముందుగా కాంగ్రెస్​ నేతలు దీనిపై స్పందించారు. సజ్జల వ్యాఖ్యలు సెంటిమెంట్‌‌ను రగుల్చుతున్నాయంటూ సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ పొన్నం సహా పలువురు నేతలు రిప్లై ఇచ్చారు. కాంగ్రెస్‌ను తప్పు పట్టడంతో వారు స్పందించాల్సి వస్తోంది. మరోవైపు కొంత ఆలస్యంగా గులాబీ దళం నుంచి కూడా రియాక్షన్​ స్టార్ట్​ అయింది. తెలంగాణలో మళ్ళీ ఆంధ్రానాయకులు విబేధాలు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని, 60 ఏండ్ల తెలంగాణను దోచుకున్నారంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగారు. తెలంగాణపై కుట్రలు చేస్తే ఇక్కడే పాతర వేస్తామని, కొంతమంది కుక్కలు.. బొక్కలకు ఆశించి తెలంగాణపై కుట్రలకు సహకరిస్తున్నారని, తెలంగాణ జోలికి వస్తే ఇక్కడి సమాజం ఏకమౌతుందంటూ సెంటిమెంట్‌ను తీసుకువస్తూ ఫైర్​పెంచారు.

అడ్వాంటేజీగా మారనుందా..?

ప్రస్తుతం కేసీఆర్ సర్కారుపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్యాండేట్ గెలిచినప్పటికీ.. ఆయా వర్గాల్లో మాత్రం వ్యతిరేకత బయటపడింది. దీన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా సఫలం కావడం లేదు. ఇదే సమయంలో నిధుల లేమి కూడా ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో ఎన్నికల కాలం దగ్గరకు వస్తోంది. కీలకమైన నేపథ్యంలో ఎలాంటి సందర్భం లేకుండానే ఏపీ నుంచి సెంటిమెంట్​రగిలించే అంశం మీదకు తెచ్చారు. దీన్ని కేసీఆర్​ అడ్వాంటేజీగా తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, కేసీఆర్​స్థాయిలో కాకుండా.. ముందుగా రాష్ట్ర మంత్రులు, నేతలను రంగంలోకి దింపే చాన్స్​ ఉంది. ఏపీ నుంచి యాక్షన్​ మొదలుకాగానే.. టీఆర్ఎస్ నుంచి రియాక్షన్‌గా సెంటిమెంట్​వ్యాఖ్యలపై మరింత పెట్రోల్​పోసినట్లుగా మారుతోంది. ప్రస్తుతం దీన్ని అడ్వాంటేజీగా తీసుకుని అనుకూలంగా మల్చుకునే వ్యూహాలు మొదలయ్యాయి.

ఈసారి అదే అంశం

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలు అడపాదడపా నీటి వివాదాలు చల్లారనీయడం లేదు. పోలవరం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై సందర్భాన్ని బట్టి విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. దీనికి అదనంగా ఇప్పుడు విభజన అంశాలను తెరపైకి తీసుకువచ్చారు. ఈ వివాదాలను ఇంకో రెండు, మూడు నెలలు సాగదీస్తే.. రాష్ట్రంలో కేసీఆర్‌కు అనుకూలత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు షర్మిల అంశం కూడా కేసీఆర్‌కు అదనపు బలంగా మారుతోంది. ఏపీ సీఎం సొంత చెల్లె తెలంగాణలో ఆధిపత్యం కోసం పార్టీ పెట్టడంపై ఇప్పటికే వ్యూహాత్మక విమర్శలు వదులుతున్నారు. ఇటీవల షర్మిల పాదయాత్రకు అడ్డంకులు, అరెస్ట్​ వంటి అంశాలతో అసలు షర్మిలకు తెలంగాణలో ఏం పని అనే ప్రచారాన్ని ప్రజల్లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు జగన్​, షర్మిలతో పాటుగా మళ్లీ తెలంగాణ టీడీపీ రూపంలో చంద్రబాబు కూడా ఇటువైపు వస్తే.. ఇక కేసీఆర్ ప్రభుత్వానికి ఢోకా ఉండదనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed