- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీ ప్రచారంలో ఏ పార్టీ ఏమన్నది?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు గురువారం సాయంత్రం ముగిసింది. దీంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని కట్టిపెట్టేశాయి. ఇప్పుడు అభ్యర్థులు డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో తలమునకలయ్యారు. దాదాపు నెలరోజులు సాగిన ప్రచారంలో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు మూడు పార్టీలు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాయి. తిరిగి అధికారాన్ని సొంతం చేసుకుంటామన్న ధీమాతో ఆప్ ప్రచారాన్ని నిర్వహించింది. 22 ఏళ్ల క్రితం ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలన్న పంతాన్ని చూపించింది. కాగా, ‘షీలా వాలా ఢిల్లీ’ అంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది. హోరాహోరీగా సాగిన ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు.. అలాగే రాజకీయ పార్టీలు అనుసరించిన వ్యూహాలు, ఇచ్చిన హామీలను ఓ సారి పరిశీలిద్దాం..
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ‘ఉచితాల’తోపాటు ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థి, కేజ్రీవాల్ ఐదేళ్ల పాలన, సీఏఏ, టుక్డే టుక్డే గ్యాంగ్, షహీన్‌బాగ్, యూనివర్సిటీ విద్యార్థులపై దాడులు, దేశద్రోహం, ఉగ్రవాదం, రామ మందిర నిర్మాణం, అక్రమ నిర్మాణాలు, మొహల్లా క్లినిక్‌లు, తాగునీరు విద్యుత్ సదుపాయం లాంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.
కేజ్రీవాల్ వర్సెస్ మోడీ.. కానేకాదు..!
కేజ్రీవాల్ మొదటి నుంచీ రాష్ట్ర ఎన్నికలను జాతీయ ఎజెండాగా మారకుండా నియంత్రించేందుకు ఆచితూచి అడుగులు వేశాడు. పౌరసత్వ సవరణ చట్టంపై నోరుమెదపలేదు. ఆప్ ప్రభుత్వం హయాంలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాలనే ఎజెండాగా ప్రచారాన్ని చేపట్టాడు. తొలుత రిపోర్టు కార్డు పేరిట అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం.. తర్వాత గ్యారంటీ కార్డు అంటూ హామీలను వివరించే వ్యూహాన్ని కేజ్రీవాల్ చేపట్టారు. అలాగే, సీఎం అభ్యర్థి ఎవరని? ఎవరిని చూసి ఓటేయమంటారని బీజేపీపై ఎదురుదాడికీ దిగారు. అయితే, ఈ ఎన్నికలను కేజ్రీవాల్ వర్సెస్ మోడీగా ముందుకు తెచ్చిన వాదనలను వీలైనంతగా తిప్పికొట్టారు. మోడీ తమ ప్రధాని అని.. అతను ఢిల్లీ సీఎంగా బాధ్యతలు తీసుకోరుగా అంటూ ప్రశ్నలు వేశారు. తమ అభివృద్ధి కార్యక్రమాలతో సంతృప్తి చెందితేనే ఆప్‌కు ఓటేయాలనీ ధీమాగా ఓటర్లను అభ్యర్థించారు. సీఏఏ, ఎన్ఆర్‌సీలతోపాటు షహీన్‌బాగ్ ఆందోళనలపైనా ఆయన వ్యాఖ్యలు చేయలేదు. నీరు, విద్యుత్ సహా మహిళలకు బస్సు, మెట్రో ప్రయాణాలను ఉచితంగా అందించే హామీనిచ్చారు. ఆప్ ప్రచారమంతా కేజ్రీవాల్ కేంద్రంగానే సాగింది.
ఎజెండా.. షహీన్‌బాగ్
బీజేపీ ఈ ఎన్నికలను జాతీయాంశాలపై పోరాడే వ్యూహాన్ని అనుసరించింది. స్థానికాంశాల కన్నా సీఏఏ, షహీన్‌బాగ్ ఆందోళనలనే ప్రచారాస్త్రాలుగా వాడుకుంది. ప్రధాన మంత్రి మోది మొదలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ల వరకు దాదాపుగా అందరూ షహీన్‌బాగ్‌పై ప్రసంగాలు చేశారు. పీహెచ్‌డీ స్కాలర్ షర్జీల్ ఇమామ్ వివాదాస్పద వ్యాఖ్యలు మొదలు.. ఉగ్రవాదం, దేశద్రోహం విషయాలను ప్రస్తావించారు. ఒకానొక దశలో ఈ ఎన్నికలు పాక్ వర్సెస్ ఢిల్లీగా చిత్రించే యత్నం చేశారు. అలాగే, సీఎం అభ్యర్థిని ప్రకటించకున్నా.. ఈ ఎన్నికలను మోడీ కేంద్రంగా పోరాడేందుకు రంగంలోకి బీజేపీ దిగింది. ఉచితాలను ప్రత్యేకంగా ప్రకటించకున్నా.. ఇప్పుడు అమల్లో ఉన్న ఉచితాలను అలాగే కొనసాగిస్తామన్న సంకేతాలనిచ్చారు. శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్రను మోది ప్రకటించి అయోధ్యను ప్రస్తావించినట్టయింది.
షీలా వాలా ఢిల్లీ ట్యాగ్‌లైన్‌తో కాంగ్రెస్
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం పెద్దగా ప్రజలకు చేరువకాలేదు. ఇక్కడ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోరు సాగింది. షహీన్‌బాగ్ ఆందోళనలు, సీఏఏ – ఎన్ఆర్‌సీల విషయంలో ఒక వైఖరిని తీసుకుని ఇరు పార్టీలు ఆప్, బీజేపీ నేతలపై కాంగ్రెస్ విమర్శలు సంధించింది. షీలా వాలా ఢిల్లీ అంటూ కాంగ్రెస్ హయాంలోని అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేసింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలపై ఓట్లడిగే ఎత్తుగడను అనుసరించింది. షహీన్‌బాగ్ ఆందోళనలకు మద్దతుగా నిలిచింది. జేఎన్‌యూ, జామియాలకు సంబంధించిన దాడులను తీవ్రంగా పరిగణించి హోం మంత్రి అమిత్ షాపై విమర్శలు సంధించారు. అలాగే, పేదలకు ప్రతినెల 300 యూనిట్ల విద్యుత్, 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందించే హామీనిచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ప్రచారంలోకి దిగారు.