మీకు మేమున్నాం.. మావోయిస్టుల మీటింగ్‌లకు వెళ్లొద్దు : ఎస్పీ సునీల్ దత్

by Sridhar Babu |   ( Updated:2021-09-20 07:50:54.0  )
మీకు మేమున్నాం.. మావోయిస్టుల మీటింగ్‌లకు వెళ్లొద్దు : ఎస్పీ సునీల్ దత్
X

దిశ, భద్రాచలం : మావోయిస్టులు నిర్వహించే మీటింగ్‌లకు ఎవరూ వెళ్ళవద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్‌పీ సునీల్‌దత్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పుట్టపాడు – పెసర్లపాడు గ్రామాల నడుమ అటవీ ప్రాంతంలో 21వ తేది మంగళవారం మావోయిస్టులు నిర్వహించే మీటింగ్‌కు ప్రజలు తరలిరావాలని మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు చర్ల మండల బోర్డర్‌ అటవీ ప్రాంతాలైన చెన్నాపురం, ఎర్రంపాడు, బత్తినిపల్లి, భట్టిగూడెం, ఆర్‌సీ పురం, కుర్నపల్లి, బోదనెల్లి కొండెవాయి గ్రామాలలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.

తప్పనిసరిగా సమావేశానికి రావాలని హుకూం జారీ చేసి మావోయిస్టులు అమాయక ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలిసిందన్నారు. మీటింగ్‌కు వచ్చేటపుడు బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలు తీసుకురావాలని.. ఒకవేళ రాకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు అమాయక ఆదివాసీ ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. ఆదివాసీలతో బలవంతంగా సరిహద్దు గ్రామాల్లో గుంతలు తవ్వించి అందులో ఇనుపరాడ్స్ పెట్టిస్తున్నారని వివరించారు. ఇలాంటి పనులు చేయడం ఆదివాసీ ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయిస్తున్నారని ఎస్‌పీ వెల్లడించారు.మావోయిస్టు పార్టీ చేసే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎట్టిపరిస్థితుల్లో ఆదివాసీ ప్రజలు సహకరించరాదని ఎస్‌పీ సునీల్‌దత్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story